డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ హోం మంత్రి కాబోతున్నారా? డిప్యూటీతో పాటు హోం కూడా సేనాని చేతుల్లోకి వచ్చేస్తుందా? అంటే పిఠాపురం నియోజకవర్గం పర్యటనలో ఆయన చేసిన కామెంట్స్ చూస్తే ఇదే నిజమనిపిస్తోంది. హోం శాఖతో పాటు మంత్రి వంగలపూడి అనితపై కూడా సంచలన వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ అయ్యింది. దీనికి తోడు నేనే హోం శాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ వ్యాఖ్యలు హోం మంత్రి సరిగ్గా పనిచేయనట్టే..అందుకే తాను తీసుకుంటాను అన్నట్లుగా ఉన్నాయని కొందరు నొచ్చుకుంటున్నారు కూడా.
ఇంతకీ పవన్ ఎందుకిలా మాట్లాడారు? ఇంకా ఏమేం మాట్లాడారు? అనే విషయాలు చూద్దం. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక నేరాలు, ఘోరాలు పెరిగిపోయాయన్నది వైసీపీ చేస్తున్న పెద్ద ఆరోపణ. అసలు శాంతి భద్రలు ఏపీలో ఉన్నాయా? లా అండ్ ఆర్డర్ ఏమైంది? అని అత్యాచారాలు, హత్య, దాడులతో సామాన్యుడు బతకలేని పరిస్థితి ఉందని నుంచి కూడా ఇదే ప్రశ్న వస్తోంది. ఈ పరిస్థితుల్లో హోం శాఖ, లా అండ్ ఆర్డర్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో సంబంధిత మంత్రులు, ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టే.
అంటే వంగలపూడి అనిత, చంద్రబాబు సరిగ్గా పనిచేయనట్టే అని చెప్పకనే చెప్పేశారన్నది విమర్శకుల మాట. ఇలా చేస్తే నేనే హోంమంత్రిని అవుతాను. నేను హోంమంత్రిని అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయి. విమర్శలు చేసే వారిని ఇలాగే వదిలేస్తే హోంమంత్రిగా నేను బాధ్యతలు తీసుకుంటాను. హోంమంత్రి అనిత రివ్యూ చేయాలి. లా అండ్ ఆర్డర్ చాలా కీలకం. పోలీసులు మర్చిపోకండి. నేతలు ఇలానే ఏమీ చేయకుండా నిశ్చలంగా ఉంటే హోంమంత్రి బాధ్యతలు కూడా నేనే తీసుకుంటాను అని ఆయన అన్నారు.
హోంమంత్రి వంగలపూడి అనిత పనితీరుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేయడం, పనితీరు మార్చుకోవాలని బహిరంగ సభలో కోరడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనానికి కారణమైంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ తమ ప్రభుత్వంపైనే ఆగ్రహం వ్యక్తం చేయడం, రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయని పరోక్షంగా అంగీకరించడం కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు ఐదు నెలలు అవుతున్నా..ఎవరిపైనా కఠిన చర్యలు లేకపోవడం పవన్ కళ్యాణ్‌తో పాటు కూటమి నేతలకు, కార్యకర్తలకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.
తాము అధికారంలోకి వస్తే గతంలో అడ్డమైన పనులు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రచారంలో ఎన్‌డిఏ అగ్రనేతలు చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత ఎవరిపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఇదే విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును, అధికారంలో ప్రధాన వాటా అనుభవిస్తోన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి తనయుడు లోకేష్‌ను ప్రశ్నిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని బదులు ఇస్తున్నారు తప్ప ఇంత వరకూ ఎవరిపై కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
అడ్డగోలుగా మాట్లాడిన వారు, బూతులు తిట్టిన వారు, హత్యలు చేసినవారు, దాడులు చేసిన వారూ, అత్యాచారాలు చేసిన వారూ, అవినీతికి పాల్పడిన వారిని ఎవరినీ ఏమీ చేయలేకపోయింది కూటమి ప్రభుత్వం. దీన్ని అలుసుగా తీసుకుని వైకాపా నేతలు, కార్యకర్తలు, సోషల్‌మీడియా కార్యకర్తలు మరింత చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్, పవన్‌కళ్యాణ్‌లతో పాటు వారి ఇంటిలోని ఆడబిడ్డలపై బూతులతో రెచ్చిపోతున్నారు. ఇలా రెచ్చిపోతున్నవారిపై కేసులు పెట్టాల్సిన పోలీసులు చోద్యం చూస్తున్నారు.
అంతేనా ఎవరినైనా అరెస్టు చేస్తే..వెంటనే బెయిల్‌పై విడుదల చేస్తున్నారు. నిన్నటిదాకా వైకాపా నేతల చేతుల్లో అవమానాలకు గురైన కూటమి నేతలు..ఇప్పుడు పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో తీవ్ర నిరాశకు, ఆగ్రహానికి గురవుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లు తమకు పదవులు వచ్చాయి కనుక మిగతావారు ఏమైనా ఫర్వాలేదు..వైకాపా వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ఎందుకు..? అనే ఉద్దేశ్యంతో ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో..వైకాపా నేతలు, కార్యకర్తలు మరింతగా రెచ్చిపోతున్నారు.
కక్షపూరిత రాజకీయాలు చేయమని ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నారు..కక్షపూరిత రాజకీయాలు చేయమని ఎవరూ కోరడం లేదు..కానీ..తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకోవడానికి ఇన్ని రోజులా..? కనీసం ఒక్క వైకాపా నాయకుడిని కూడా ఈ ఆరు నెలల్లో అరెస్టు చేసిన పాపాన పోలేదు. ముఖ్యమంత్రి ఇచ్చిన అలుసుతో వారు తమను ఎవరూ ఏమీ చేయలేరని, అడ్డగోలుగా వ్యవహరిస్తూ వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. ఇప్పుడు పవన్ వ్యాఖ్యలు కూటమికి కొంత నష్టం చేకూర్చినా..సరైన రీతిలోనే ఉన్నాయనే అభిప్రాయాన్ని కల్గిస్తున్నాయి.
తప్పు చేసిన అధికారులపై చర్యలు ఉండవు..వారికి రాచమర్యాదలు చేసి ఇంటికి పంపుతారు..తప్పుడు పనులు చేసిన వైకాపా సోషల్ మీడియావారిపై చర్యలు ఉండవు. సాక్షాత్తూ హోంమంత్రి అనితని తప్పుడు మాటలతో దూషించిన వర్రా రవీందర్‌రెడ్డి అనే వైకాపా సోషల్‌మీడియా కార్యకర్తపై కనీసం కేసు కూడా పెట్టలేదు. దీంతో అతగాడు మరింతగా విజృంభించి అసభ్య పదాలతో దూషిస్తున్నారు. అనిత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే..వర్రాను ఉద్దేశించి మాట్లాడుతూ..తాము అధికారంలోకి వస్తే..ఏమి చేస్తామో చూద్దువుగానీ..అని శపథం చేశారు.
అధికారంలోకి వచ్చారు..ఆమే హోంమంత్రి అయ్యారు..కానీ..వర్రా రవీంద్రరెడ్డి అనేవాడు..హాయిగా..కాలు మీద కాలేసుకుని దర్జాగా సోషల్‌మీడియాలో మళ్లీపోస్టులు పెడుతున్నాడు. పేరుకు అనిత హోంమంత్రి అయినా..ఆమెకు అధికారాలు ఏమున్నాయి..అధికారాలు చేతిలో ఉన్నవారు.. తమకెందుకులే.. వారితో శత్రుత్వం ఎందుకని..కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఇటువంటి పరిస్తితుల్లో పవన్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని, ఆయన కూటమి హితం కోసమే..ఆరకంగా మాట్లాడారనే మాట సర్వత్రా వినిపిస్తోంది.
ఒక్క మాటలో చెప్పాలంటే..పవన్‌ది ధర్మాగ్రహం. ఇళ్లలోకి వెళ్లి మహిళపై అత్యాచారం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? అత్యాచార నిందితుల అరెస్ట్‌కు కులం అడ్డువస్తోందా? క్రిమినల్స్‌ను వదిలేయాలని ఏ చట్టం చెబుతోంది? అధికారులకు, ఎస్పీలకు చెబుతున్నా శాంతిభద్రతలు కీలకమైనవి. ఇటీవల జరిగిన అత్యాచార ఘటనలపై హోంమంత్రి బాధ్యత వహించాలి. పసికందులపై అత్యాచార ఘటనలు అత్యంత దారుణం. గతంలో చంద్రబాబు సతీమణిపై, నాపై.. నా కుమార్తెలపై వ్యక్తిగత విమర్శలు చేశారు. నాడు డీజీపీ సహా పోలీస్ అధికారులు ఎవరూ స్పందించలేదు. దాని ఫలితమే ఇప్పుడు చూస్తున్నాం. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు గతంలో వైసీపీ నేతలు ప్రోత్సహించారు అని పవన్ వ్యాఖ్యానించారు.