23.8 C
Hyderabad
September 21, 2021 22: 19 PM
Slider శ్రీకాకుళం

ఆగస్టు 9న శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనలు

#CITU Srikakulam

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 9న శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించాలని సి.ఐ.టి.యు. రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.గోవిందరావు, కోశాధికారి అల్లు. సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్.లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.

రైతాంగ, కార్మిక వ్యతిరేక చట్టాలు రద్దుకై, ప్రజాస్వామ్య రక్షణకై సేవ్ ఇండియా-సేవ్ అగ్రికల్చర్ నినాదంతో ఇచ్చాపురంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు.

ఈ  సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 9న మండల, జిల్లా కేంద్రాలలో జరుగు ఆందోళన కార్యక్రమాలలో కార్మికులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని, విద్యుత్ సంస్కరణ బిల్లు వెనక్కి తీసుకోవాలని, పంటల కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని, ఢిల్లీ సరిహద్దుల్లో గత ఎనిమిది నెలలుగా లక్షలాది మంది రైతులు ఉద్యమం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ విరమించాలని, నాలుగు లేబరు కోడ్లను రద్దు చేయాలని కార్మికవర్గం సమర శంఖారావం పూరించిందని అన్నారు.

దేశానికి, రైతాంగానికి నష్టదాయకమైన మూడు వ్యవసాయ చట్టాలు వలన ఇప్పటి వరకు ఉన్న మద్దతు ధరల విధానం, ప్రభుత్వ పంటల కొనుగోలు సంస్థలు, మార్కెటింగ్ కమిటీలు బలహీన పడి కనుమరుగవుతాయని తెలిపారు.

ప్రభుత్వ పాత్ర లేకుండా పోతుందని, కార్పోరేట్ కంపెనీల దోపిడికి వ్యవసాయ రంగం బలవుతుందని అన్నారు. రైతులు, కౌలు రైతులు భూములకు దూరమవుతారని తెలిపారు. కంపెనీ వ్యవసాయంతో భూకేంద్రీకరణ, యాంత్రీకరణ పెరిగి పని దినాలు తగ్గి వ్యవసాయ కార్మికులు ఉపాధి కోల్పోతారని అన్నారు. ఇప్పటికే విపరీతంగా పెరిగిని నిత్యావసర సరుకుల ధరలు వ్యవసాయ చట్టాలు వలన ఇంకా పెరిగిపోతాయని అన్నారు.

ప్రమాదకరమైన మూడు చట్టాలు, విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మరో ప్రమాదకరమైన విద్యుత్ సంస్కరణల బిల్లును రద్దు చేయాలని డిమాండ్‌ చేసారు. ప్రజలకు ఇస్తున్న రాయితీలు రద్దు చేయాలని, వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేయాలని రాష్ట్రాలపై ఒత్తిడి చేస్తూ రాష్ట్రాల హక్కులను మోడి ప్రభుత్వం హరిస్తున్నదని విమర్శించారు.

ఆస్తిపన్ను, చెత్త సేకరణ పన్ను వంటి భారాలు పెంచారు. ఈ కాలంలోనే బ్యాంకులు, ఇన్సూరెన్స్, విద్యుత్తు, రైల్వే, విశాఖ స్టీల్ ప్లాంట్ మరియు ఇతర కీలక ప్రభుత్వ రంగ పరిశ్రమలను గుండుగుత్తగా ప్రైవేటీకరిస్తున్నదని విమర్శించారు. ప్రకృతి వనరులను కార్పోరేట్ కంపెనీలకు కారుచౌకగా కట్టబెడుతుంది. వారు సంపదలను పోగేసుకోవడానికి తోడ్పడుతోందని అన్నారు.

రైతు, కార్మిక, ఉద్యోగ, సాధారణ ప్రజలకు వ్యతిరేకంగా ధనిక, కార్పోరేట్ వర్గాలకు అనుకూలంగా విధానాలు అమలు చేస్తూ, ప్రజల ఆస్తులను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తూ, కార్మిక హక్కులను కాలరాస్తున్న మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వ విధానాలను త్రిప్పి కొట్టడానికి సాగుతున్న ప్రజా ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఆగస్టు 9 క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో సేవ్ ఇండియా దినంగా పాటించి, మండల, జిల్లా కేంద్రాల్లో జరుగు నిరసన కార్యక్రమంలో పాల్గోవాలని కోరారు.

ఎన్నో ఏళ్ళుగా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తూ నాలుగు లేబరు కోడ్లు తీసుకు వచ్చిందని కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు కనీస వేతనం, ఉద్యోగ భద్రత హక్కులకు చేటు తెచ్చిందని తెలిపారు. చౌకగా కార్మిక శ్రమను పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకు లేబర్ కోడ్లతో కార్మికులను దగా చేసిందని, కార్మికులను బానిసలుగా మార్చేసిందని విమర్శించారు.

ఉపాధిహామీ పథకాన్ని నీరుగార్చే విధానాలకు శ్రీకారం చుట్టిందని విమర్శించారు. పనిదినాలు 200రోజులకు పెంచాలని, కనీస వేతనం రోజుకి రూ. 600/-లు | ఇవ్వాలనే న్యాయమైన డిమాండ్స్ పట్టించుకోక పోగా వేతనాలు చెల్లింపుల్లో కులాల సమస్యను ముందుకు తెచ్చి ఎస్సీ, ఎస్టీలకు వేరుగా చెల్లింపులు చేసి కష్ట జీవుల మధ్య చిచ్చు పెడుతుందని అన్నారు.

ఈ సదస్సులో వివిధ సంఘాల నాయకులు ఎర్రయ్యరెడ్డి, దుర్యోధనరెడ్డి,కృష్ణ, చంద్రశేఖర్, బి.హైమావతి, డిల్లేశ్వరి, పద్మజారాణి, కె.విజయలక్ష్మీ , ఉమ.దుర్యోధన,క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

థాంక్స్: విశాఖ ప్రజలకు మోడీ చేసిన పెద్ద సాయం ఇది

Satyam NEWS

ఫ్రాడ్ కేసులో మహాత్మా గాంధీ మునిమనుమరాలికి ఏడేళ్ల జైలు శిక్ష

Satyam NEWS

ప్రజా సమస్యల పరిష్కారంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!