భావ స్వేచ్ఛ పేరుతో బూతులు తిట్టే వైఎస్సాఆర్ సీపీ నేత పోసాని కృష్ణ మురళిని వెంటనే అరెస్ట్ చేయాలని సీనియర్ సినీ నిర్మాత నట్టి కుమార్ డిమాండ్ చేశారు. పోసాని నేటికీ వితండ వాదముగా మాట్లాడుతున్నారని, ఆయన మాటలను ఖండిస్తున్నట్లు నట్టి కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. “పోసాని మాటలు దయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉన్నాయి.
వైఎస్సాఆర్ సీపీ ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియాను ఇష్టారాజ్యంగా చేసుకుని బూతులు తిట్టే విష సంసృతికి నాంది పలికిన ఆ పార్టీ కార్యకర్తలు ఎలా రెచ్చిపోయారో ప్రజలందరికీ తెలియంది కాదు. పలుమార్లు ముఖ్యమంతి పీఠాన్ని అధిష్టించిన విజన్ కలిగిన నాయకులు, పెద్ద మనిషి నారా చంద్రబాబు నాయుడు అంతటి వారితో పాటు, పవన్ కళ్యాణ్ తదితరులనే కాదు వారి ఫ్యామిలీస్ కు చెందిన మహిళల పైన కూడా సోషల్ మీడియాలో అభ్యంతకర పోస్టులు పెట్టించి, పైశాచిక ఆనందం పొందింది వైఎస్సాఆర్ సీపీ నేతలు కాదా!
ఇవన్నీ జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి, పోసాని వంటి వారికి తెలియదా! వీటిని వాళ్ళు ప్రోత్సహించ లేదా! ఒక్కసారి వారంతా మననం చేసుకోవాలి. ఇప్పటికీ ఆ సంసృతి నుంచి వైఎస్సాఆర్ సీపీ నేతలు బయటపడకుండా అవాకులు, చవాకులు పేలుతుండటం వారి మానసిక స్థితిని తెలియజేస్తుంది. మనం ఎలాంటి భాషను వాడుతున్నాము, అలాగే మన కార్యకర్తల చేత ఏమి మాట్లాడిస్తున్నామో వైఎస్సాఆర్ సీపీ నేతలు గుర్తుకు తెచ్చుకోవాలి.
పాలసీ పరంగా, సబ్జెక్టు పరంగా వాస్తవాలను ఎవరైనా మాట్లాడవచ్చు, దానికి ఏ పార్టీ అయినా ముందుకు రావచ్చు. కానీ కావాలని లేనిపోని ఆరోపణలు చేయడమే కాదు. తిట్టడమే లక్ష్యంగా చేసుకుని చౌకబారు మాటలను ఉపయోగించడం ఎంతవరకు సంస్కారమో వైఎస్సాఆర్ సీపీ నేతలు ఆలోచించుకోవాలి. ప్రజలు వారిని ఘోరంగా ఓడించినా వారి బుడ్డి మాత్రం ఇంకా మారడం లేదు. ఏదోవిధంగా ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసి, ఆ విధంగా లాభపడాలని అనుకుంటున్న వారికి ప్రజలు ఇంకా తగినరీతిలో బుధ్హి చెబుతారు.
గతంలోనే కాదు నేటికీ భావ స్వేచ్ఛ అంటూ బూతులు తిడుతున్న పోసానిపై ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ అని నట్టి కుమార్ స్పష్టం చేశారు. అటు.. పోలీసుల అదుపులో ఉన్న వర్రా రవీందర్‌రెడ్డి వాంగ్మూలం ఆధారంగా.. సజ్జల భార్గవ్ సహా ఐదుగురు వైసీపీ నేతలపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటివరకు ఐదు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు సజ్జల భార్గవ్ రెడ్డి. అటు.. ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి కోసం గాలింపు కొనసాగుతోంది. అటు.. హోమ్‌మంత్రి అనితపై అసభ్యకర పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్త రాజశేఖర్‌రెడ్డిని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంట్లో అరెస్టు చేశారు పోలీసులు.
ఫేక్ అకౌంట్లతో వాళ్లమీద వాళ్లే పోస్టులు పెట్టుకున్నారని, పోలీసులు మాత్రం తమను టార్గెట్ చేస్తున్నారని వాపోతోంది వైసీపీ. అటు.. కేసులను, అరెస్టులను తీవ్రంగా తీసుకున్న వైసిపి అదే స్థాయిలో ప్రతిఘటిస్తోంది. ఇప్పటికే జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది. కానీ.. అసభ్యకర పోస్టులు పెట్టినవారిని చట్టబద్ధంగానే అరెస్టు చేస్తున్నామంటూ సమర్థించుకుంటోంది ప్రభుత్వం. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుని ప్రతిపక్షాన్ని టార్గెట్ చేశారని, దీనిపై కేంద్ర ఎన్నికల ఎలక్షన్ కమిషన్ స్పందించాలని, వైసీపీ గుర్తింపు రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తోంది టీడీపీ.