భవన నిర్మాణ కార్మికుల కష్టాలు చూడని ప్రభుత్వం ఒక ప్రభుత్వమా అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఈ ప్రశ్న లాంగ్ మార్చ్ తో ఆగదు. ఎందుకంటే విశాఖపట్నంలో నేడు జరిగిన లాంగ్ మార్చ్ పూర్తిగా విజయవంతం అయింది. బహిరంగ సభకు వచ్చిన ప్రజలు స్పందించిన తీరు పవన్ కళ్యాణ్ కే కాదు అక్కడికి వచ్చిన నేతలందరికి ఉత్సాహం తెప్పించింది.
మరీ ముఖ్యంగా ఈ సభ రాజకీయ పునరేకీకరణకు బీజం వేయబోతున్నట్లుగా కనిపించింది. బిజెపి, తెలుగుదేశం పార్టీలు పవన్ కళ్యాణ్ పిలుపు ఇచ్చిన వెంటనే స్పందించడం రాజకీయ పునరేకీకరణ దిశగా సాగవచ్చు. ఇంత కాలం పవన్ కళ్యాణ్ తో కలిసి ఇంత కాలం నడిచిన కమ్యూనిస్టులు లాంగ్ మార్చ్ కి దూరం కావడం వారి క్షణికావేశ నిర్ణయానికి ఉదాహరణగా చెప్పవచ్చు. వేదికపై బిజెపి ఉంటుందన్న ఒకే ఒక అతి చిన్న కారణంతో కమ్యూనిస్టు పార్టీలు ఇంతకాలం తమతో నడిచిన పవన్ కళ్యాణ్ ను వదిలేశాయి.
పవన్ కళ్యాణ్ బిజెపిని పిలవడం వారితో ఎన్నికల పొత్తు పెట్టుకోవడానికి కాదు కదా? కేవలం ఇసుక సమస్యపై లాంగ్ మార్చి జరిగింది. వాస్తవంగా పవన్ కళ్యాణ్ స్థానంలో మరే రాజకీయ నాయకుడైనా ఉంటే ఈ లాంగ్ మార్చ్ కి తెలుగుదేశం పార్టీని పిలిచేవాడు కాదు. నాలుగు నెలల కిందట పరాజయం పాలైన పార్టీ తెలుగుదేశం. అదీ కాకుండా తెలుగుదేశం పార్టీ కి పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అంటూ వైసీపీ ప్రచారం చేస్తున్నది.
ఈ ప్రచారం ప్రజలు నిజమని నమ్ముతారేమోననే భయంతో పవన్ కళ్యాణ్ స్థానంలో వేరే నాయకుడు ఉంటే తెలుగుదేశం పార్టీని ఆహ్వానించరు. అలా కాకుండా రాజకీయాలను పక్కన పెట్టి పవన్ అన్ని రాజకీయ పార్టీలనూ సభకు పిలిచారు. భవన నిర్మాణ కార్మికల పక్షాన వాస్తవంగా నిలబడాల్సింది కమ్యూనిస్టులు. అయితే రాజకీయాల కోసం కమ్యూనిష్టులు తమ విధి ధర్మాన్ని కూడా మర్చిపోయారు. అయితే పవన్ కళ్యాణ్ ఇవేవీ పట్టించుకోలేదు. మద్దిలపాలెం తెలుగుతల్లి విగ్రహం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకూ లాంగ్‌మార్చ్ సాగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న లాంగ్‌మార్చ్‌ను సాగరతీరంలో నిర్వహించేందుకు పార్టీ అనుమతి కోరినా అధికారులు తిరస్కరించారు. చివరి నిమిషంలో వేదిక ఏర్పాటు కుదరదని పోలీసులు అడ్డుతగిలారు. పలు దఫాల చర్చలతో అర్ధరాత్రి 12 గంటల తర్వాత అనుకున్న చోట వేదిక ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా లాంగ్ మార్చ్ విజయవంతం కావడం మాత్రం ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వానికి మింగుడు పడే అంశం కాదు.