27.7 C
Hyderabad
April 25, 2024 10: 56 AM
Slider సంపాదకీయం

బలమైన శత్రువుల్ని తయారు చేసుకుంటున్న కేసీఆర్, జగన్

#etalarajendar

బానిసలు… బానిసలకింత అహంభావమా? అని ఎస్ వి రంగారావు తృణీకరిస్తే, ధారుణీ రాజ్యసంపద మదంబున… అంటూ ఎన్టీరామారావు పద్యం అందుకుంటారు… ఇది చూసి ధియేటర్లో జనం చప్పట్లు కొడతారు…

సరిగ్గా ఇదే సీన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా జరుగుతూ ఉన్నది. మా ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీలో నీ పెత్తనం ఏమిటి అంటూ ఆంధ్రాలో తమ సొంత పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజును రాజకీయంగా అణచివేసేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలీసులు కేసులు పెట్టి జైల్లో వేశారు.

తెలంగాణలో సొంత పార్టీ నాయకుడు ఈటల రాజేందర్ ను అంత వరకూ తీసుకురాలేదు కానీ భూ కబ్జాదారుడి ముద్ర వేసి రాజకీయ భవిష్యత్తులేకుండా చేస్తున్నారు కేసీఆర్.

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడుగా గెలిచిన కె. రఘురామకృష్ణంరాజు అదే పార్టీ ముఖ్యమంత్రి పై తిరుగుబాటు చేశారు. టీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ పై గెలిచి మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ అదే పార్టీకి వ్యతిరేకంగా పని చేశారని సీఎం కేసీఆర్ భావించారు.

వీరిద్దరూ సొంత పార్టీలపైనే ఎందుకు ధిక్కార బావుటా ఎగురవేశారనే అంశం చర్చనీయాంశమే అయినా ఇద్దరు ముఖ్యమంత్రులు అనుసరిస్తున్న తీరు మాత్రం జుగుప్సాకరంగానే ఉంది. రఘురామకృష్ణంరాజును గానీ ఈటెలను గానీ పార్టీ నుంచి బయటకు పంపాలంటే సస్పెండ్ చేస్తే సరిపోతుంది.

వారికి పార్టీకి సంబంధం ఉండదు. కానీ కేసీఆర్, జగన్ లు అలా చేయడం లేదు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే వారు తమ తమ లోక్ సభ, అసెంబ్లీ స్థానాల్లో కొనసాగే అవకాశం ఉంటుంది. వారు రాజీనామాలు చేయాల్సిన అవసరం ఉండదు.

అందుకే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం లేదు. గతంలో విలువలుగల రాజకీయాలు ఉన్న రోజుల్లో ఇలా ఉండేది కాదు. పార్టీ అధినేతతో గానీ, పార్టీ సిద్ధాంతాలతో గానీ విభేదిస్తే సదరు సభ్యులే రాజీనామాలు చేసి బయటకు వచ్చేవారు.

లేదా నాయకులు వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసేవారు. విలువలు దిగజారిపోయిన ఈ రోజుల్లో ఇరు పక్షాల నుంచి అంత స్థాయి రాజకీయాన్ని ఆశించలేము. పర్యవసానంగా రఘురామకృష్ణంరాజును జైలుకు పంపి చిత్ర హింసలు పెట్టే స్థాయికి అక్కడి నేతలు వచ్చారు.

ఈటల రాజేందర్ భూ కబ్జాదారుడనే ముద్ర వేసేందుకు తెలంగాణలో అధికార పార్టీ తన పూర్తి శక్తిని వినియోగిస్తున్నది. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ ఇద్దరు రాజకీయ నాయకులు కూడా కొరకరాని కొయ్యలుగానే మారిపోయారు. ఇటు కేసీఆర్, అటు జగన్ కలిసి ఇలాంటి పనులు చేస్తున్నారా అని అప్పుడప్పుడు డౌటు కూడా వస్తుంటుంది.

అలానే రఘురామకృష్ణంరాజు, ఈటల రాజేందర్ ఇద్దరూ కూడా బిజెపి వైపే చూస్తుండటం మరింత విచిత్రంగా అనిపిస్తున్నది. ఈటల రాజేందర్ గానీ రఘురామకృష్ణంరాజు గానీ ఎక్కడా రాజీ పడటం లేదు. దీనివల్ల వారిద్దరికి జరిగే నష్టం కన్నా కేసీఆర్ కు, జగన్ మోహన్ రెడ్డికి జరిగే నష్టం మాత్రం అపారంగా ఉంటుంది.

రెండు పార్టీలూ కూడా కొత్త శత్రువులను తయారు చేసుకుంటున్నాయి. కొత్త శత్రువులే కాదు వీరిద్దరూ బలమైన శత్రువులు కూడా. ఈటల రాజేందర్, రఘురామకృష్ణంరాజు ఇద్దరూ కూడా రాజకీయాలలో ఆరితేరిన వారు.

అందువల్ల ఆఖరు క్షణం వరకూ కేసీఆర్ కు, జగన్ కు కంట్లో నలుసులా, చెప్పులో రాయిలా సలుపుతూనే ఉంటారు.

అది గ్యారెంటీ.

Related posts

హోంగార్డ్ కుటుంబ సభ్యులకు ఆర్ధిక సహాయం

Murali Krishna

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా మళ్లీ రాహుల్ గాంధీ

Satyam NEWS

మాట మార్చిన ప్రభుత్వంపై విశ్వ హిందూ పరిషత్ నిరసన

Satyam NEWS

Leave a Comment