32.2 C
Hyderabad
April 20, 2024 21: 57 PM
Slider నల్గొండ

పోలీస్ అమరవీరుల త్యాగం అజరామరం

#NalgondaPolice

శాంతి భద్రతలు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ లక్ష్యంగా నిబద్ధతతో విధి నిర్వహణ చేస్తూ ప్రజా రక్షణలో ప్రాణాలను అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగం అజరామరంగా నిలిచిపోతుందని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీష్ రెడ్డి అన్నారు.

బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో జరిగిన పోలీస్ అమరుల సంస్మరణ దినోత్సవం ఫ్లాగ్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పోలీస్ అమర వీరుల స్థూపానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.

సమాజంలో పోలీసు వ్యవస్థ ఎంతో కీలకం

ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ అమరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తివంతంగా నిలుస్తుందని చెప్పారు. రాజ్యాల ఏర్పాటు తర్వాత ప్రజావసరాల కోసం, రక్షణ కోసం ఏర్పడ్డ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు దేశంలో అంతర్గత భద్రత, ప్రజల రక్షణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ఇలా ప్రతి సందర్భంలోనూ పోలీస్ వ్యవస్థ చాలా కీలకంగా పని చేస్తున్నదన్నారు.

పోలీస్ వ్యవస్థ లేకుండా సమాజ మనుగడ కష్టమని, సమాజ అవసరాలకు కొరకు ప్రాణ త్యాగం చేసిన వారిని గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రజల అవసరాల కొరకు సృష్టించిన వ్యవస్థ పోలీసు వ్యవస్థ అని, దేశ , ప్రజల, అంతర్గత ,శాంతి భద్రతలు, ప్రజా రక్షణ లో పోలీస్ పాత్ర ఎనలేనిదన్నారు.

రాత్రి పగలు తేడా లేకుండా శ్రమపడేది పోలీసే

పోలీసు వ్యవస్థ లేకుండా ఏ సమాజం మన మనుగడ సాధించలేదన్న మాట వాస్తవమన్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా పోలీస్ పాత్ర అవసరమని, ఇటీవల వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు అప్రమత్తంగా పనిచేస్తున్నా పోలీస్ ల అవసరం ప్రత్యేకమన్నారు.

ప్రతి విషయం లో రాత్రి, పగలు అనే తేడా లేకుండా  పోలీసుల అవసరం  ఉంటుందని  చెప్పారు. అనేక సమయాలలో తమ ప్రాణాలు లెక్క చేయకుండా ప్రజల ప్రాణాలను కాపాడిన ఘనత కూడా పోలీసులకి దక్కిందన్నారు. అలాంటి త్యాగధనుల స్మరించుకోవడం మనందరి బాధ్యతని మంత్రి చెప్పారు.

సమాజంలో అత్యవసర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలోనూ పోలీసులు అందించే సేవలు వెలకట్టలేనివని అలాంటి పోలీస్ అమరుల త్యాగాలను స్మరించుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను సమర్ధవంతంగా తీర్చిద్దిద్దడం లక్ష్యంగా అన్ని రకాల ఆధునిక, సాంకేతిక సదుపాయాలతో వసతులు కల్పిస్తూ దేశంలోనే అగ్రగామిగా నిలిపేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.

అమరులైన పోలీసులకు ప్రభుత్వం అండ

అమర పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని సమయాల్లో అండగా నిలవడంతో పాటు వారి సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ సమాజాభివృద్ధిలో పోలీసుల పాత్ర ఎంతో గొప్పదని, నిబద్ధతతో పని చేస్తూ ప్రజల కోసం పని చేసే అవకాశం పోలీస్ శాఖ ద్వారానే సాధ్యమన్నారు.

శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణ త్యాగాలకు సైతం వెనుకాడకుండా పోలీస్ అమరులందించిన సేవలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయని చెప్పారు. డిఐజి, నల్లగొండ ఎస్పీ ఏ.వి. రంగనాధ్ మాట్లాడుతూ 1959 అక్టోబర్ 21వ తేదీన CRPF SI కరమ్ సింగ్ నాయకత్వం లోని భారత జవాన్లు ఈశాన్య లడక్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో చైనా సైనిక దళాలు జరిపిన ఆకస్మిక దాడిలో 10 మంది భారత జవాన్లు వీరమరణం పొందారని,  వీరి ప్రాణ త్యాగాలకు ప్రతీకగా ప్రతీ సంవత్సరం అక్టోబర్ 21వ తేదీని పోలీస్ ఫ్లాగ్ డే గా జరుపుకుంటున్నట్లు  తెలిపారు.

దేశం కోసం అమరులైనవారిని గుర్తు తెచ్చుకుందాం

దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పోలీసు మరియు ఆర్మీ శాఖలకు చెందిన 264 మంది అధికారులు వివిధ సంఘటనలలో ఉగ్రవాదులు, తీవ్రవాదులతో పోరాడి, దేశ రక్షణ కోసం అమరులయ్యారని ఆయన గుర్తు చేశారు. ఫ్లాగ్ డే సందర్భంగా ఈ నెల 21వ తేదీ నుండి 31 వరకు జిల్లాలో పోలీస్ అమర వీరుల త్యాగాలను స్మరిస్తూ వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు, ఇందులో భాగంగా విద్యార్థినీ విద్యార్థులకు ఆన్ లైన్ లో వ్యాస రచన పోటీలు, ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ మేకింగ్ విభాగాలలో పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఆయుధాల పట్ల విద్యార్థులకు అవహగన కోసం ఆన్లైన్ ఓపెన్ హౌస్, జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలు వీటిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. అనంతరం అమర పోలీస్ కుటుంబ సభ్యులతో జిల్లా పోలీసు కార్యాలయంలో వారి సమస్యలు, సంక్షేమం గురించి ఎస్పీ రంగనాధ్ ప్రత్యేకంగా చర్చించి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు, గాదరి కిషోర్ కుమాత్, శాసన మండలి సభ్యులు నర్సిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరందర్ రెడ్డి, అదనపు ఎస్పీ శ్రీమతి సి. నర్మద, పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజ్, నాయకులు సోమయ్య,

డిఎస్పీలు వెంకటేశ్వర్ రెడ్డి, రమణా రెడ్డి, సురేష్ కుమార్, ఆర్.ఐ.లు వై.వి. ప్రతాప్, స్పర్జన్ రాజ్, నర్సింహా చారి, శ్రీను, సిఐలు నిగిడాల సురేష్, ఎస్.ఎం. బాషా, అనిల్, ఎస్.ఐ.లు నర్సింహా, రాజశేఖర్, వెంకట్ రెడ్డి, నర్సింహా రావు, సిబ్బంది జమీల్, యాసిన్, వెంకన్న, అజీజ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

పిలుపు ఇచ్చినా పెరగని ఓటింగ్ పర్సంటేజి

Satyam NEWS

పెద్ద నోట్ల రద్దును సమర్థించిన సుప్రీంకోర్టు

Satyam NEWS

కర్రి బాలాజీ కోసం బ్యాక్ డోర్ ఎంట్రీ ఇస్తున్న పూర్ణ

Satyam NEWS

Leave a Comment