27.7 C
Hyderabad
April 25, 2024 10: 09 AM
Slider మహబూబ్ నగర్

ఈ చెట్టు గడ్డలు కిలో రూ.15 లక్షలట తెలుసా?

#AurvedaPlant

చేలో పెట్టాల్సిన మొక్కలు చెవిలో పెట్టి ఒక రైతును పిచ్చిపుల్లయ్యను చేశారు ఇద్దరు అతి తెలివి మోసగాళ్లు. ….ఇలా కూడా మోసం చేయవచ్చు అనే విషయం కనిపెట్టిన ఈ ఇద్దరు నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రాంతంలోని ఎన్మన్ బెట్ల గ్రామంలో ఉన్నారు.

పరమేశ్ గౌడ్, రమేష్ గౌడ్ అనే ఈ ఇద్దరు ఒక రైతును మోసం చేసిన విధానం చూస్తే వామ్మో అనిపించకమానదు. అదే గ్రామానికి చెందిన శేఖర్ పాపం తన మానాన తాను వ్యవసాయం చేసుకుంటూ జీవించేవాడు. ఈ ఇద్దరూ కలిసి అతని వద్దకు వెళ్లారు. మేం ఒక ఆయుర్వేదం చెట్టు ఇస్తాం దాన్ని పెంచితే నీకు లక్షల్లో ఆదాయం ఉంటుందని చెప్పారు.

పాపం డబ్బులు వస్తాయి కదా అనుకున్న శేఖర్ వారిచ్చిన మొక్కలు తీసుకుని తన పొలంలో నాటాడు. ఒక్కో చెట్టు నుంచి మూడు కిలోల గడ్డలు వస్తాయని వారు చెప్పడంతో శేఖర్ నమ్మాడు. ఒక కిలో గడ్డల రేటు ఎంతో తెలుసా? 15 లక్షల రూపాయలన్నమాట.

అంటే మూడు కిలోల గడ్డలకు 45 లక్షలు వచ్చేస్తాయి. ఆహా ఎంత బాగుందనుకుంటూ శేఖర్ ఆ మొక్కలు పెంచడం మొదలు పెట్టాడు. గడ్డలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూకూర్చున్నాడు. అన్నట్లు ఒక్కో మొక్క ఖరీదు ఎంతో తెలుసా? పది మొక్కలు మూడు లక్షల రూపాయలే.

ఎంతో చీప్ కదా? 45 లక్షలు వచ్చే మొక్కల్ని మూడు లక్షలకు ఇచ్చేశారని అనుకున్నాడు శేఖర్. అయితే ఆ మొక్కలు పెరగకపోగా చచ్చిపోతున్నాయి. కంగారు పడిన శేఖర్ వాటిని కాపాడుకోవడానికి ఏం చేయాలని వారినే అడిగాడు. ఈ మొక్కలు బతకాలంటే శాస్త్రవేత్త రావాల్సిందేనని ఆ ఇద్దరూ నమ్మబలికారు.

సరే అని పక్క గ్రామమైన రామాపురానికి చెందిన కిరణ్ అనే వ్యక్తిని శాస్త్రవేత్తగా పరిచయం చేశారు. శాస్త్రవేత్త కిరణ్ కు 60 వేల రూపాయలు ఇప్పించారు. అయినా మొక్కలు చనిపోతూనే ఉన్నాయి. మళ్లీ శాస్త్రవేత్తను పిలిపించాల్సిన అవసరం ఏర్పడింది. పాపం శేఖర్ దగ్గర డబ్బుల్లేవు ఏం చేయాలి?

పాపం ఎంతో మంచి వారైన పరమేశ్, రమేష్ లు శేఖర్ తో ప్రామిసరీ నోటు రాయించుకుని 80 వేల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పారు. అయినా అన్ని మొక్కలూ చనిపోయాయి. ఒకే ఒక్క బతికింది. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని వారు బెదిరిస్తున్నట్లు శేఖర్ చెప్పాడు.

ఈ విషయాల్ని లిఖిత పూర్వకంగా పోలీసులకు ఇచ్చాడు. ఫిర్యాదు అందుకున్న కొల్లాపూర్ ఎస్ ఐ కొంపల్లి మురళి గౌడ్ మాట్లాడుతూ వాస్తవాలను పరిశీలిస్తామని అందుకోసం కేసు విచారణ ప్రారంభిస్తున్నామని చెప్పారు.  

Related posts

భోగ భాగ్యాల సంక్రాంతి

Satyam NEWS

బడ్జెట్ హైలైట్స్: ‘నిర్మల’ హృదయంతో ముఖ్యాంశాలు

Satyam NEWS

పారిశుద్ధ్య పనుల్లో ఉండేవారికి ప్రొటెక్షన్ తప్పని సరి

Satyam NEWS

Leave a Comment