37.2 C
Hyderabad
April 19, 2024 14: 05 PM
Slider ప్రత్యేకం

నిన్నటి వరకూ క్లాసులు చెప్పిన టీచర్లు వీరు…

#Private Teachers

కరోనా మహమ్మారి ప్రైవేట్ ఉద్యోగులను రోడ్డున పడేసింది. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల్లో బోధించే లెక్చరర్లు, ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. విద్యాసంస్థలు మూత పడటంతో జీతాలు లేక ఇప్పటికే కొందరు ఆత్మహత్యల బాట పట్టారు. కానీ తాము చదివిన చదువుకు ఎక్కడైనా ఏ పనైనా చేసుకోవచ్చు అని నిరూపిస్తున్నారు కొందరు ఉద్యోగులు. ఉద్యోగంలో చేరకముందు చేసిన పనినే మళ్ళీ వృత్తిగా ఎంచుకుని జీవనం కొనసాగిస్తూ మిగతా ఉద్యోగులకు ఆదర్శంగా నిలుస్తున్నారు

కామారెడ్డి జిల్లా రాజంపేట మండలానికి చెందిన ఇద్దరు ప్రైవేట్ లెక్చరర్లు సొంతంగా చిరు వ్యాపారాలు, వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో గణితం, కామర్స్ లెక్చరర్లుగా ఆన్లైన్ క్లాసులు చెప్తూ మిగతా సమయంలో తమ పనుల్లో నిమగ్నమవుతున్నారు.

టీచర్ పెట్టిన మిక్స్ డ్ చాట్ భండార్

రాజంపేట మండల కేంద్రానికి చెందిన ఆముద మల్లేష్ ఎంఎస్సి, బీఈడీ చేసి కళాశాలలో మ్యాథ్స్ లెక్చరర్ గా పని చేస్తున్నారు. కరోనా కంటే ముందు ఫుల్ టైం కళాశాలలో పని చేసిన ఆయనకు ఇంట్లో ఇబ్బందులు ఎదురయ్యాయి. దాంతో సొంత బిజినెస్ అయిన మిక్స్ డ్ చాట్ భండార్ పై దృష్టి పెట్టారు. మండల కేంద్రంలోని బంస్టాండ్ వద్ద చాట్ బండార్ బండిపై చిరు వ్యాపారం చేసుకుంటున్నారు. అలాగే మధ్యాహ్నం సమయంలో కళాశాలకు వెళ్లి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు చెప్తున్నారు.

అదే మండలంలోని శివాయిపల్లి గ్రామానికి చెందిన జిల్లెల నవీన్ రెడ్డిది వ్యవసాయ కుటుంబం. ఎంకామ్ చేసిన నవీన్ రెడ్డి ప్రైవేట్ కళాశాలలో కామర్స్ లెక్చరర్ గా పని చేస్తున్నారు. కరోనా ప్రభావంతో చాలినంత వేతనం లేకపోవడంతో ప్రస్తుతం వ్యవసాయ పనిలో నిమగ్నమయ్యారు. వ్యవసాయంతో పాటు కళాశాలకు వెళ్లి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు చెప్తున్నారు.

సొంతకాళ్లపై నిలబడుతున్నాం

వీరిరువురు సత్యం న్యూస్ తో మాట్లాడుతూ.. కరోనా ప్రభావం వల్ల కళాశాలలు మూత పడటంతో తమ సొంత కాళ్లపై నిలబడి పనులు చేసుకుంటున్నామన్నారు. అలాగే కళాశాల యాజమాన్యం కూడా కళాశాలల పరిస్థితి బాగలేకున్నా ఎంతో కొంత వేతనం ఇస్తూ తమకు అండగా ఉందన్నారు.

ఇటీవల ఓ ప్రైవేట్ ఉపాధ్యాయుడు ఆర్థిక పరిస్థితి బాగలేక అప్పులు ఎక్కువై ఆత్మహత్య చేసుకోవడం తమను బాధించిందని తెలిపారు. కళాశాలలో పని లేకపోయినంత మాత్రాన తమ కాళ్ళమీద తమకు నిలబడే శక్తి ఉందని, తాము చదువుకున్న చదువుతో ఎక్కడైనా కనీసం 10 వేల పైనే వేతనం వచ్చే పని చేసుకోగలమని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులకు ఆత్మహత్య పరిష్కారం కాదని, ధైర్యంగా ఎదుర్కొనే సత్తా తమలో ఉందని, సమస్యను ఎదుర్కోవడానికి ధైర్యంగా ముందుకు సాగాలని తోటి ప్రైవేట్ ఉద్యోగులకు సూచించారు.

వడ్ల సురేష్, కామారెడ్డి

Related posts

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో రథసప్తమికి స‌ర్వం సిద్ధం

Satyam NEWS

క్యాన్సర్ రోగికి ఆర్థిక సహాయం చేసిన మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల

Bhavani

భారీగా నల్ల బెల్లం పట్టివేత

Murali Krishna

Leave a Comment