ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆసరా పింఛన్లను కూటమి ప్రభుత్వం పంపిణీ చేస్తూ వస్తోంది. ఈసారి రాబోయే నెలకు ఒక రోజు ముందే పింఛన్ల పంపిణీని మొదలు పెట్టేసింది. ఆగస్టు 31 నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల పించన్ల పంపిణీని అధికారులు మొదలుపెట్టేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వం హాయాంలో నెలాఖరున పింఛన్లను పంపిణీ చేసేవారు. అలాంటిది ఇప్పుడు ఒకరోజు ముందే ఇస్తుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తన్నారు.
సెప్టెంబర్ 1 ఆదివారం కావడం, ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగులకు హాలీడే కావడంతో సీఎం చంద్రబాబు ముందే పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల సెలవుకు డిస్టర్బ్ చేయకుండా పెన్షన్‌దారులకు నగదు అందేలా ఒకరోజు ముందే మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో లబ్ధిదారులకు నేరుగా పింఛన్లను అందజేశారు. అనంతరం గ్రామ సభ నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పించన్ల పంపిణీ గ్రామ సభా వేదిక వద్దకు వెళ్లారు.
అక్కడే లబ్ధిదారులకు ఆయన పింఛన్లను పంపిణీ చేశారు. అయితే, తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం సింగవరంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సింగవరం సర్పంచ్, టీడీపీ నాయకుడు సంగన చిన పోశయ్య శుక్రవారం పింఛన్ల పంపిణీపై గ్రామమంతా తిరిగి ప్రచారం చేశారు. సైకిల్ తొక్కుతూ ఓ చేత్తో మైక్ పట్టుకొని శనివారం పింఛను తీసుకునే వాళ్లంతా ఇళ్ల వద్దే ఉండాలి అని చెప్పుకొంటూ గ్రామమంతా సైకిల్ పైన తిరుగుతూ చుట్టేశారు.
వాస్తవానికి దండోరా వేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని.. ఆటో పెట్టి ప్రచారం చేసేంత స్తోమత లేదని ఆయన చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం పంచాయతీ ఖజానాను ఖాళీ చేసిందని ఆయన ఆరోపించారు. ఏపీలో శనివారం భారీ వర్షాలు పడుతున్నందున చాలా చోట్ల పింఛను ఇంటింటికి వెళ్లి ఇవ్వడానికి అంతరాయం ఏర్పడుతోంది. అందుకే సచివాలయ ఉద్యోగులకు, ప్రజలకు సీఎం చంద్రబాబు ఓ వెసులుబాటు కల్పించారు.
ఇబ్బందులుంటే వచ్చే రెండు రోజుల్లో పంపిణీ పూర్తి చేయవచ్చని చెప్పారు. దీనిపై సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకురావద్దని, టార్గెట్ పెట్టొద్దని కలెక్టర్లను ఆదేశించారు. వర్షాలు లేని ప్రాంతాల్లో యథావిధిగా పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని సూచించారు. మరోవైపు, అక్టోబర్ 2 నుంచి అర్హులైన వారికి కొత్త పింఛన్లు ఇస్తామని కూడా టీడీపీ ప్రకటించింది. అనర్హుల పింఛన్లు తొలగించి అర్హులకు ఇస్తామని వెల్లడించింది