నాగపూర్ జైల్లో ఉన్న ప్రొఫెసర్ సాయిబాబా ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని ఆయన కుటుంబ సభ్యలు హైకోర్టుకు విన్నవించుకోగా జైల్లో ఆయనకు ఫస్ట్ క్లాస్ వైద్యం అందిస్తున్నామని పోలీసులు చెప్పడంతో కోర్టు బెయిల్ నిరాకరించింది. ఆర్నెల్ల తర్వాత నిన్న సాయిబాబాను చూడ్డానికి ఆయన తమ్ముడు రాందేవ్, అడ్వకేట్ బల్లా రవీంద్రనాథ్ వెళితే ఆయన ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడకపోగా, మరింత దిగజారిందని తెలిసింది. సరైన వైద్యం లేక ఆయన ఎడమ భుజంలో నొప్పి తీవ్రమయింది.
జులై 22న ఎం.ఆర్.ఐ. పరీక్షలు చేశారు, కాని రెండు నెలల వరకు ఆయన్ను న్యూరాలజిస్ట్ వద్దకు తీసుకుపోలేదు. ఆ కాలమంతా ఆయనకు జ్వరం వస్తూ పోతూ ఉంది. సెప్టెంబర్ 23 నాడు ఆయన్ను హాస్పిటల్ కు తీసుకెళితే, అప్పుడు నాగపూర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ న్యూరాలజీ డాక్టర్లు ఎం.ఆర్.ఐ. రిపోర్టులు చూసి ఇదివరకే క్షీణించిన ఎడమ భుజం కండరాలలో ఇన్ఫెక్షన్ వ్యాపించిందని చెప్పారు. ఇది సీరియస్ కేసని, ఈ ఇన్ఫెక్షన్ వల్లనే ఆయనకు చలి జ్వరం వస్తున్నదని, వెంటనే అడ్మిట్ చేయమని చెప్పారు. అయితే పోలీసులు ఆయన్ను తిరిగి జైలుకు తీసుకెళ్ళారు. బహుశా అక్టోబర్ 1 లేదా 2న ఆయన్ను ఆసుపత్రిలో చేర్చవచ్చని సమాచారం.
అయితే ఆయనకు ఇతరేతర తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. న్యూరాలజిస్ట్ చెప్పిన దాని ప్రకారం ఆ హాస్పిటల్ లో సాయిబాబాకు వైద్యం అందించడానికి అవసరమైన సదుపాయాలు లేవు. కనుక అన్ని సదుపాయాలు ఉన్న ఆసుపత్రికి ఆయన్ను వెంటనే తరలించాలి. రెండు కాళ్ళు పని చేయని మనిషికి, ఒక చేయి కూడా కదలని స్థితి ఏర్పడటం ఎటువంటిదో ఊహించవచ్చు.
ఈ విధంగా మనిషిని ముట్టుకోకుండా కూడా చిత్ర హింసలు పెట్టవచ్చని నాగపూర్ జైలు అధికారులు నిరూపిస్తున్నారు. తక్షణం ప్రొఫెసర్ సాయిబాబాకు మెరుగైన వైద్యం అందించాలని, ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం. ప్రజాస్వామికవాదులందరూ దీనిపై గొంతువిప్పాలని విజ్ఞప్తి.
– పాణి, కార్యదర్శి, విరసం