వనపర్తి జిల్లాలో కొన్ని పోలీసుస్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాగా మారాయని విమర్శలు ఉన్నాయి. జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ప్రజల నుండి పిర్యాదులు తీసుకుని సమస్యలు పరిష్కారం చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. కాని కొన్ని పోలీసుస్టేషన్లలో రాజకీయ నేతలు ప్రవేశించి వత్తిడి తెచ్చి సంబంధం లేని విషయాలు అనగా ప్రామిసరి నోటు అప్పుల కేసులు, ప్రైవేట్ వివాదాలను పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది.
పోలీసు స్టేషన్లలకు వచ్చే వారిని సిసి కెమెరాల ద్వారా గమనించి చర్యలు తీసుకోవాలని నిజాయితీపరులు కోరుతున్నారు. రియల్ ఎస్టేట్ మోసాలు, రోడ్లను అమ్ముకుంటున్న వారి గురించి, వివిధ రకాల చిటర్ల గురించి పోలీసులకు పిర్యాదులు చేస్తున్నారు. జిల్లాలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు రియల్ ఎస్టేట్, మద్యం వ్యాపారం, చిట్టీల నిర్వహణ చేస్తున్నారు. పిర్యాదుల్లో ఉన్న ప్రకారం ఉద్యోగులు, వారి బంధువులు, మిత్రులు, ఇతరుల సెల్ ఫోన్ కాల్ డేటా సేకరించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
డబ్బుల కక్కుర్తి ఉన్న వారికి, అవకాశ వాదులకు, మోసాలు చేసే వారికి పార్టీ బేధాలు, వరుసలు,నీతి, నిజాయితీ ఉండదు. చెడు గుణాలు ఉన్న వారికి తెలివితేటలు బాగుంటాయి. అధికార పార్టీ నేతలను, అధికారులతో సంబంధాలు పెంచుకోవడంలో దిట్ట. తెలంగాణ ఏర్పడక ముందు వనపర్తి ప్రాంతంలో నక్సలైట్ల ప్రాబల్యం ఉన్నపుడు నిజాయితీ పోలీస్ అధికారులు డిఎస్పీలు నాగోరావు, సూర్యప్రకాష్ రావు ప్రజలతో సంబంధాలు పెంచుకుని నక్సలైట్ల ప్రాబల్యాన్ని తగ్గించారు. ఆ సమయంలో పోలీస్ అధికారులు, అధికార పార్టీ నాయకులు స్వేచ్ఛగా తిరగలేదు.
ఆనాడు ఎక్కడైనా సంఘటన జరిగితే పోలీసులు బస్సులో వెళ్ళి వివరాలు తెలుసుకునేవారు. ఆ తర్వాత ఐపిఎస్ నిజాయితీ అధికారి ఆకే రవికృష్ణ వనపర్తి ఎఎస్పి(డి ఎస్పీ) పని చేస్తూ అవినీతి అధికారులను, అవినీతి నాయకులను వదలలేదు. ప్రజలతో సంబంధాలు పెంచుకుని సమస్యలు పరిష్కారం చేశారు. అకే రవికృష్ణ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఐజి హోదాలో పని చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ప్రజలతో సంబంధాలు పెంచుకుంటున్నారు. పోలీస్ అనే ఫీలింగ్ లేకుండా, అహం లేకుండా పని చేస్తున్నారని ప్రజల్లో పేరుంది.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్