27.7 C
Hyderabad
March 29, 2024 02: 21 AM
Slider సంపాదకీయం

కొని తెచ్చుకుంటున్న వ్యతిరేకతతో విలవిల

#Y S Jaganmohan Reddy

ఎల్ జి పాలిమర్స్ విషవాయువు లీక్ విషయంలో ప్రతిపక్షాలపై పూర్తి స్థాయి ఆధిపత్యం సాధించిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలీసుల అత్యుత్సాహం కారణంగా మళ్లీ చిక్కుల్లో పడిపోయారు. ఎల్ జీ పాలిమర్స్ నుంచి స్టైరెన్ విషవాయువు లీక్ కావడంతో 12 మంది మరణించిన సంఘటనలో హుటా హుటిన విశాఖ పట్నం వెళ్లడం, అక్కడ పెద్దగా చర్చలతో కాలయాపన చేయకుండా కోటి రూపాయల పరిహారం ప్రకటించడంతో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ప్రజాభిప్రాయం ఒక్క సారిగా సానుకూలంగా మారిపోయింది.

ప్రతిపక్షాలు 50 లక్షల రూపాయల పరిహారం కోరగా ఆయన కోటి రూపాయలు ఇవ్వడం, ఆ ప్రాంత ఎమ్మెల్యేలను, మంత్రులను రాత్రి వేళల్లో అక్కడే నిద్రించి ప్రజల్లో విష వాయువు పట్ల ఆందోళన తగ్గించేందుకు ప్రయత్నాలు చేయడం ముఖ్యమంత్రికి మంచి పేరు తెచ్చిపెట్టింది.

వృద్ధురాలిపై కేసుతో ఒక్క సారిగా వ్యతిరేకత

కొన్ని గ్రామాలలో ఆందోళన కొనసాగుతున్నా కూడా వాటిని పెద్దగా పట్టించుకోనంతగా సానుకూలత వ్యక్తం అయిన నేపథ్యంలో పోలీసులు డాక్టర్ సుధాకర్ రావు పట్ల దురుసుగా ప్రవర్తించడం, విషవాయువు లీకేజీ పై సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న సమాచారాన్ని పోస్టు చేసిన 60 ఏళ్ల వృద్ధురాలు, గుంటూరు జిల్లా లక్ష్మీ పురానికి చెందిన రంగనాయకమ్మ పై పోలీసులు కేసు పెట్టి వేధించడం లాంటి సంఘటనలతో ముఖ్యమంత్రి పై మళ్లీ వ్యతిరేక భావనలు కలిగేలా చేశాయి.

కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టడంలో భాగంగా చికిత్స అందిస్తున్న డాక్టర్ సుధాకర్ రావు మాస్కులు కోరడం, దానిపై ప్రభుత్వం అత్యంత తీవ్రంగా రియాక్టు కావడం తెలిసిందే. డాక్టర్ సుధాకర్ పై తెలుగుదేశం వాడని ముద్ర వేయడంతోనూ, ఆయన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయడం తదితర కారణాల వల్ల సుధాకర్ పై వ్యతిరేకత, ప్రభుత్వంపై సానుకూలత అప్పటిలో వచ్చాయి.

వికటించిన దిద్దుబాటు చర్యలు

అయితే సుధాకరరావును పిచ్చివాడిగా ముద్ర వేయడం, బట్టలు విప్పదీసి చేతులు వెనక్కి విరిచి కట్టేసి ఆటోలో పోలీస్ స్టేషన్ కు తీసుకురావడం పెను సంచలనం కలిగించింది. దేశవ్యాప్తంగా ఈ సంఘటనపై నిరసన వ్యక్తం అయింది. దాంతో దిద్దుబాటు చర్యలు చేపట్టారు.

డాక్టర్ సుధాకర్ రావుకు పిచ్చి అనే ముద్ర వేసేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించింది. విశాఖ కేజీహెచ్ డాక్టర్లు రాసినట్లు కొన్ని పాయింట్లను కూడా వైసీపీ సోషల్ మీడియా విభాగం విస్తృతంగా కాపీలను సర్క్యులేట్ చేసింది. అంతే కాకుండా డాక్టర్ సుధాకర్ మద్యం మత్తులో ఉన్నాడని కూడా పోలీసులు చెప్పారు. పోలీసులు తమ చర్యలను సమర్ధించుకోవడానికి డాక్టర్ సుధాకర్ ను పిచ్చి ఆసుపత్రిలో చేర్చించారు.

మద్యం కు బానిస అయిన వ్యక్తిని డీ అడిక్షన్ క్యాంపుకు పంపాలి. సాటి వారిని దుర్భాషలాడాడని, పోలీసులపైకి సిగరెట్ కాల్చి వేశాడని పోలీసులు చెప్పారు. ఇలాంటి నేరాలు ఎన్ని చేసినా చేతులు వెనక్కి విరిచి కట్టేయడం, పిచ్చి ఆసుపత్రిలో చేర్చడంపై ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితిలోకి వచ్చింది. అదే విధంగా రంగనాయకమ్మపై కేసులు పెట్టిన విషయంలో కూడా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. పోలీసుల ఓవర్ యాక్షన్ కారణంగానే ఈ విధమైన కేసులు వస్తున్నాయని వైసీపీ నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.

Related posts

మండుటెండలో మంత్రి కి బొత్స కు ఎన్.సీ.సీ స్టూడెంట్స్ స్వాగతం అవసరమా…!

Bhavani

పోలీసు సంఘ నేతలు ఎక్కడ దాక్కున్నారు?

Satyam NEWS

‘గతం’ మూవీకి అరుదైన అవకాశం

Sub Editor

Leave a Comment