35.2 C
Hyderabad
April 24, 2024 12: 42 PM
Slider కవి ప్రపంచం సినిమా

అక్షరాలతో శస్త్ర చికిత్స చేయాలనుకున్న కవి కొమిరె సాకీ

#Poet Komire Saki

కులం పుండుకు కలం వైద్యం! ఆశ్చర్యంగా ఉంది కదూ!! కవి తలుచుకుంటే ఏదైనా చేయగలడు. కవులు తమ రచనలతో నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొలపగలరు. ప్రజలను చైతన్య వంతులను చేసి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలను కూడా కూల్చగలరు. సాకీ కలం పేరుతో కొమిరె వెంకన్న రాసిన కవితా సంకలనం స్వేచ్ఛా పావురాలు పుస్తకావిష్కరణ సభలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కాశీం, మరో ప్రొఫెసర్ కోయి కోటేశ్వరరావు, ప్రజాకవి జయరాజ్ ల ప్రశంసలే కులం పుండుకు సాకీ తన కలంతో శస్త్ర చికిత్స చేయాలనుకున్న వైద్యానికి గౌరవ డాక్టరేట్ వచ్చిందని చెప్పవచ్చు.

పూర్వ ఖమ్మం జిల్లా, ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రానికి చెందిన సాకీ తన కలంతో జాలు వారిన ఐదో పుస్తకం స్వేచ్ఛా పావురాలు. ఇటీవల ఈ పుస్తకాన్ని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో విడుదల చేశారు. ఈ పుస్తకంలోని ప్రతి కవిత చదువరులకు నిగూఢమైన అర్థంతో ఆలోచింపజేసే విధంగా ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. పుస్తక సమీక్షకులను ఆకట్టుకునే కవిత శస్త్ర చికిత్స. సాకీ తన అక్షరాలతో ఈ సమాజానికి శస్త్ర చికిత్స చేయాలనుకున్నాడు.

భారత వామ పక్షం
స్వల్ప పక్షవాతానికి గురైంది
కాదు కాదు బ్రాహ్మణీయ
భారీ పక్షపాతానికి బలైంది

అందుకు భారత కమ్యూనిజం
భారీ మూల్యమే చెల్లించుకుంది
ఎంత మూల్యమంటే ఎంత పూడ్చిన
పూడ్చుకోలేని అగాధమంతా

ఈ దేశంలో మార్క్సిజం
కులం తారు డబ్బాలో
ముంచి తీసిన తెల్లని
పావురంలా ఉంది

ఇప్పుడీ నల్లపావురానికీ
వేరే మార్గం లేదు
కాకి బలగంలో కలిసి
కోకిల రాగం తీయాల్సిందే

మనువు వ్యాధికి మందులేదు
మానవత్వం మర్మాంగంపై పుట్టిన
కులం రాచపుండు పురుగును
శస్త్ర చికిత్స చేసి తొలగించాల్సిందే

అని కవి సాకీ తన స్వేచ్ఛా పావురాలు కవితా సంకలనంలో అన్నారు. ఇంకా ఈ సంకలనంలో గాయపడ్డ గాయం కనిపిస్తుంది, అమ్మ అనుభూతి మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది, పేదల కన్నీరు మన కళ్ళ ముందు కదళాడుతుంది ఈ స్వేచ్ఛా పావురాలలో. నేటి రాజకీయం లెఫ్ట్ రైటైంది, రైట్ రాంగైంది అంటూ సాకీ రెండు లైన్ల వ్యంగ వ్యాఖ్యానంలో ఎంతో నిగూఢమైన అర్థం మన కళ్ళ ముందు కనిపిస్తుంది.

భారతదేశంలో ఉన్న ఖర్మ సిద్ధాంతాన్ని ఒక్క ఫోటో, ఒక్క మాట తో, ఒక్క పేజీ కెటాయించి వంద పేజీల అర్థాన్ని చదువుల కళ్ళ ముందు ఉంచిన సాకీ రచన నేను అతిగా చెబుతున్నాను అనుకోకుంటే జ్ఞానపీఠ అవార్డు కు దగ్గరగా ఉందనడంలో అతిశయోక్తి లేదు.

మార్పు కు మార్క్స్ ను, ఆత్మ గౌరవానికి అంబేద్కర్ ని, యుద్ధం తప్పని పరిస్థితి అయితే బుధ్ధున్ని హత్తుకుందాం అంటూ సాకీ ముగ్గురి అవసరాన్ని ఎంతో చక్కగా సమన్వయం చేస్తూ చెప్పారు. ఒక్క కంప్యూటర్ తో మిడిసిపోతున్న మనిషి కి వంద కంప్యూటర్ లు కొనిస్తా ఒక్క అన్నం మెతుకును సృష్టించు అంటూ మిడిసిపడకు నేస్తం అంటూ సాకీ సంధించిన ప్రశ్నకు సృష్టి కర్తలు ఆ భగవంతుడే అని చెప్పుకునే ఆ మనువాదుల దగ్గర కూడా సమాధానం లేకుండా చేశారు.

ఒక్క లేడి పిల్ల చుట్టూ ఎన్ని మృగాల సంచారమో అంటూ ఆడ పిల్లలకు రక్షణ లేని ఈ సమాజాన్ని రాబందుల రాజ్యంతో పోల్చిన తీరు అమోఘం. అవును గోమాత అంటూ, అమ్మను ఒసేయ్ అంటున్న ఈ సమాజాన్ని ఇదేమి ధర్మం అంటూ ప్రశ్నించారు సాకీ తన స్వేచ్ఛా పావురాలో.

రాజకీయ నాయకులు కండువాలు మార్చే విధానాన్ని, కాకి పెట్టిన గూటిలో కోకిల పొదగడం, చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు, పేదలు కూడబెట్టిన సంపదలు ఏమైయ్యాయి అంటూ, ఈ విషయంలో ప్రైవేటు ఆసుపత్రుల వారిని ప్రశ్నిస్తన్న ఇలాంటి వారందరూ అర్బన్ నక్సలైట్లు అంటూ సాకీ ప్రశ్నిస్తున్న ఈ రాజ్యం గురించి ఏమనాలి.

మొత్తం రాజకీయ కవితలతో ఉన్న ఈ స్వేచ్ఛా పావురాలు గాయమే గాయపడితే ఎలా ఉంటుందో తెలిపుతూ ఈ వ్యవస్థకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. గాయపడిన కవి గుండెలలో రాయబడిన కావ్యాలెన్నో అని కవి దాశరథి అన్నట్టు సాకీ రాసిన ఈ కవితా సంకలనంలో గాయమైన ఎన్నో కన్నీటి గాథలు కవితల రూపంలో సాకీ మనముందు ఉంచారు. మొత్తంగా పుస్తకం విడుదలై పాఠకుల ముందున్న ఈ స్వేచ్ఛా పావురాలు, స్వేచ్ఛ గా విహరిస్తూ వ్యవస్థ మార్పులో తన వంతు పాత్ర పోషించనున్నది.

తుమ్మలపల్లి ప్రసాద్ సీనియర్ జర్నలిస్ట్. సెల్: 9912010030

Related posts

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు

Murali Krishna

సింగరాజుపల్లి, గొట్టిముక్కుల రిజర్వాయర్లకు నిధులు కావాలి

Satyam NEWS

కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇవ్వాలి

Satyam NEWS

Leave a Comment