39.2 C
Hyderabad
April 25, 2024 15: 27 PM
Slider మెదక్

Exclusive: అక్రమ వెంచర్లకు ప్రజాప్రతినిధి అండ

#Patancheru 3

అక్రమ వెంచర్లకు, నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది పఠాన్ చెరు నియోజకవర్గం. ఇక్కడ కొత్తగా ఏర్పడిన తెల్లాపూర్, అమీన్ పూర్ మున్సిపాలిటీలతో పాటుగా పఠాన్ చెరు రామచంద్రాపురం, జిన్నారం ఏరియాల్లో భారీగా అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయి.

ప్రభుత్వ అధికారులను తమ చెప్పుచేతుల్లో పెట్టుకున్న కొందరు ప్రజా ప్రతినిధులు సర్కార్ ఆదాయానికి భారీగా గండికొడుతూ తమ స్వలాభం కోసం  నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా అక్రమ లే అవుట్లు వేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు.

ఈ నియోజకవర్గంలో భూములకు బాగా డిమాండ్ ఉండడం, తెల్లాపూర్, అమీన్ పూర్ లాంటి ప్రాంతాలవైపు సిటీ విస్తరిస్తుండడంతో పాటు ఔటర్ రింగు రోడ్డుకు సమీపాన ఉండడంతో  ఇక్కడ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇదే అదునుగా భావించిన కొందరు రియల్టర్లు అక్రమ లే అవుట్లు వేస్తున్నారని, ఎలాంటి నిబంధనలు పాటించడంలేదని తెలుస్తోంది.

వీరికి ఓ నాయకుడు తన శాయాశక్తులా సహకరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పఠాన్ చెరు నియోజకవర్గంలో అడ్డు అదుపులేని ల్యాండ్ మాఫియా ప్రైవేట్, ప్రభుత్వ  భూములను కూడా వదలడం లేదని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుకూలంగా ఉంటే చాలు అదిరించి, బెదిరించైనా భూములను తమ సొంతం చేసుకుంటున్నారని స్థానికులు వాపోతున్నారు. ఇదంతా ఓ ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే నడుస్తుందని సమాచారం.

వీరు సర్కార్ నియమ నిబంధనలను పట్టించుకోరని, కాసులు వెదజల్లడం, అధికారులను తమ గుప్పెట్లో పెట్టుకోవడం షరామామూలే అని అంటున్నారు స్థానికులు. ప్రజలకోసం పని చేయాల్సిన ప్రభుత్వాధికారులు కూడా  చట్టాలను, నిబంధనలను తుంగలో తొక్కుతూ ఆ రాజకీయ నాయకుడు చెప్పినట్టుగానే నడుచుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

అమీన్ పూర్ లో అక్రమ లే అవుట్లు

పఠాన్ చెరు నియోజకవర్గంలోని అమీన్ పూర్ లోని బంధంకొమ్ము చెరువులో భారీగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. బంధంకొమ్ము చెరువులోని సర్వే నంబర్లు 360 నుండి 381 వరకు ఉన్న భూముల్లో చాలా వరకు అనుమతులు లేని వెంచర్లు వెలుస్తున్నాయని, సంబంధిత రియల్టర్ల్ ప్రభుత్వ నియమాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని విశ్వసనీయ సమాచారం.

అలాగే ప్రభుత్వ భూమి అయిన సర్వేనంబర్లు 343, 343/5, 343/7 లలో కుప్పలు తెప్పలుగా అక్రమ వెంచర్లు పుట్టుకొస్తున్నాయని పలువురు స్థానికులు ఆరోపిస్తున్నారు. భూ కబ్జా రాయుళ్లు, రియల్టర్లు బఫర్ జోన్, ఎఫ్టియల్, ప్రభుత్వ భూములను సైతం విడిచిపెట్టకుండా అక్రమ వెంచర్ల నిర్మాణాలను దర్జాగా కొనసాగిస్తున్నారు.

ప్రభుత్వ భూముల్లో దర్జాగా పాగా

అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 70 ఎకరాల భూమిని ప్రభుత్వం స్పెషల్ ఫోర్స్ పోలీసులకు కేటాయించింది. కానీ కొందరు నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలిసి ఈ భూములో కూడా కొంతమేర ఆక్రమించి వెంచర్లు, ఇతర నిర్మాణాలు చేపడుతున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ భూ కబ్జాదారులకు కొందరు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు అండగా ఉంటూ తమ వంతు సహకారం అందిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.  రాష్ట్ర ప్రభుత్వమేమో ప్రభుత్వ భూములను కాపాడుతామని చెప్తుంటే ఇక్కడ మాత్రం కబ్జాదారులు సంబంధిత అధికారుల అండతోనే అక్రమాలకు పాల్పడుతుండడం గమనార్హం. గతంలో అనేక విమర్శలు రావడంతో స్థానిక ఎమ్మార్వో , ఇరిగేషన్ అధికారులు, ఎన్ఫోర్స్ మెంట్, మండల సర్వేయర్ బంధం కొమ్ము చెరువు చుట్టుపక్కల జరుగుతున్న అక్రమ నిర్మాణాలను పరిశీలించి, ఏదో తూతూ మంత్రంగా నిర్మాణాలను కూల్చివేశారు.

కానీ ఇక్కడి పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. అధికారులు అటు వెళ్లగానే ఇటు యధావిధిగా తమపని కానిచ్చేస్తున్నారు రియల్టర్లు. ఇక తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రైవేట్ భూముల్లోనే కాకుండా ప్రభుత్వ భూముల్లోనూ పాగా వేశారు అక్రమార్కులు.  వీరికి కొందరు అధికారులే దగ్గరుండి మరీ  నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లకు పర్మిషన్లు ఇవ్వడం విస్మయం కలిగిస్తోంది. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఎందుకు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు? హెచ్ ఎం డి ఏ నిబంధనలు వర్తించవా? వర్తిస్తే అధికారులు ఏం చేస్తున్నారు? అనేది ప్రశ్న.

Related posts

సోషల్ మీడియా షేరింగ్ పై అరెస్టు చేసిన వ్యక్తి మృతి

Satyam NEWS

కొనసాగుతున్న అల్పపీడనంతో వర్ష సూచన

Satyam NEWS

తెరుచుకున్న శబరిమల ఆలయం

Satyam NEWS

Leave a Comment