ఆర్టీసీ కార్మికులు రేపు చేపట్టబోయే రాష్ట్ర బంద్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెంపపెట్టు లాంటిదని ఆర్టీసీ జెఎసి నాయకులు తెలిపారు. రేపటి సమ్మెను విజయవంతం చేయాలని ప్రజలను, ప్రజాసంఘాలు, ఆయా పార్టీల నాయకులను కోరారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ సమ్మె చేపట్టిన టెంట్ వద్ద ఆర్టీసీ జెఎసి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… 14 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపడుతున్న, సమస్య పరిష్కారానికి చర్చలు జరపాలని కోర్టులు చెప్పినా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని తెలిపారు. రేపటి సమ్మెను అడ్డుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ ను ప్రభుత్వం పరిష్కరించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. రేపటి బంద్ కు అన్ని సంఘాలు మద్దతు తెలుపుతున్నాయని, కేసీఆర్ నియంతృత్వ పోకడను తప్పు పడుతున్నాయని తెలిపారు. ఈ రాచరిక పాలనకు ప్రజలు విసుగు చెందారని అన్నారు. బంద్ ను అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని, అరెస్టులకి తాము భయపడేది లేదని స్పష్టం చేసారు. రేపటి బందును చేపట్టి తీరుతామని స్పష్టం చేశారు.
previous post