30.2 C
Hyderabad
February 9, 2025 20: 09 PM
Slider తెలంగాణ

రాజకీయపరమైన చర్చల్లో హుందాతనం ఉండాలి

venkaiah

విధ్వంసకర, వినాశకర పద్ధతుల్లో నిరసనలు తెలపడం ప్రజాస్వామ్య దేవాలయమైన భారత్ కు చెడ్డపేరు తెస్తాయని, శాంతియుత నిరసనల ద్వారానే మనం చెప్పాలనుకున్న అంశాన్ని మరింత స్పష్టంగా చెప్పేందుకు వీలుంటుందని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

అహింసాయుత జీవనమే భారత అస్తిత్వమనే విషయాన్ని మరవొద్దన్నారు. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో మాజీ ముఖ్యమంత్రి మర్రిచెన్నారెడ్డి శతజయంతి ఉత్సవాలను ఉపరాష్ట్రపతి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యోద్యమంలో చౌరాచోరీ ఘటనతో విధ్వంసం పెచ్చుమీరడంతో మహాత్మాగాంధీ సహాయ నిరాకరణ అర్ధాంతరంగా ఉద్యమాన్ని ఆపాల్సి వచ్చిన విషయాన్ని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు.

పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో.. ‘పరిపక్వత కలిగిన ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి పద్ధతుల్లో నిరసన సరికాదు’ అని ఉపరాష్ట్రపతి అన్నారు. స్వర్గీయ మర్రిచెన్నారెడ్డి సభలో, సభ బయట ప్రజాప్రతినిధులతో, ప్రజలతో వ్యవహరించే తీరును ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. దేశంలో, రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పార్టీలు ఒకరినొకరు ప్రత్యర్థుల్లా ఉండాలి తప్ప శత్రువుల్లా కాదన్నారు.

 రాజకీయపరమైన చర్చల్లో హుందాతనం ఉండాలని.. ఒకరినొకరు వ్యక్తిగతంగా దూషించుకోవడం సరికాదన్నారు. ఇది వ్యవస్థపై ప్రజల్లో తప్పుడు సంకేతాలను పంపిస్తుందన్నారు. రాజకీయ చర్చల్లో గ్లామర్ (ఆకర్షణ)తోపాటుగా గ్రామర్ (విషయపరిజ్ఞానం), హ్యూమర్ (హాస్యం) ఉండాలని.. హుందాతనంతో చర్చ జరగాలని అప్పుడే ప్రజాస్వామ్యానికి సరైన గౌరవం ఇవ్వగలుగుతామన్నారు. చెన్నారెడ్డి సీఎంగా, తను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సభలో జరిగిన పలు ఆసక్తికర అంశాలను ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు.

‘నేను, స్వర్గీయ జైపాల్ రెడ్డి సభలో చెన్నారెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే.. ఓపికగా వినేవారు. అప్పుడు వయసులో, అనుభవంలో వారికంటే చిన్నవారిమైనా మేము చేసే సలహాలు, సూచనలను స్వీకరించేవారు. ప్రభుత్వ పరంగా తీవ్రమైన విమర్శలు చేసినా అందులోని అంతరార్థాన్ని స్వీకరించేవారు. అదీ ఒక గొప్ప నాయకుడికుండాల్సిన మంచి లక్షణం’ అని ఆయన అన్నారు.

రెండుసార్లు ముఖ్యమంత్రిగా, నాలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా,  కేంద్ర మంత్రిగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి అసాధారణ ప్రతిభాశాలి అని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. నిరంతరం ప్రజలతో మమేకమవుతూ.. వారి సమస్యల పరిష్కారానికి చొరవచూపడం ద్వారా ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర కీలకమని గుర్తుచేశారు.

రైతు కుటుంబం నుంచి వచ్చినందున వ్యవసాయం అంటే ఈయనకు ప్రాణమని అందుకే అన్నదాతలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో చొరవతీసుకునేవారని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. తెలుగు, ఉర్దు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో అనర్గళంగా ప్రసంగించేవారని.. అదే ఆయన్ను ప్రజలకు చేరువగా మంచి జననేతగా నిలిపిందన్నారు.

మంచి రచయిత కూడా అయిన చెన్నారెడ్డి నిజాం పాలనలో విజయవాడ నుంచి ప్రచురితమయ్యే ‘హైదరాబాద్’ అనే పత్రిక ద్వారా ప్రభావవంతమైన రచనలతో ప్రజల్లో చైతన్యాన్ని రగిలించేవన్నారు. భూ సంస్కరణలు, బీసీలకు రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో ఓటింగ్ వయసును 21 ఏళ్లనుంచి 18 ఏళ్లకు తగ్గించడం, సెట్విన్ రూపకల్పన, గ్రామీణ ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందించడం తదితర విషయాల్లో చెన్నారెడ్డి తీసుకున్న చొరవ చిరస్మరణీయమన్నారు.

 ఓ వ్యక్తిని జయంతి, వర్ధంతి సందర్భంగా స్మరించుకుంటున్నామంటే.. ఆ వ్యక్తి చూపిన విలువలు, మార్గంలో ప్రయాణించాల్సిన బాధ్యతను మరోసారి గుర్తుచేసుకోవడమేనని ఉపరాష్ట్రపతి అన్నారు. ఈ సందర్భంగా మర్రిచెన్నారెడ్డి ట్రస్టు తరఫున జాతీయ అవార్డును, తెలుగువాడైన దివంగత నీటి పారుదల రంగ నిపుణుడు హనుమంతరావుకు (మరణానంతరం) అందజేయడం సముచితమని తాను భావిస్తున్నానన్నారు.

వారి కుమారుడు  విజయ్ కుమార్ కు ఈ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య, టీపీసీసీ పరిశీలకుడు ఆర్సీ కుంతియా, సీనియర్ జర్నలిస్టు  పొత్తూరి వెంకటేశ్వరరావు, మర్రిచెన్నారెడ్డి  తనయుడు, ట్రస్టు  కన్వీనర్ మర్రి శశిధర్ రెడ్డితోపాటు వివిధ రాజకీయ పార్టీలు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.

Related posts

ముద్రా లోన్ పేరుతో నకిలీ యాప్: లక్షలు గాయబ్

Satyam NEWS

దిశ ఫొటోలు వాడుతున్న మీడియాపై పోలీసు చర్యలు

Satyam NEWS

మాస్ యాక్షన్ ప్రియుల కోసం ‘రణస్థలి’

Satyam NEWS

Leave a Comment