విలేకరులం అని చెబితే డబ్బులు ఇవ్వరు అనుకున్నారో ఏమో కానీ ఈ విలేకరులు విజిలెన్స్ అధికారులుగా చెప్పుకున్నారు. ఒక రేషన్ డీలర్ ను బెదిరించి డబ్బు గుంజారు. చివరకు పోలీసులకు చిక్కారు. పోలీసుల కథనం ప్రకారం పెద్దపల్లి జిల్లా దేవునిపల్లి గ్రామానికి చెందిన రేషన్ డీలర్ వీరయ్య ఆటోలో బియ్యం తీసుకుని వెళ్తుండగా TS 22 4266 అనే నెంబర్ గల కారు లో వెంబడించిన నలుగురు రిపోర్టర్లు పెద్దకాల్వల వద్ద అతడిని అడ్డుకున్నారు. తాము విజిలెన్సు అధికారులమని చెప్పుకుంటూ బియ్యం ఎక్కడికి తీసుకువెళుతున్నావని అడిగారు. దానికి అతడు సమాధానం చెప్పబోతుండగా తాము విజిలెన్స్ అధికారులమని బెదిరిస్తూ కేసు పెడుతున్నట్లు చెప్పారు. అలా జరగకుండా ఉండాలంటే మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని బెదిరించారు. దాంతో అతను అక్కడికక్కడే తనవద్ద ఉన్న 50 వేల రూపాయలను ఇచ్చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఫోన్ చేసి బెదిరించి మిగిలిన రెండున్నర లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాంతో వీరయ్య మరో లక్ష రూపాయలు ఇచ్చాడు. అంతటితో ఆగకుండా మిగిలిన లక్షన్నర ఎప్పుడు ఇస్తావంటూ ఆ విలేకరులు బెదిరించడం మొదలు పెట్టారు. దాంతో అతను అసలు ఈ విజిలెన్సు అధికారులు ఎవరు అంటూ ఆరా తీయడం మొదలు పెట్టాడు. అసలు అలాంటి వారు లేరని తేలడంతో పోలీసులను ఆశ్రయించాడు. దాంతో పెద్దపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఎస్ ఐ ఉపేందర్ కేసు దర్యాప్తు చేసి ముగ్గురు రిపోర్టర్లను అరెస్టు చేశారు. కేసు నమోదు అయిన విలేకరుల వివరాలు: A.1. పూసాల రవి,(v3న్యూస్), A2.పూసాల మోహన్ 143 పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు,(మనతెలంగాణ), A.3 మల్లేష్ @ మల్లయ్య (మన తెలంగాణ పెద్దపల్లి), A4.రమేష్(నవ తెలంగాణ) వీరిలో ముగ్గురిని అరెస్టు చేయగా పూసాల మోహన్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. వీరి నుంచి 50 వేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూసాల రవి, రమేష్, మల్లేష్ లను మంగళవారం పోలీసులు రిమాండ్ కు తరలించారు.
previous post
next post