36.2 C
Hyderabad
April 25, 2024 20: 38 PM
Slider ప్రత్యేకం

ఎంపి రఘురామ అరెస్టు అప్రజాస్వామికం

#PawanKalyan

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణంరాజు అరెస్టును జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఆయన ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ప్రకటన పూర్తి పాఠం:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విశృంఖలంగా విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కదిలించి ప్రజలను రక్షించవలసి ఉండగా – ఎంపీ రఘురామకృష్ణంరాజును అరెస్టు చేయడం ఏమాత్రం సమర్ధింపు చర్య కాదని జనసేన భావిస్తోంది. ప్రభుత్వాన్ని తరుచు తీవ్రంగా విమర్శిస్తున్నారనే కారణంతో ఎంపీని సమయం, సందర్భం లేకుండా అరెస్టు చేయడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.

ఒక పక్క కరోనా సోకిన వారికి ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క, ఆక్సిజన్ అందక, రెమిడిసివర్ ఇంజక్షన్లు బ్లాక్ మార్కెట్లకు తరలిపోతుండగా అవసరమైన మందుల కోసం పది షాపులు తిరగవలసిన క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ యంత్రాంగం అంతా ప్రజల బాధలపై దృష్టిపెట్టాలి. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసు బలగాలను ఉపయోగించి అరెస్టు చేయడం అప్రజాస్వామికంగా జనసేన భావిస్తోంది.

ఒక పక్క ఆంధ్రప్రదేశ్ నుంచి వైద్యం కోసం వెళుతున్న అంబులెన్స్ లను పక్క రాష్ట్ర సరిహద్దుల్లో ఆపేసినా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది. చివరికి తెలంగాణ హైకోర్టు జోక్యం చేసుకుంటే కానీ అంబులెన్స్ లు కదిలే పరిస్థితి రాలేదు. రాష్ట్రంలో కోవిడ్ ను ఏదో అద్భుతాలు సృష్టించి ఆపమని జనసేన కోరడం లేదు.

వైద్యపరంగా అక్కడున్న వనరులు, వైద్య సిబ్బంది, ఇతరత్ర అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతోంది. ప్రత్యర్ధి పార్టీ నేతలతోపాటు సొంత పార్టీ ఎంపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఇలాంటి విపత్కర సమయంలో సొంత పార్టీ ఎంపీనీ అరెస్టు చేయడంపై చూపించిన శ్రద్ధ ఏ విధంగా హేతుబద్ధమో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాల్సి ఉంది. ఊరూరా కొల్లలుగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.

ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని భయంభయంగా గడుపుతున్నారు. ప్రజల్లో మనో ధైర్యాన్ని నింపి, ఆక్సిజన్, మందులు, ఆస్పత్రుల్లో బెడ్లు అందేలా ప్రభుత్వం తన దృష్టిని కేంద్రీకరించాలని జనసేన విజ్ఞప్తి చేస్తోంది. కొంత కాలంపాటైనా రాజకీయ దమననీతిని కట్టిపెట్టాలని డిమాండ్ చేస్తోంది.

(పవన్ కళ్యాణ్)

అధ్యక్షులు జనసేన పార్టీ

Related posts

కరోనాపై పోలీస్ కళాబృందం పాటలు ఆవిష్కరించిన అదనపు ఎస్పీ

Satyam NEWS

బొలెరో కారు లారీ ఢీ: ముగ్గురి మృతి

Bhavani

రైతు భరోసా కేంద్రం ప్రారంభించిన కొరముట్ల

Satyam NEWS

Leave a Comment