ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో రాష్ట్రంలోని ప్రజల స్థిరాస్థులు కాజేసేందుకు అప్పటి వైసీపీ నేతలు ప్రయత్నించారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అవి నిజమని నిరూపించే సంఘటనలు నేటికీ బయటకు వస్తూనే ఉన్నాయి. విజయవాడలో సత్యనారాయణపురం పేరు చెబితే గుర్తొచ్చేది అక్కడ అత్యధికంగా నివాసముండే బ్రాహ్మణులు. గొడవలకు, రాజకీయాలకు దూరంగా ఉండే అటువంటి వారిని గత ఐదేళ్ళలో వైసీపీ నేతలు నానా రకాలుగా వేధించారు. నగరం మధ్యలో ఉండే ప్రాంతం కావడంతో అక్కడి వారి ఆస్తులపై వైసీపీ నేతలు కన్నేశారు.
ఎన్నో స్థలాలను కబ్జా చేశారు. గండూరి ఉమామహేశ్వరశాస్త్రి తల్లి పేరిట లక్ష్మీనగర్‌లో 325 చదరపు అడుగుల స్థలం ఉంది. సుమారు 5 కోట్ల విలువైన ఈ ఆస్తిని ఫైబర్‌నెట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, వైఎస్సార్సీపీ నేత గౌతంరెడ్డి తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమించడమే కాకుండా అధికార బలంతో నిర్మాణాలు కూడా చేపట్టాడు. దీనిపై న్యాయపోరాటం, శాంతియుత దీక్షలు చేస్తున్న ఉమామహేశ్వరశాస్త్రిని అంతం చేయడానికి గౌతం రెడ్డి కిరాయి హంతకులకు 24 లక్షలకు సుపారీ ఇచ్చాడు. దీంతో హంతకులు ఉమామహేశ్వర శాస్త్రి పై హత్యాయత్నం చేసారు. గౌతంరెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేయడంతో పరారయ్యాడు.