రాష్ట్ర వ్యాప్తంగా వైకాపాకు చెందిన సీనియర్ నాయకులు, ఛోటా నాయకులు, కార్యకర్తలు, సోషల్‌మీడియాలో రెచ్చిపోయిన వారిపై కేసులు నమోదు అవుతున్నాయి. టిడిపి, జనసేన, బిజెపి కార్యకర్తలు, నాయకులు తమపై తమ అధినేతపై అసభ్యదూషణలు చేసిన వైకాపాకు చెందిన వారిపై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేయిస్తున్నారు. దీంతో వైకాపా సోషల్‌మీడియా కకావికలం అయింది. మహిళలను అసభ్యంగా దూషించిన సోషల్‌సైకో వర్రారవీంద్రారెడ్డి, బోరుగడ్డ అనిల్ మరికొందమందిని అరెస్టు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతోంది.
రాష్ట్రంలో మాట్లాడే స్వేచ్ఛ లేదంటూ వైకాపా అధినేత జగన్ మొత్తుకుంటున్నా ఆయన స్వరాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఆరు నెలలు అవుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే కార్యకర్తల మనోభావాల ప్రకారం పాలన ఉంటుందని, ఆ పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు ఆశించారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమను, తమ అధినేతను వేధించిన వారిపై కూటమి ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకుంటుందని వారు భావించారు.
అయితే ప్రభుత్వాధినేత చంద్రబాబు మాత్రం కక్షపూరిత రాజకీయాలు చేయమంటూ పాలనపై దృష్టిసారించారు. దీంతో టిడిపి కార్యకర్తలు, నాయకులు, సానుభూతిపరులు టిడిపి అధినేతపై తీవ్రస్థాయిలో దండెత్తారు. తాము అధికారంలో ఉన్నా ఇంకా వైకాపా నాయకులు, వారి సానుభూతిపరులే పెత్తనం చేస్తున్నారని, ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా వారిదే పెత్తనం నడుస్తోందంటూ నిరసన స్వరాలను వినిపించారు. అయితే చంద్రబాబు వారిని పట్టించుకోకుండా తన మానాన తాను పనిచేసుకుంటూ వెళ్లారు. దీంతో వైకాపా కార్యకర్తలు, ఆ పార్టీకి చెందిన సోషల్‌మీడియా కార్యకర్తలు కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మడం మొదలుపెట్టారు.
అంతటితో ఆగకుండా డిప్యూటీ చీఫ్ మినిస్టర్, పంచాయితీరాజ్ మంత్రి పవన్‌కళ్యాణ్‌ను ఆయన కుటుంబసభ్యులను లక్ష్యంగా చేసుకుని బూతులు తిట్టడంతో ఆయనకు మండిపోయి హోంమంత్రి అనిత శాంతి భద్రతల విషయంలోనూ, సోషల్ మీడియాలో బూతులు తిట్టేవారిని కట్టడి చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వ పెద్దల్లో ఒక్కసారిగా కదలిక వచ్చేంది. సోషల్‌మీడియాలో అసభ్యపోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదుచేయాలని, గతంలో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేష్‌లను దూషించిన వారిపై కూడా కేసులు పెట్టాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు.
సినీనటులు పోసాని కృష్ణమురళీ, శ్రీరెడ్డి, రాంగోపాల్‌వర్మ వంటివారిపై టిడిపి నేతలు ఎక్కడకక్కడ కేసులు పెడుతున్నారు. కేవలం కేసులే కాకుండా వారి అరెస్టు కోసం నోటీసులు ఇస్తున్నారు. దీంతో..టిడిపి కార్యకర్తల్లో, నాయకుల్లో కొంచెం సంతోషం వ్యక్తం అవుతోంది. అయితే..తాము ప్రతిపక్షంలో ఉండగా తమ అధినేతను, ఆయన భార్యను దూషించిన అంబటి రాంబాబును, కొడాలినాని, వల్లభనేనివంశీ, అనిల్‌కుమార్ యాదవ్, ద్వారంపూడి చంద్రశేఖర్ వంటి బడానేతలను అరెస్టు చేయాలని, అప్పుడే సోషల్ సైకోలకు బుద్ది వస్తుందనే భావన టిడిపి, జనసేనలో ఉంది. ఇప్పటి వరకూ వారిపై తీసుకున్న చర్యలపై కొంత సంతృప్తి వ్యక్తం అవుతున్నా..పేరుమోసిన నేతలను అరెస్టు చేస్తే వారిలో పూర్తిస్థాయి సంతోషం కనిపిస్తుందన్న చర్చ పార్టీలోనూ, సానుభూతిపరుల్లోనూ జరుగుతోంది.