36.2 C
Hyderabad
April 24, 2024 21: 09 PM
Slider సంపాదకీయం

పోలీసు వ్యవస్థ కు అబ్దుల్ సలామ్ ఆత్మ వేస్తున్న ప్రశ్నలు….

#AP Police

అధికార పార్టీకి ఆప్తమిత్రులుగా మారిపోయే పోలీసు అధికారులకు అబ్దుల్ సలామ్ కుటుంబం ఆత్మహత్య కేసు అనంతర పరిణామాలు కనువిప్పు కలిగించాలి. అలా జరుగుతుందో లేదో తెలియదు కానీ ఇప్పటికే చాలా మంది పోలీసు అధికారులలో పునరాలోచన కలుగుతున్నట్లు అనిపిస్తున్నది.

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు పోలీసు అధికారులు ఆ పార్టీ కనుసన్నల్లో పని చేయడం మొదలు పెట్టారు. ఇదే అదనుగా అధికార పార్టీ పోలీసు యంత్రాంగాన్ని విచ్చలవిడిగా వాడుకుంది.

డాక్టర్ సుధాకర్ కేసు నుంచి…..

కరోనా సమయంలో మాస్కులు అడిగిన డాక్టర్ సుధాకర్ కేసు నుంచి చూసుకుంటే ఉదాహరణలు కో కొల్లలుగా కనిపిస్తాయి. అమరావతిని కాపాడుకునేందుకు జరుగుతున్న ఉద్యమంలో పాల్గొంటున్న వారిని అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శత్రువుల్లా చూస్తున్నారు.

పోలీసులు అలా చూడాల్సిన పని లేదు. శాంతి భద్రతలు కాపాడేందుకు వారు చేయాల్సిన పని చేస్తే చాలు. అయితే పోలీసు అధికారులు కూడా అమరావతి రైతులను శత్రవుల్లానే పరిగణించారు. అందుకే కరడుకట్టిన నేరస్తులతో బాటు వారిని ఉంచడమే కాకుండా వారి చేతికి సంకెళ్లు వేశారు.

రైతుకు సంకెళ్లు వేసిన కేసు చూస్తే…

డాక్టర్ సుధాకర్ కేసు నుంచి అమరావతి రైతులకు సంకెళ్లు వేసిన కేసు వరకూ తనపై కి రాగానే అధికారంలో ఉన్న వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పుకున్నారు. పోలీసులపైనే చర్యలకు ఉపక్రమించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తున్న ప్రతి సందర్భంలోనూ పోలీసులు తమ కోసమే చేశారనే సానుభూతి కనీసం కూడా లేకుండా ప్రభుత్వ పెద్దలు ప్రవర్తించారు.

తూర్పుగోదావరి లో శిరోముండనం కేసు నుంచి చాలా కేసుల్లో అధికార పార్టీ నాయకులు చెప్పినట్లే చేసిన పోలీసులు అందరూ చిక్కుల్లోనే పడ్డారు. ప్రతిపక్షాల విమర్శల దాడిని తట్టుకోవడానికి సస్పెండ్ చేసినట్లు చేసి తర్వాత వారికి పోస్టింగులు ఇచ్చి ఉంటే ఉండవచ్చు కానీ సస్పెన్షన్ మచ్చ మాత్రం సంబంధిత పోలీసులకు సర్వీసులో ఉండిపోతుంది.

నంద్యాల పోలీసులు అంతలా ఎందుకు వేధించారు?

నంద్యాల ప్రాంతానికి చెందిన అబ్దుల్ సలామ్ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడానికి అక్కడి సిఐ, హెడ్ కానిస్టేబుల్ కారణం అని ప్రభుత్వం తేల్చి చెప్పింది. మరి ఆ పోలీసు అధికారులు అబ్దుల్ సలామ్ ను అంతలా ఎందుకు వేధించారు? వారంతట వారుగానే వేధించారా?

ఎవరైనా రాజకీయ నాయకులు బలవంతం చేస్తే అబ్దుల్ సలామ్ ను వేధించారా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందనే అధికార పార్టీ చకచకా చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లింల మనోభావాలు తమకు వ్యతిరేకంగా మారకుండా ఉండేందుకు సిఐని ఇతర పోలీసుల్ని సస్పెండ్ చేసి వారిపై కేసులు పెట్టి బెయిల్ రాగానే ఆ బెయిల్ రద్దు చేయాలని వాదించడం ప్రారంభించింది.

అంతే కాకుండా పోలీసులపై ఎవరైనా ఫిర్యాదులు చేయాలంటే టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయండి అంటూ ఒక సెల్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. పోలీసులపై ఫిర్యాదులు స్వీకరించడం ఒక కొత్త ప్రక్రియ. ఇప్పటి వరకూ పోలీసులతో ఇబ్బంది ఉంటే ఆ పై అధికారులను కలవడం పరిపాటిగా జరుగుతున్నది.

పోలీసులపై ఫిర్యాదుల స్వీకరణ మొదలు….

అలాంటిది టోల్ ఫ్రీ నెంబర్ ప్రారంభించడం పోలీసు వ్యవస్థ పట్ల తమకు నమ్మకం లేని విధంగా ప్రభుత్వం ప్రవర్తిస్తున్నట్లుగా అవుతుంది. అయినా సరే అబ్దుల్ సలామ్ కుటుంబం ఆత్మహత్య కేసు తో తమకు సంబంధం లేదని నిరూపించడానికి అధికార పార్టీ అన్ని ప్రయత్నాలు ప్రారంభించింది.

పోలీసు వ్యవస్థ అత్యంత సున్నితమైనది. అందరూ అనుకున్నట్లు పోలీసులలో కరడుకట్టిన రాతి హృదయాలు ఉండవు. మంచి ప్రాంతంలో పోస్టింగ్ కోసం అధికార పార్టీ వారిని ఆశ్రయించడం కేవలం కింది స్థాయి పోలీసులకే పరిమితం కాదు. అక్రమ ఇసుక లారీలను అడ్డుకున్న ఒక ఎస్ ఐ ని ఒక ఎమ్మెల్యే ఏ విధంగా తిట్టిపోసిందో కూడా అందరికి తెలుసు.

 నేను పోస్టింగ్ వేయిస్తే వచ్చినవాడివి నాకే ఎదురు చెబుతావా అంటూ ఆ ఎమ్మెల్యే ప్రశ్నించినా సదరు పోలీసు అధికారి నోరు మూసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ ఎమ్మెల్యేను బతిమాలి పోస్టింగ్ తెచ్చుకున్న ఫలితం అది.

కాల్ రికార్డింగ్ కేసులో….

గుంటూరు జిల్లా కు చెందిన ఒక పార్లమెంటు సభ్యుడు అధికార పార్టీకి చెందిన ఒక మహిళా ఎమ్మెల్యే కాల్ రికార్డింగ్స్ తెప్పించుకున్నాడు. ఈ విషయం ఆ ఎమ్మెల్యేకు తెలియడంతో సిఎం దృష్టికి ఆ విషయం తీసుకువెళ్లారు. దాంతో సదరు పోలీసులపై చర్యలు తీసుకున్నారు.

ఎంపి, ఎమ్మెల్యే ఇద్దరూ అధికార పార్టీకి సంబంధించిన వారే. ఇద్దరిలో నలిగిపోయింది పోలీసులు. ఇలా చాలా సందర్భాలలో అధికార పార్టీ నాయకులు పోలీసులను ఉపయోగించుకుంటున్నారు. విషయం బయటకు వచ్చి, కేసు పెద్దది అయితే వారు తెరచాటుకు వెళ్లిపోతారు.

పోలీసులు నలిగిపోతున్నారు. సోషల్ మీడియాలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే హైదరాబాద్ నుంచో మరో  చోటు నుంచో చాలా మందిని ఏపి పోలీసులు తీసుకెళ్లారు…. వెళుతూనే ఉన్నారు. సంబంధిత స్థానిక పోలీసులకు చెప్పడం, మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోవడం ఏపి పోలీసులు ఏనాడో మానేశారు.

ఏం జరిగినా పోలీసులదే బాధ్యత…

ఇలాంటి చర్యలు వికటిస్తే పోలీసులు కేసుల్లో ఇరుక్కోక తప్పదు. ముందే చెప్పినట్లు అధికార పార్టీ తప్పుకుంటుంది…బాధ్యత పోలీసులపైకే నెడుతున్నారు. అందుకే పోలీసులు ఇక నుంచి అయినా అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు వినడం కాకుండా చట్ట ప్రకారం, ధర్మ విచక్షణ తో నడచుకోవాలి.

తాము ప్రమాణం చేసిన చట్టానికి మాత్రమే చుట్టంగా వుండాలి తప్ప అధికార పార్టీకి కాదు. నంద్యాల కేసు తర్వాతి పరిణామాలలో కేసులు ఎదుర్కొంటున్న పోలీసులను చూసి మిగిలిన పోలీసులలో మొదలైన పునరాలోచన పూర్తి స్థాయిలో కలగాల్సి ఉంది. అలా పూర్తి స్థాయిలో జరిగితేనే పోలీసు అధికారులు కోర్టులో నిలబడి  తల దించుకుని సమాధానం చెప్పాల్సిన పరిస్థితి తప్పుతుంది.

Related posts

వాకపల్లి బాధితులకు రూ. కోటి పరిహారం ఇవ్వండి

Bhavani

క్రిస్మ‌స్ సంద‌ర్భంగా సుప్రీం హీరో సాయితేజ్ ‘సోలో బ్రతుకే సో బెట‌ర్‌’

Satyam NEWS

ఉల్లి రైతుకు పొంచి ఉన్న ప్రమాదం

Satyam NEWS

Leave a Comment