సోషల్ మీడియాను రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా వాడేసుకుంటున్నాయి. ఇది ఎవరి మనోభావాలనైనా బాధపెడుతుందా అని కూడా ఆలోచించడం లేదు. రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు పోటీపడి పెడుతున్న ఈ పోస్టులతో సోషల్ మీడియా అంటేనే చిరాకెత్తుతోంది. ఛలో ఆత్మకూరు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో ఆవేశకావేషాలు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. ఆత్మకూరు వెళ్లకుండా చంద్రబాబునాయుడిని పోలీసులు నిరోధించారు. తెలుగుదేశం ఛలో ఆత్మకూరుకు పోటీగా వైసిపి కూడా ఛలో ఆత్మకూరు కార్యక్రమం నిర్వహించతలపెట్టడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఈనేపథ్యంలో పోలీసులు కూడా వీరవిహారం చేశారు. పోలీసులపై తెలుగుదేశం వారు కూడా స్వైరవిహారం చేశారు. సందట్లో సడేమియా లాగా ఒకరు చంద్రబాబును బిన్ లాడెన్ తో పోలుస్తూ కటకటాల వెనుక ఉన్నట్లు ఒక నీచమైన ఫొటో పెట్టి వైరల్ చేశాడు. ఆత్మకూరుకు వెళ్లకుండా చంద్రబాబును ఇంటి నుంచి బయటకురాకుండా అడ్డుకున్న పోలీసులు చంద్రబాబు ఇంటి గేటుకు పెద్ద పెద్ద తాళ్లను కూడా కట్టారు. గేటు బయట బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే గేటులోపల చంద్రబాబును ప్రముఖ ఉగ్రవాది బిన్ లాడెన్‌లా మార్ఫింగ్ చేస్తూ కొందరు ఓ పోస్టును క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో ఆ పోస్టుపై మండిపడ్డారు చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్. ‘అసలీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నట్టా లేనట్టా? మీ గుడ్డి సర్కారుకు ఇలాంటి మార్ఫింగ్ పోస్టులు కనపడట్లేదా? ఒక మాజీ ముఖ్యమంత్రి పై ఇలాంటి పోస్టు పెట్టిన వాళ్ళపై చర్యలు తీసుకోడానికి చేతులు రావట్లేదా? చట్టాలు లేవా? మీ చట్టాలన్నీ తెదేపా అభిమానులమీద కేసులు పెట్టడానికేనా?’ అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. జగన్ ప్రభుత్వ తీరుపై నారా లోకేష్ మండిపడ్డారు. మాజీ సీఎంపై ఇలాంటి మార్ఫింగ్ పోస్టులపెడితే చర్యలు తీసుకోవడానికి సీఎం జగన్‌కు చేతులు రావడం లేదని విమర్శలు గుప్పించారు.