రాజకీయ ప్రత్యర్థులను అత్యంత నీచంగా అభివర్ణించి ఇంత కాలం వైసీపీ అధినేత జగన్ రెడ్డి కనుసన్నల్లో మెలిగిన సినీ నటులు పోసాని కృష్ణ మురళి రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు. ఇక నుంచి నేను రాజకీయాలు మాట్లాడను. ఇక నుంచి ఏ రాజకీయ పార్టీతో నాకు సంబంధం లేదు. ఏ పార్టీని పొగడను…మాట్లాడను…విమర్శించను. నన్ను ఎవరూ ఏమనలేదు…ఎవరి గురించి ఇక మాట్లాడను. నేను ఓ పార్టీని తిట్టాలని, పొగడాలని రాజకీయాల్లోకి రాలేదు. ఓటర్ లాగే ప్రశ్నించా…మంచి చేస్తే వాళ్లకి సపోర్ట్ చేశా.
నా కుటుంబం, పిల్లల కోసం రాజకీయాలు వదిలేస్తున్నా అని పోసాని కృష్ణమురళి ప్రకటించాడు. సాటి సినీ నటుడు అని కూడా చూడకుండా పవన్ కల్యాణ్ ను ఇతను లకారాలతో సంబోధించిన విషయం తెలిసిందే. అదే విధంగా పెద్దంతరం చిన్నంతరం లేకుండా చంద్రబాబు నాయుడిపై కూడా ఇతను అతి నీచమైన భాష వాడాడు. అలాగే నారా లోకేష్ పై పలు రకాల అసత్య ఆరోపణలు చేసి కోర్టు కేసులు ఎదుర్కొంటున్నాడు. ఇతనిపై ఇటీవల ఏపిలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అవుతున్నాయి. దాంతో పోసాని రాజకీయాలకు గుడ్ బై చెప్పాడు. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన పోసానిని కూటమి ప్రభుత్వం క్షమించి వదిలేస్తుందా? లేక అతి నీచమైన ఆరోపణలు చేసిన పోసానిపై కేసులను కొనసాగిస్తుందా అనేది వేచి చూడాలి.