ఓడిపోయిన తర్వాత మొహం చాటేసే నాయకులకు భిన్నంగా ముందుకు వెళుతున్న జన సేన నాయకుడు పవన్ కళ్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ లో గ్రాఫ్ పెరుగుతున్నది. వైసిపి అధికారంలోకి రావడం, తెలుగుదేశం పార్టీ కనుమరుగు అయ్యే పరిస్థితి కనిపిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ శక్తుల పునరేకీకరణ జరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలను ముందుగానే కనిపెట్టిన పవన్ కళ్యాణ్ క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలు చేపడుతూ ప్రజలలోకి వెళుతున్నారు. ఇది చాలా మంది ఊహించలేదు. పార్టీ దారుణమైన ఓటమి పాలైన తర్వాత నాయకులు కనుమరుగు కావడం చూసే ప్రజలకు పవన్ కళ్యాణ్ కొత్తగా కనిపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడి చేతిలో కీలుబొమ్మ అని విమర్శల వర్షం కురిపిస్తున్నా పవన్ కళ్యాణ్ వెనుకంజవేయడం లేదు. చంద్రబాబునాయిడు పెట్టిన పెయిడ్ ఆర్టిస్టు అని పవన్ కళ్యాణ్ ను వైసిసి తీవ్రంగా విమర్శిస్తున్నది. అయితే పవన్ కళ్యాణ్ ఈ విమర్శలకు ఎక్కడా సమాధానం చెప్పడంలేదు. ఈ అంశం చాలా మందిని ఆకట్టుకుంటున్నది. పవన్ కళ్యాణ్ ముందే చెప్పినట్లు ఆయన పని ఆయన చేసుకుంటున్నారు అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పై కుల ముద్ర చెరపరానంతగా పడిపోవడంతో ఆ పార్టీనాయకులు క్షేత్ర స్థాయిలో పని చేయలేకపోతున్నారు. పైగా తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతున్న నాయకులతో ఆ పార్టీ అతలాకుతలం అవుతున్నది. ఎవరు ఉంటారో ఎవరు వెళ్లిపోతారో అనే సందిగ్ధంలో పార్టీ కార్యక్రమాలకు అంతరాయం కలుగుతున్నది. పైగా తెలుగుదేశం పార్టీలో అందరూ అగ్రనాయకులే ఉన్నారు. ఉన్నవారంతా అగ్రనాయకులమే అనుకుంటూ క్షేత్ర స్థాయిలో పని చేయడం మానేశారు. కేవలం ప్రెస్ కాన్ఫరెన్సులకే పరిమితం అయి పోయారు. బిజెపి ఆంధ్రప్రదేశ్ లో పెరిగేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నా సాధ్యం కావడం లేదు. ఈ పరిస్థితిని పవన్ కళ్యాణ్ తనకు అనుకూలంగా మలచుకుంటున్నారు. అందుకే ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నదని ఆ పార్టీ అంచనా వేస్తున్నది. అంతే కాకుండా కమ్మ రెడ్డి పార్టీలు కాకుండా మూడో శక్తి ముందుకు రావాలని చాలా మంది భావించడం కూడా పవన్ కళ్యాణ్ కు కలిసి వస్తున్నది. ఇదే తరహాలో పవన్ కళ్యాణ్ ముందుకు వెళితే రాబోయే ఎన్నికల సమయానికి ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన రాజకీయ శక్తిగా అవతరించేందుకు అవకాశం కనిపిస్తున్నది.
previous post