పసిఫిక్ మహా సముద్రంలో 50 రోజుల పాటు ప్రాణాలతో పోరాడి నలుగురు వ్యక్తులు సురక్షితంగా బయటపడిన ఉదంతమిది. స్థానిక మీడియా కథనం ప్రకారం కార్టెరెట్ ఐలాండ్‌లో క్రిస్‌మస్ వేడుకలు జరుపుకొనేందుకు మొత్తం 12 మంది తో కూడిన బృందం వెళ్లగా అందులో ఎనిమిది మంది మృత్యువాత పడినట్లు బుధవారం పేర్కొంది. పాపువా న్యూ గినియాలోని బౌగన్‌విల్లే ప్రావిన్స్‌కు చెందిన ఓ బృందం డిసెంబరు 22న కార్టెరెట్ ఐలాండ్‌కు వెళ్లారు.ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడగా ఏడుగురు మునిగిపోయారు.
ఓ చిన్నపాపతో పాటు మరో నలుగురు బోటును గట్టిగా పట్టుకుని వేలాడుతూ అందులోని నీళ్లు తొలగించి ప్రాణాలతో బయటపడ్డారు. అయితే సరైన ఆహారం లేకపోవడంతో చిన్నపాప మరణించగా.. ఇద్దరు వ్యక్తులు, ఓ మహిళ, పన్నెండేళ్ల బాలిక మాత్రమే మిగిలారు. ఈ క్రమంలో వీరంతా సముద్ర తీరంలో దొరికిన కొబ్బరికాయలు తింటూవర్షపు నీరు తాగుతూ ప్రాణాలు నిలబెట్టుకున్నారు. ఆఖరికి చేపల వేటకు బయల్దేరిన ఓ సమూహం వీరిని గుర్తించి సాయం అందించడంతో సముద్రం నుంచి బయటపడ్డారు.