జగిత్యాల జిల్లాలో మంత్రులకు నిరసన తెలిపిన గ్రామస్తులపై పోలీసులు కేసులు పెట్టారు. కొడిమ్యాల మండలం హిమ్మత్ రావు పేటలో శుక్రవారం నాడు గ్రామ సభకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్ వెళ్లారు. మంత్రులు వస్తున్నారనే సమాచారంతో హిమ్మత్ రావుపేట, రాంసాగర్, తిమ్మయ్యపల్లి గ్రామాలకు చెందిన వారు మంత్రుల కాన్వాయ్ కి ఎదురు వచ్చి తమ నిరసన తెలిపారు. కొండగట్టు బస్సు ప్రమాదం జరిగి ఇప్పటికే ఏడాది గడిచినపోయినా మృతి చెందిన కుటుంబాలకు పరిహారం అందలేదని వెంటనే వారిని ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఎల్లంపల్లి నీటితో చెరువులు నింపాలని వారు మంత్రులను కోరారు. డిమాండ్లు వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని మంత్రులు హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి గ్రామస్తులు వెళ్లిపోయి మంత్రులకు దారిచ్చారు. తిరుగు ప్రయాణంలో మంత్రులు వేరే దారిలో జగిత్యాలకు చేరుకున్నారు. ఐతే మంత్రులను అడ్డుకోవడాన్ని కొడిమ్యాల పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఇదే కారణంతో ఎనిమిది మంది గ్రామస్తులపై కేసులు పెట్టారు కొడిమ్యాల పోలీసులు.
previous post
next post