20.7 C
Hyderabad
October 26, 2021 05: 18 AM
Slider సంపాదకీయం

పరిస్థితి మారుతున్నది….గమనించండి పాలకులూ

#attackonchandrababu

జడ్పీటీసీ, ఎంపిటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడే తరుణంలో రాష్ట్రం మొత్తం సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయంలో ఒక వ్యక్తి అతి ఉత్సాహం మొత్తం వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టింది. తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నట్లు వైసీపీ అధినాయకత్వానికి తెలియకుండా ఎమ్మెల్యే జోగి రమేష్ ఈ నిర్వాకం చేసి ఉంటే అంతకన్నా తప్పిదం మరొకటి లేదు.

పార్టీ పెద్దలే ఆయనతో చేయించి ఉంటే ఇక ఏపిని దేవుడే కాపాడాలి. ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఇంటిపై దాడికి వెళ్లడం అంటే అది అత్యంతంత సాహసమే అనుకోవాలి. పదుల సంఖ్యలో కార్లు వేసుకుని, జెండా కర్రలు తీసుకుని ప్రతిపక్ష నాయకుడి ఇంటిపైకి దాడికి వెళ్లడం ఏ మాత్రం క్షమించరాని పని.

అధికారంలో ఉన్న వైసీపీ చేసిన ఈ కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో క్షంతవ్యం కాదు. అయితే జోగి రమేష్ చేసిన ఈ దాడిపట్ల ఏ మాత్రం పశ్చాత్తాపాన్నీ వైసీపీ వ్యక్తం చేయడం లేదు సరికదా ఆయన చేసిన పనిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ నాయకులు సమర్థిస్తున్నారు.

అంటే ఇది పార్టీ అధిష్టానానికి తెలిసే జరిగి ఉండాలి లేదా వారే చేయమని ప్రోత్సహించి ఉండాలి. తెలుగుదేశం పార్టీ నాయకుడు అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకు కూడా వైసీపీ ఇప్పుడు మరింత ఉధృతంగా ఎటాక్ చేస్తున్నది.

అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలను ఖండించేందుకు అధికారంలో ఉన్న వైసీపీకి వెయ్యి అవకాశాలు ఉన్నాయి. వాటన్నింటిని కాదని చంద్రబాబునాయుడి ఇంటిపై దాడి చేసేందుకు ఒక ఎమ్మెల్యేను ప్రోత్సహించడం అంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు.

పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వాడే భాషతో పోలిస్తే అయ్యన్నపాత్రుడు వాడిన భాష అంత తీవ్రమైనదేం కాదు. ఒక్క కొడాలి నానే కాదు.. చాలా మంది వైసీపీ నాయకులు వాడే భాష, చంద్రబాబునాయుడిని తూలనాడే విధానం పై ఇప్పటికే అంతో ఇంతో సంస్కారం ఉన్న వారంతా ఈసడించుకుంటున్నారు.

‘‘కొడాలి నాని ఎంతో బాగా మాట్లాడాడు… కమ్మోడు అయి ఉండి కూడా చంద్రబాబును కడిగిపారేశాడు శభాష్’’ అనే వారు కూడా ఉన్నారు. అయితే ఇలాంటి వారి సంఖ్య సమాజంలో రెండేళ్ల కిందట ఉన్నంత సంఖ్యలో ఇప్పుడు లేదు. ఈ ఒక్క విషయం జగన్ గుర్తిస్తే తన నాయకులతో ఇలా చేయించరు.

కమ్మోళ్లపై ఉన్న వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న వైసీపీ నాయకులకు అంతకు ముందు వచ్చినంత సపోర్టు ఇప్పుడు సమాజం నుంచి రావడం లేదనే వాస్తవం కూడా గ్రహించాలి. కేవలం కమ్మ వ్యతిరేకతను రెచ్చగొట్టడమే రాజకీయం అని అనుకోవడం అంత అవివేకం మరొకటి లేదు.

కమ్మ వ్యతిరేకత ఎన్నికల నాటితో ముగించి ఉండాల్సింది. ఎన్నికలలో గెలిచిన తర్వాత పాలనలో ఆ వివక్ష చూపడాన్ని సంస్కారం ఉన్న ఎవరూ ఆమోదించలేరు. అయితే తమకు లాభసాటిగా ఉంటుందని వైసీపీ నేతలు దాన్నే కొనసాగించారు.

చివరికి చంద్రబాబు ఇంటిపై దాడి చేసే వరకూ వచ్చారు. ముందు తెలుగుదేశం పార్టీ మద్దతు దార్లపై దాడులు జరిగాయి. తర్వాత తెలుగుదేశం మాజీ మంత్రులను అరెస్టు చేయడం వరకూ వెళ్లింది. తెలుగుదేశం నాయకుడు నారా లోకేష్ ను పోలీసులు అరెస్టు చేయడం కూడా ఇటీవలి కాలంలోనే రెండు మూడు సార్లు జరిగింది.

ఇప్పుడు చంద్రబాబు ఇంటిపైనే దాడికి దిగారు. ఈ మొత్తం సంఘటనలలో పోలీసు వ్యవస్థ బద్నామ్ అవుతున్నది. ఆ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు గుర్తించాలి. ఇది కేవలం ఎల్లో మీడియా సృష్టిస్తున్నదే తప్ప ప్రజలంతా పోలీసుల చర్యలను సమర్థిస్తున్నారు అని వారు కనుక అనుకుంటే ముందే చెప్పినట్లు ఏపిని ఆ దేవుడే కాపాడాలి.

మూడు సంవత్సరాల కిందట జగన్ మోహన్ రెడ్డి ఇదే పోలీసు వ్యవస్థపై తనకు నమ్మకం లేదని రెండు సందర్భాలలో స్పష్టంగా చెప్పారు. తనపై విశాఖ ఎయిర్ పోర్టులో దాడి జరిగినప్పుడు, తన బాబాయి హత్య కేసు దర్యాప్తు విషయంలోనూ.

అయితే ఈ మూడు సంవత్సరాలలో కొత్త గా పోలీసు శాఖలో వచ్చి చేరిన వారు ఎక్కువ మంది ఉండకపోవచ్చు కానీ అదే వ్యవస్థ ఇప్పుడు ఆయన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించడమే కాకుండా ఎవరు ఏమనుకుంటారో అని కూడా ఆలోచించకుండా కేసులు పెడుతున్నది.

శాంతి భద్రతలు కాపాడటం అంటే కేవలం తెలుగుదేశం పార్టీ వారిపైనే కేసులు పెట్టడం మాత్రం కాదు అనే విషయం పోలీసులు గ్రహించాలి. లేదూ తెలుగుదేశం పార్టీని అణచివేస్తేనే శాంతి పరిఢవిల్లుతుంది అని పోలీసులే అనుకుంటే…… ఏపిని  ఆ దేవుడే కాపాడాలి.

Related posts

జడ్జిమెంట్: హంగ్ మునిసిపాలిటీలన్నీ గులాబి కే

Satyam NEWS

భూములను ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు

Satyam NEWS

సెలబ్రిటీస్ అందరి దృష్టి ఇప్పుడు బ్రాండ్ మందిర్ పైనే

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!