32.7 C
Hyderabad
March 29, 2024 10: 29 AM
Slider సంపాదకీయం

చిరంజీవిపై మండిపడుతున్న పవర్ స్టార్ అభిమానులు

#Chiranjeevi

దుష్ట రాజకీయాలపై ప్రాణాలకు తెగించి పోరాడుతున్న పవన్ కల్యాణ్ కు నైతిక మద్దతు ఇవ్వకపోగా శల్య సారధ్యం చేస్తున్న మెగాస్టార్ చిరంజీవిపై పవర్ స్టార్ అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

వీలున్నప్పుడల్లా కల్పించుకుని మరీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని పొగుడుతున్న చిరంజీవిపై పవర్ స్టార్ అభిమానులే కాకుండా కాపు సంఘాల వారు కూడా నిప్పులు చెరగుతున్నారు.

పవన్ కల్యాణ్ ను రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. వై ఎస్ జగన్ క్యాబినెట్ లో మంత్రులు ఇటీవలె పవన్ ను అద్దెమైక్ అంటూ సంబోధించారు.

బిజెపితో కలిసి ఉన్న పవన్ కల్యాణ్ ను వైసీపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నా బిజెపి నేతలు స్పందించడం లేదనే బాధతో ఉన్న పవన్ కల్యాణ్ అభిమానులకు చిరంజీవి ప్రతి సారీ ‘‘ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు’’ అంటూ పెడుతున్న మెసేజీలు చిర్రెత్తిస్తున్నాయి.

చిత్రపరిశ్రమకు తానే పెద్దగా భావిస్తున్న చిరంజీవి ముఖ్యమంత్రి సినీ పరిశ్రమకు రాయితీలు ఇస్తున్నారంటూ పదే పదే ధన్యవాదాలు చెబుతున్నారు. కరోనా సమయంలో షూటింగ్ లకు అనుమతించాలంటూ చిరంజీవి స్వయంగా జగన్ ను కలిసి వచ్చారు.

అన్ని రాష్ట్రాలతో బాటు కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు కూడా షూటింగ్ కు అనుమతులు ఇస్తే దాన్ని జగన్ కు ఆపాదిస్తూ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. వీలుచిక్కినప్పుడల్లా జగన్ ను పొగడడమే ధ్యేయంగా పెట్టుకున్న చిరంజీవి మెగాస్టార్ పవన్ కల్యాణ్ కు రాజకీయంగా తీరని నష్టం చేస్తున్నారని పవర్ స్టార్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటి వరకూ మెగాస్టార్ అభిమానులు, పవర్ స్టార్ అభిమానులు కలిసే ఉన్నారు. చిరంజీవి ప్రవర్తనతో ఇద్దరి మధ్య చీలికలు వస్తున్నాయి. జగన్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాపు సంఘాల నేతలు కూడా చిరంజీవి వ్యాపారాత్మక ధోరణి పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయంగా విఫలమైన చిరంజీవి తన తమ్ముడు కూడా విఫలం అయ్యేలా చేస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కాపు గ్రూపుల్లో, ఫేస్ బుక్ కామెంట్లలో చిరంజీవిని దుమ్మెత్తిపోస్తున్నారు. అమరావతి రాజధానికి మద్దతు ఇవ్వకపోగా మూడు రాజధానుల అంశానికి మద్దతు తెలిపిన చిరంజీవి వ్యవహారం అప్పటిలో చర్చనీయాంశం అయింది.

అదే వ్యవహార శైలిని చిరంజీవి కొనసాగించడం పవర్ స్టార్ అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తున్నది. కాపుకుల సంఘాలకు ఏనాడూ బహిరంగ మద్దతు ఇవ్వకపోయినా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినపుడు కాపు కుల సంఘాల వారు బేషరతుగా మద్దతు ఇచ్చారు.

దాన్ని ఆయన నిలబెట్టుకోలేకపోయారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కాపు కులస్తులకు ఆశాజ్యోతిగా కనిపిస్తున్న తరుణంలో చిరంజీవి ముఖ్యమంత్రి జగన్ ను తరచూ పొగుడుతుండటం ఇబ్బందికరంగా మారింది.

చిరంజీవి ముఖ్యమంత్రిని పొగిడినప్పుడల్లా వైసీపీ సోషల్ మీడియా దాన్ని వైరల్ చేస్తున్నది. పవన్ కల్యాణ్ అభిమానులకు ఇది పుండుపై కారం చల్లినట్లుగా మారింది.

చిన్న చిన్న రాజకీయ లాజిక్కులు కూడా మర్చిపోయి కేవలం వ్యాపారాత్మక ధోరణితో ప్రవర్తించడం మంచిది కాదని కాపు పెద్దలు హితవు చెబుతున్నారు. ప్రాణాలకు తెగించి పోరాడుతున్న తమ్ముడి తరపున పోరాడాలని వారు చిరంజీవిని కోరుతున్నారు.

Related posts

జర్నలిస్టు సురేష్ కు అల్లంనారాయణ సాయం

Satyam NEWS

కోమటిరెడ్డీ… రాజకీయ సన్యాసం ఎప్పుడు తీసుకుంటున్నావ్

Satyam NEWS

అర్హులైన లబ్ధిదారులకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలి

Satyam NEWS

Leave a Comment