28.2 C
Hyderabad
January 21, 2022 17: 38 PM
Slider సంపాదకీయం

జగన్మోహనంలో చిక్కుకున్న ఏపి ప్రభుత్వ ఉద్యోగులు

#PRC

పాపం… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరిని ఏమనాలో అర్ధం కాక తమ చేతకాని తనాన్ని తామే ట్రోల్ చేసుకుంటున్నారు. పీఆర్సీ కోసం డిమాండ్ చేస్తూ ఆందోళన ప్రారంభించిన ఏపి ప్రభుత్వ ఉద్యోగులకు ఏమిచ్చారో తెలియని స్థితిలో ఉంచి వారిని ముఖ్యమంత్రి సంతృప్తి పరచారు.

తాము సాధించింది ఏమిటో తెలియని ఉద్యోగ సంఘాల నాయకులు ‘‘ఒకటి కావాలంటే ఒకటి కోల్పోవాలి’’ అంటూ వేదాంతం చెప్పారు. ఒకటి ఏమి కావాలనుకున్నారో… ఏది పొందారో చెప్పలేక మొహం చాటేశారు. దాంతో ఉద్యోగ సంఘాల వాట్సప్ లో జోకులు వెల్లువెత్తాయి.

ముఖ్యమంత్రి ఇచ్చిన అదనపు డబ్బులు ఏం చేసుకోవాలో తెలియని ఉద్యోగులు తమ సంపాదన దాచుకోవడానికి స్విట్జర్ ల్యాండ్ కు టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారు అంటూ ఒకాయన మెసేజి పెట్టారు. అయితే అందుకు వీసా రాలేదు అంటూ మరోకాయన సమాధానమిచ్చారు.

హాయిగా సాగుతున్న సంసారాన్ని వదిలి ఒక తాగుబోతు వాడితో లేచిపోయిన మహిళ జీవితం ఎలా ఉంటుందో ఏపి ఉద్యోగుల పరిస్థితి అలానే తయారైందని పాపం మరొకాయన వాపోయాడు. బయటికి కొంత మంది ఒప్పుకోకపోయినా కూడా ఇది వాస్తవం అని ఆయన అన్నారు.

ఆ తాగుబోతుతో బతుకు ఉండదు… మళ్లీ మొగుడి దగ్గరకు రావడానికి మొఖం ఉండదు అంటూ ఆయన తమ దీన పరిస్థితిని వివరించారు. కాలం ఎవరి రుణం ఉంచుకోదు..ఎవరికి ఇవ్వాల్సింది, వాళ్ళకి వడ్డీతో సహా చెల్లిస్తుంది. ప్రతిపక్షానికి 23 సీట్లు రావడం లో ఉద్యోగులు 2 చేతులతో ఓట్లు వేసి మన అందరి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు..దేవుడు అదే ఉద్యోగులకు 23% Fitment ఇచ్చి లెక్క సరిచేశాడు.. For every Action there is an equal and Opposite Reaction.. అంటూ మరో కామెంట్ వచ్చింది.

ఇలా తమ పై తాము జోకులు వేసుకుని ప్రభుత్వ ఉద్యోగులు ఏడవలేక నవ్వుతున్నారు. తమ సిబ్బందిని ఒప్పించుకోవాల్సి ఉంది అని ఒక నాయకుడు చెప్పిన మాటలు ఉటంకిస్తూ ‘‘రా వచ్చి మమ్మల్ని ఓదార్చు’’ అంటూ సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62ఏళ్లకు ఎందుకు పెంచారో ఎవరికి అర్ధం కావడం లేదు.

ఈ రెండేళ్లలో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ చేయబోతున్నారు. వారికి అన్ని బెనిఫిట్లు ఇచ్చేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు నుంచి ఈ రెండేళ్లు తప్పుకోవడానికి మాత్రమే పదవీ విరమణ వయసు పెంచినట్లు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

అడక్క పోతే అమ్మయినా పెట్టదు అనేది పాత సామెత. అడిగితే జగనన్న ఇవ్వడు అనేది నేటి సామెత. ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులు ఇంతకాలం అడుగుతున్నవి కాకుండా కొత్త వరాలు ఇచ్చిన సీఎం జగన్ కొత్త విమర్శలు కొని తెచ్చుకున్నారు. పిఆర్సీ నివేదిక ఇప్పటి వరకూ బయట పెట్టకుండానే సమస్యను సెటిల్ చేయడం జగన్ ప్రభుత్వ ప్రత్యేకతగా చెబుతున్నారు.

చర్చలకు వెళ్లిన ఉద్యోగ సంఘాల నాయకులు కూడా పీఆర్సీ నివేదికలో ఏమి సిఫార్సు చేశారు అనే విషయం అడిగే సాహసం చేయలేకపోయారు. ప్రభుత్వంపై  రూ.10, 247 కోట్ల అదనపు భారం పడుతుందని చెబుతున్నారు కానీ ఉద్యోగులకు వేతనాలు తగ్గుతాయని కూడా మరొక వాదన వినిపిస్తున్నది.

ఏది ఎలా ఉన్నా జగన్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులను అదుపులో పెట్టుకున్నంతగా ఇంత వరకూ ఏ ప్రభుత్వం అదుపు లో పెట్టుకోలేదు. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ఉద్యోగ సంఘాల నాయకులు పార్టీ వర్కర్ల కన్నా విధేయతతో పని చేస్తుండటం జగన్ కు కలిసి వచ్చిన అదృష్టం.

Related posts

భారత జన్యుమార్పిడి బియ్యంపై ప్రపంచవ్యాప్తంగా కలకలం

Sub Editor

ఫర్ గాటెన్ ప్రామిస్: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తూచ్

Satyam NEWS

శివోహం: కుప్పకూలిన అమీన్ సాహెబ్ పాలెం ప్రభ

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!