ప్రధాని నరేంద్ర మోడీ 16 వ తేదీ నుంచి 21 వరకు మూడు దేశాల పర్యటనకు వెళుతున్నారు. బ్రెజిల్ లోని రియో డి జెనీరోకు వెళ్లి అక్కడ జరిగే G20 సమ్మిట్‌లో పాల్గొంటారు. 2023లో న్యూఢిల్లీలో జరిగిన G20 సమ్మిట్‌లో భారత్ సాధించిన విజయాలను, ప్రధాని మోడీ ఈసారి బ్రెజిల్‌లో జరగనున్న G20 సమ్మిట్‌లో చెబుతూ ఆ అంశాలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.
గత G20 సమ్మిట్‌లో భారతదేశం, ప్రపంచంలోని ప్రధాన దేశాల నాయకులతో వివిధ అంశాలపై చర్చలు జరిపింది. ఈసారి కూడా భారత్, బ్రెజిల్, దక్షిణ ఆఫ్రికా తో కలిసి G20 ట్రోయికా భాగంగా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రధానమంత్రి మోడీ పర్యటనలో, భారత్ వాణిజ్య సంబంధాలు, ఆర్ధిక సహకారం, సుస్థిర అభివృద్ధి, వాతావరణ మార్పు, శాంతి మరియు భద్రత తదితర అంశాలపై ఇతర దేశాలతో చర్చలు జరుపుతారని అంచనా వేస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ ఈ పర్యటన ద్వారా దేశ ప్రయోజనాల కోసం మరిన్ని దేశాల మద్దతు సాధించాలని, భారత్ ను ప్రపంచంలో మరింత శక్తివంతమైన దేశంగా నిలిపే దిశగా పని చేస్తారని భావిస్తున్నారు.