భారత ప్రధాని నరేంద్రమోడీ త్వరలో అమెరికాలో పర్యటించనున్నారు. రెండు దేశాల మధ్య సమగ్రమైన, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వాషింగ్టన్ పర్యటన ఉంటుందని భారత విదేశీ మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని మోడీతో ఫోన్ లో సంభాషించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బహుశా ఫిబ్రవరిలో మోడీ వైట్‌హౌస్‌కు రాబోతున్నారు అని అంటున్నారు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ వాషింగ్టన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి అవుతుంది. ప్రతిపాదిత పర్యటనపై భారతదేశం, యుఎస్ మధ్య చర్చలను ధృవీకరిస్తూ, విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పర్యటన కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. జనవరి 27న వారి ఫోన్ సంభాషణలో, వాణిజ్యం, ఇంధనం మరియు రక్షణ రంగాలలో భారతదేశం-యుఎస్ సహకారాన్ని పెంపొందించడంపై దృష్టి సారించాలని నిర్ణయించారు. “విశ్వసనీయ” భాగస్వామ్యం కోసం పని చేస్తామని మోడీ, ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు. “ప్రధాని మోడీ మరియు అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల టెలిఫోన్ సంభాషణలు జరిపారు. భారత్-అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత లోతుగా చేయడానికి ఇరుపక్షాలు పర్యటనపై కసరత్తు చేస్తున్నాయి అని జైస్వాల్ తన వారాంతపు మీడియా సమావేశంలో అన్నారు. మోడీ పర్యటన ఫిబ్రవరి 12-14 మధ్య ఉండవచ్చు. అయితే తేదీలు ఇంకా ఖరారు కాలేదని తెలిసింది.
previous post