29.2 C
Hyderabad
November 8, 2024 14: 50 PM
Slider సంపాదకీయం

షేమ్: పసుపు చుట్టూ అరాచక రాజకీయం

turmaric farmer

పసుపు పంట రైతులకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు కానీ రాజకీయ నాయకులకు మాత్రం చేతినిండా పని కల్పిస్తున్నది. పసుపు పండించిన రైతుకు మాత్రం ఎకరాకు 50 నుంచి 60 వేల రూపాయల నష్టాన్ని మిగిలుస్తున్నది. రాజకీయ నాయకులు మాత్రం పసుపు రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారిని విభజించి పాలిస్తున్నారు. రైతులలో ఉన్న విభేదాలను బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు పూర్తిగా ఉపయోగించుకుంటున్నాయి.

నిజామాబాద్ జిల్లా పసుపు రైతులకు కావాల్సింది పసుపు బోర్డు. పసుపు బోర్డు ఆధారంగా పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. పసుపు బోర్డు వచ్చిందా? రాలేదు. ప్రత్యామ్నాయంగా స్పైసెస్ బోర్డు వచ్చింది. స్పైసెస్ బోర్డు అంటే సుగంధ ద్రవ్యాల బోర్డు అన్నమాట. సుగంధ ద్రవ్యాలలో పసుపు, మిర్చి కూడా ఉంటాయి. అసలు పసుపు బోర్డును రైతులు ఎందుకు అడుగుతున్నారు?

పసుపు బోర్డు వస్తే రైతుకు వచ్చే లాభం ఏమిటి? ఈ ప్రశ్నలకు ఎవరి సమాధానం వారు చెబుతారు కానీ వాస్తవం మాత్రం రెండు వాదనల మధ్యలో ఉంది. పసుపు బోర్డు ప్రత్యేకంగా ఏర్పాటు కావాలని పసుపు రైతులు కోరడం వెనుక వారి కష్టం తీరాలనే ఆశ ఉంది. వారి నష్టం పూడాలనే కోరిక ఉంది. అంతే కాని వారు రాజకీయాల కోసం పసుపు బోర్డు కోరడం లేదు.

పసుపునకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు అయితే పసుపు విత్తే సమయం నుంచి రైతుకు సలహాలు దొరుకుతాయి. పంట దిగుబడి పెంచడం కోసం మెళకువలు నేర్పేందుకు అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా పసుపుపై పరిశోధనలు జరిగి మరిన్ని మేలైన వంగడాలు సృష్టిస్తారు. చీడపీడలు తొలగేందుకు ఏ మందులు వాడాలో బోర్డు ముందుగానే సూచిస్తుంది. దీనికి శాస్త్రవేత్తల సహాయం ఉంటుంది కాబట్టి రైతులు పసుపు బోర్డును కోరుతున్నారు.

పంట వచ్చిన తర్వాత ఆరబెట్టడం, ఉడకబెట్టడంలో మెళకువలను కూడా వారు చెప్పేందుకు వీలు ఉంటుంది. దీనివల్ల మార్కెటింగ్ సులభతరం అవుతుంది. మార్కెటింగ్ అవకాశాలను కూడా పసుపు బోర్డు కల్పిస్తుంది. అందుకోసమే రైతులు పసుపు కోసం ప్రత్యేక బోర్డు ఉంటే తమ కష్టాలు తీరతాయని బలంగా నమ్ముతున్నారు. పైన చెప్పిన పనులన్నీ చేయకపోతే పసుపు బోర్డు ఏర్పాటు చేయడం కూడా దండుగే.

ఇది రాజకీయాలకు అతీతంగా కోరుతున్న కోరిక. అయితే బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కల్వకుంట్ల కవిత బిజెపి చేతిలో ఓడిపోయినందుకు వారు ప్రస్తుత ఎంపి ధర్మపురి అర్వింద్ పై కారాలు మిరియాలూ నూరుతున్నారు. ధర్మపురి అర్వింద్ గెలిచిందే పసుపు బోర్డు తీసుకువస్తానని హామీ ఇచ్చి. అది నెరవేర్చేందుకు ఆయనకు వీలు పడటం లేదు.

మధ్యే మార్గంగా రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాజకీయాలు ఇప్పటిలో తెగేవి కాదు. తెగనివ్వరు కూడా. డిసెంబర్ నుంచి మార్చి ఏప్రిల్ వరకూ పసుపు పంట వస్తుంది. ఇది పసుపు పంట వచ్చే సీజన్ అన్నమాట. ఈ సీజన్ లో క్వింటాలుకు నాలుగు నుంచి ఐదు వేల రూపాయల ధర మాత్రమే పలుకుతున్నది. పసుపు మద్దతు ధర 12 వేల రూపాయలు ఉండాలి.

కనీసం 9 వేల రూపాయలైనా ఉంటే గిట్టుబాటు అవుతుందని పసుపు రైతులు అంటున్నారు. అయితే రైతులు ఎదుర్కొంటున్న ఈ సమస్య గురించి ఎవరూ మాట్లాడటం లేదు. పసుపు పండించడమే కష్టం అయితే దాన్ని ఆరబెట్టి ఉడకబెట్టడం మరింత కష్టం. నైపుణ్యతతో కూడుకున్న పని. ఈ కష్టాన్ని ఎవరూ గుర్తించడం లేదు.

రాజకీయాలు చేసుకుంటూ రాజకీయ నాయకులు బతుకుతున్నారు. పసుపు రైతులలో రాజకీయ నాయకులను తయారు చేసుకుని వారితో కూడా రాజకీయాలు చేయిస్తున్నారు. అంతే తప్ప పసుపు బోర్డు రాదు. రైతు కష్టం తీరదు. ఈ సీజన్ పోతున్నది. మరో సీజన్ వస్తుంది. అది కూడా పోతుంది. అంతే తప్ప రైతుకు ఏం లాభం లేదు. లాభం అంతా రాజకీయ నాయకులకే.

Related posts

హోలీ సంబరాల మత్తులో పురుగుల మందు తాగాడు

Satyam NEWS

టిఎస్ పిఎస్సి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

Bhavani

బాదుడే బాదుడు పై విశాఖ లో తెలుగుదేశం నిరసన

Satyam NEWS

Leave a Comment