28.7 C
Hyderabad
April 20, 2024 10: 22 AM
Slider ముఖ్యంశాలు

బత్తాయిని ప్రభుత్వమే కొనుగోలు చేసి ప్రజలకు ఇవ్వాలి

Uttamkumar reddy

లాక్ డౌన్ నేపథ్యంలో రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వమే బత్తాయిని కొనుగోలు చేసి ప్రజలకు ఇవ్వాలని నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు, పీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జిల్లాలో కరోనా నివారణ చర్యలు,ధాన్యం సేకరణ, బత్తాయి ఎగుమతులపై తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తో ఎంపీ సమీక్షించి తగు సూచనలు చేశారు.

అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ  కరోనా నేపథ్యంలో బత్తాయి, నిమ్మ ఎగుమతులకు తీవ్ర ఆటంకాలు ఏర్పడి రైతులు నష్టపోతున్నారని, ఢిల్లీకి ఎగుమతులు కావడం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే రూ.200 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసి ప్రజలకు ఇవ్వాలని కోరారు.

లాక్ డౌన్ లో రాష్ట్రప్రభుత్వం ఇస్తానన్న 12 కిలోల బియ్యం, 1500 రూపాయలు ఇంకా పూర్తిస్థాయిలో ప్రజలకు చేరలేదని అన్నారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యం నాణ్యతగా లేవని , దీంతో ప్రజలు తినడం లేదని తెలిపారు. కేంద్రం ఇస్తామన్నా కిలో కందిపప్పు, గ్యాస్ ఇంకా  ప్రజలకు అందలేదని చెప్పారు.

తెల్ల రేషన్ కార్డు లేని వారికి 12 కిలోల బియ్యంతో పాటు కేంద్రం ఇచ్చిన ఐదు కిలోల బియ్యం కూడా అందజేయాలని కోరారు. వలస కూలీల విషయంలో ప్రభుత్వ మాటలకు ఆచరణకు పొంతన లేదని విమర్శించారు. జాతీయ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తక్షణమే విధుల్లోకి చేర్చుకోవాలని డిమాండ్ చేశారు.

సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం అమానుష చర్య అని అన్నారు. విపత్కర పరిస్థితుల్లో వారిని విధుల్లోకి తీసుకుని గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని చేపట్టాలని కోరారు. ధాన్యం కొనుగోలును మరింత వేగవంతం చేయాలని,వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు విషయంలోనూ తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

గోనె సంచుల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో టెస్టుల సంఖ్య భారీగా పెంచాలని సూచించారు. తెలంగాణలో అనుకున్న స్థాయిలో టెస్టులు జరపడం లేదని పేర్కొన్నారు. రెడ్ జోన్ పరిధిలో రాకపోకలను పూర్తిగా నిలిపి వేయడంతో ప్రజలు నిత్యావసర సరుకుల కోసం ఇబ్బంది పడుతున్నారని అన్నారు.

ఈ ప్రాంతాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామన్నా జిల్లా యంత్రాంగం సకాలంలో వీటిని అందించక పోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. రెడ్ జోన్ పరిధిలోని ప్రజలకు అన్ని రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని సూచించారు.

ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దుబ్బాక నరసింహ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, నల్లగొండ జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, ఎంపీపీ మనీ మధ్ధే సుమన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొంత వెంకటయ్య, వైస్ ఎంపీపీ జిల్లపల్లి పరమేష్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

కేంద్రం తీరుపై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

Satyam NEWS

అన్యాయం చేసే ఆర్డినెన్స్‌ 2ను రద్దు చేయాలి

Satyam NEWS

ది ఫైట్ కంటిన్యూస్: రాయపూడిలో మహిళల జలదీక్ష

Satyam NEWS

Leave a Comment