గత పాలకుల తప్పులను సరిదిద్దుతూ ముఖ్యమంత్రి కేసీ ఆర్ తెలంగాణ ను సస్యశ్యామలం చేస్తున్నారని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. వనపర్తి జిల్లా శ్రీ రంగాపురం మండలకేంద్రంలోని రంగసముద్రం రిజర్వాయర్ లో రెండులక్షల చేప పిల్లలను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్వేతామొహంతి, జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల కింద 40 ఆన్ లైన్ రిజర్వాయర్లు నిర్మించనున్నామని మంత్రి వెల్లడించారు. కృష్ణా నదికి పెద్దఎత్తున వరదలు వస్తున్నా నీటిని ఎత్తిపోసుకుని నిల్వచేసుకోలేని దుస్థితి లో పాలమూరు జిల్లా ఉందని దీనికి గత పాలకులే కారణమని ఆయన అన్నారు. పాలమూరు నీటిపారుదల ప్రాజెక్టుల పట్ల గత పాలకుల వివక్ష మూలంగా ఈ ప్రాంత ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని దీన్ని తాము సరిదిద్దుతున్నామని మంత్రి తెలిపారు. కృష్ణా జలాలపై హక్కు లేకున్నా కేవలం మిగులు జలాల ఆధారంగా రాయలసీమ, ఆంధ్రలో 400 టీఎంసీలు నిల్వచేసుకునే రిజర్వాయర్లు నిర్మించారనని, పాలమూరులోని కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాల కింద కనీసం 10 టీఎంసీలు నిల్వచేసుకునే పరిస్థితి కూడా లేకుండా చేశారని ఆయన అన్నారు. కనీసం వంద టీఎంసీల సామర్ధ్యం ఉన్న రిజర్వాయర్లు నిర్మించి ఉన్నా పాలమూరు ఈపాటికే సస్యశ్యామలం అయ్యేదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలో రెండురోజులు పర్యటించనున్నారని మంత్రి వెల్లడించారు.
previous post
next post