39.2 C
Hyderabad
March 29, 2024 13: 25 PM
Slider సంపాదకీయం

బీజేపీకి షాక్ ఇచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్

#pavankalyan

పవన్ కల్యాణ్ ఇచ్చిన షాక్ తో తెలంగాణ బీజేపీ విలవిలలాడుతున్నది. వచ్చే ఎన్నికల్లో తక్కువ సీట్లు అయినా సరే పోటీ చేస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించడం తెలంగాణ బీజేపీకి గుండెల్లో కలకలం రేపింది. తెలంగాణ లో అధికారంలోకి వస్తామని ఇంత కాలం చెబుతున్న బీజేపీకి ఇది మింగుడు పడని పరిణామంగా మారింది.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యమైపోయిందని బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ భావించింది. తెలంగాణ లో బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకోదని, సొంతంగానే అన్ని సీట్లకు పోటీ చేస్తుందని ఆ పార్టీ నేతలు ఇంత కాలం ఘంటాపదంగా చెప్పారు.

తెలంగాణ లో బీజేపీకి ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తున్నదని ఆ పార్టీ నేతలు చెబుతున్న తరుణంలో పవన్ కల్యాణ్ రంగంలోకి రావడంతో ఒక్క సారిగా వారికి షాక్ తగిలింది. తాను ఒక ఆశయం కోసం పోరాడుతున్నట్లు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. జగిత్యాలలో పవన్‌ మాట్లాడుతూ ‘‘తెలంగాణ ప్రజలకు సందేశం ఇచ్చే స్థాయిలో నేను లేను. వారి నుంచి నేర్చుకునే స్థాయిలోనే ఉన్నాను.

తెలంగాణ ప్రజలు చేసిన పోరాటాల నుంచి స్ఫూర్తిని పొందుతాను. సమాజం నుంచి తీసుకున్న వాళ్లం తిరిగి సమాజం కోసం ఏదైనా చేయాలని నేను భావిస్తా. తెలంగాణలో పరిమిత సంఖ్యలో 7 నుంచి 14 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసేందుకు జనసేన సిద్ధంగా ఉంది. తెలంగాణలోనూ ఎవరైనా పొత్తుకు వస్తే సంతోషం’’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో నాలుగు పార్లమెంటు స్థానాలు సాధించిన బీజేపీ ఈ సారి పది స్థానాల వరకూ సాధించాలని అనుకుంటున్నది.

అసెంబ్లీ ఎన్నికల కన్నా పార్లమెంటు ఎన్నికలపైనే బీజేపీ దృష్టి ఎక్కువగా ఉన్నది. అయితే ఈ సమయంలో పవన్ కల్యాణ్ వచ్చేసి లోక్ సభ ఎన్నికల గురించే ప్రస్తావించడం బీజేపీ అధిష్టానానికి కూడా షాక్ తగిలింది. పవన్ కల్యాణ్ తెలంగాణ లో పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం ఖాయంగా కనిపిస్తున్నది.

ఈ కారణంగా బీఆర్ఎస్ లాభపడుతుంది తప్ప బీజేపీకి తీరని నష్టం వాటిల్లుతుంది. పవన్ కల్యాన్ ఈ విధంగా బీజేపీకి నష్టం చేస్తారని ఆ పార్టీ పెద్దలు భావించలేదు. అయితే పవన్ కల్యాణ్ తెలంగాణ లోకి పోటీకి సిద్ధపడిపోయారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణ లో భారీ బహిరంగ సభ నిర్వహించి ఎన్నికల బరిలో తానూ ఉన్నానన్ని గుర్తు చేసింది.

తెలుగుదేశం పార్టీకి దాదాపు 40 నియోజకవర్గాలలో గణనీయమైన ఓట్లు ఉన్నాయి. ఈ విధంగా తెలుగుదేశం, జనసేన పార్టీలు రంగంలో దిగితే బీజేపీ ఆశలకు పూర్తిగా గండి పడుతుంది. ఇప్పటికే ఎన్ని ఎత్తుగడలు వేసినా దీటైన అభ్యర్ధులు దొరక్క సతమతం అవుతున్న తెలంగాణ బీజేపీకి పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రకటన షాక్ కొట్టేలా చేసింది.

Related posts

ట్రాజిక్:బ్రిడ్జిపై నుండి వ్యాన్ బోల్తా 8మంది మృతి

Satyam NEWS

మాన‌వ‌సేవ నే మాధ‌వ సేవ: దాస‌న్న‌పేట‌లో చ‌లి వేంద్రం ప్రారంభం

Satyam NEWS

కరోనా ముమ్మరంగా ఉన్నప్పుడే ఏపీలో పీపీఈ కిట్లు లేవు

Satyam NEWS

Leave a Comment