జులైలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత పెట్రో ఉత్పత్తుల ధరలు వారం రోజులుగా మళ్లీ గతంలో మాదిరిగా పైకి ఎగబాకుతున్నాయి. మంగళవారం లీటరు పెట్రోల్ ధర రూ. 0.29, డీజిల్ ధర రూ. 0.19 పైసలు పెరిగింది. దీంతో ఈ వారంలో మొత్తంగా లీటరు పెట్రోలపై రూ. 1.88, డీజిల్ పై రూ. 1.50 లు పెరగడం గమనార్హం. ఇదిలాఉంటే దేశ రాజధానిలో పెట్రోల్ ధర రూ. 73.91 ఈ ఏడాది గరిష్ట స్థాయికి చేరుకున్నది. గత ఏడాది నవంబర్ ముగింపులో లీటరు పెట్రోల్ రూ. 74కు చేరిన తర్వాత ఆ స్థాయిలో ధరలు పెరగడం ఇదే ప్రథమం. మరోవైపు డీజిల్ రూ. 66.93 గా నమోదైంది. సౌదీ డ్రోన్ దాడుల బూచీ చూపి చమురు ఉత్పత్తుల ధరలను ఇష్టారీతిన పెంచుకోవడానికి ఆయిల్ కంపెనీలకు కేంద్రం అవకాశమిస్తున్నది. మాంద్యం నేపథ్యంలో కార్పొరేట్లకు తాయిళాలు, పన్ను రాయితీలు ప్రకటిస్తున్న మోడీ సర్కారు.. సామాన్య జనాల వద్ద మాత్రం డబ్బులు అదేపనిగా పిండుకుంటున్నది. పెరుగుతున్న పెట్రో ఉత్పత్తుల ధరల ప్రభావం ప్రత్యక్షంగా నిత్యావసరాల వస్తువుల మీద పడుతున్నా కేంద్ర సర్కారు పట్టించుకోవడం లేదు. కాగా, సవరించిన ధరల ప్రకారం. ముంబయిలో లీటరు పెట్రోల్ ధర రూ. 79.57 గా నమోదుకాగా డీజిల్ రూ. 70.22 లకు చేరింది. ఇవే ధరలు హైదరాబాద్‌లో రూ. 78.57, రూ. 72.96గా నమోదయ్యాయి
previous post
next post