బొకేలకు ప్లాస్టిక్ కవర్లు చుట్టడం నిషేధించాలని బల్దియా కమిషనర్ నిర్ణయించారు. సిటీలోని ఫ్లోరిస్ట్లతో మీటింగ్ నిర్వహించారు. కవర్లకు ఆల్టర్నేట్గా క్లాత్‌లు, పేపర్, జ్యూట్, బయోడ్రిగేడబుల్ కవర్లను వాడాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఫంక్షన్లు, వేడుకలు, వివిధ కార్యక్రమాల సందర్భంగా అందచేసే పూలగుచ్ఛా(బొకే)లకు ప్లాస్టిక్ కవర్లను చుట్టడాన్ని నిషేధించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. పూల బొకేలకు చుట్టే ప్లాస్టిక్ కవర్లు 50 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉండి పర్యావరణానికి తీవ్ర ముప్పుగా ఏర్పడుతున్నాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ అన్నారు. బొకేలకు ప్లాస్టిక్ కవర్లు చుట్టడాన్ని త్వరలో పూర్తిస్థాయిలో నిషేధించనున్నట్టు ప్రకటించారు.
ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ముషారఫ్ అలీ, మెడికల్ ఆఫీసర్ భార్గవ్ నారాయణ పాల్గొన్న సమావేశంలో కమిషనర్ దానకిశోర్ మాట్లాడుతూ బొకేలకు వాడే ప్లాస్టిక్ కవర్లు నాలాలు, చెరువుల్లో చేరి పర్యావరణానికి ముప్పుగా మారాయని తెలిపారు. బొకేలకు ప్లాస్టిక్ కవర్లు చుట్టడాన్ని నిషేధించనున్నామని, ఈ మేరకు ఇప్పటి నుంచే ప్లాస్టిక్ కవర్లకు బదులుగా అందమైన క్లాత్‌లు, పేపర్, జనపనార, బయోడ్రిగేడబుల్ కవర్లను మాత్రమే బొకేలకు చుట్టాలని స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో దాదాపు 500 పూలబొకేల దుకాణాలు ఉన్నాయని అంచనా వేసినట్టు పేర్కొన్నారు. ఈ అంశంపై పూర్తిస్థాయి నిబంధనలు రూపొందించి స్టాండింగ్ కమిటీలో అనుమతి పొందనున్నట్టు దానకిశోర్ తెలిపారు. బొకేలకు ప్లాస్టిక్ కవర్లు కాకుండా పర్యావరణ హితమైన క్లాత్‌లను చుట్టి విక్రయించే ఫ్లోరిస్టులకు ప్రోత్సాహకాలను కూడా అందించే ప్రతిపాదన ఉందని దానకిశోర్ తెలిపారు.