24.7 C
Hyderabad
March 26, 2025 09: 31 AM
Slider ప్రత్యేకం

పీవీ సునీల్ కుమార్ ను ఇప్పటికైనా సస్పెండ్ చేయాలి

#raghurama

ఐపీఎస్ అధికారి, అంబేద్కర్ మిషన్ సంస్థ వ్యవస్థాపకుడు పీవీ సునీల్ కుమార్ కులాల కుంపట్లను  రాజేసి ఆ వేడిలో చలి కాచుకోవాలని  ప్రయత్నిస్తున్నాడని ఉండి శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప శాసనసభాపతి రఘురామకృష్ణంరాజు అన్నారు. కులాల కుంపట్లను రాజేయడానికి వారిని, వీరిని కాకుండా తన కుమారుడి కంపెనీలోని వ్యాపార భాగస్వామిని రంగంలోకి దింపాడని అన్నారు.

గతంలో జోగారావు, తులసి బాబు పోలీసు స్టిక్కర్లు అతికించిన కారులోనే  ప్రయాణం చేసేవారు. వీరికి పీవీ సునీల్ కుమార్ ఏకంగా పోలీసు శాఖ వాహనాలను కూడా సమకూర్చేవాడు. పోలీసు వాహనాల్లోనే తిరుగుతూ, వీరు దందాలు చేస్తూ, డబ్బులు వసూలు చేసేవారు. బుధవారం నాడు జరిగిన సంఘటన ద్వారా, ఈ విషయం మరోసారి రుజువయిందని  రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.

పోలీసు  స్టిక్కర్ ఉన్న వాహనంలో వచ్చి ప్రభుత్వ కార్యాలయం పై దాడి చేసిన వారిపై  ప్రభుత్వం  కచ్చితంగాచర్యలు తీసుకుంటుందనే తాను భావిస్తున్నట్లుగా రఘురామ కృష్ణంరాజు తెలిపారు. పోలీస్ శాఖ అచేతనంగా ఉండదని, చర్యలు తీసుకోవడం మాత్రం కాసింత ఆలస్యం అయిన మాట నిజమేనని  పేర్కొన్నారు. అయితే దేనికైనా సమయం రావాలని వెల్లడించారు. ఇటువంటి బ్లేటెంట్ దాడుల  తరువాత  కచ్చితంగా చర్యలు ఉంటాయనే అనుకుంటున్నానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకే ఆక్రమణల తొలగింపు

ఆకివీడు నగర పంచాయతీ పరిధిలోని ధర్మాపురం చెరువు చుట్టూ  ఆక్రమణలను తొలగించాలని  సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని రఘురామ కృష్ణంరాజు  తెలిపారు. ఆకివీడు నగర పంచాయతీలోని  30 శాతం మంది ప్రజలకు ధర్మాపురం చెరువు నుంచి  మంచినీటి సరఫరా జరుగుతుందని తెలిపారు. చెరువు చుట్టూ ఆక్రమణలతో పాటు, చెరువులోకి డ్రైనేజీ, సీవరేజి మురికినీరు కలుస్తోందని చెప్పారు. ఇదే సమస్యను  ప్రధానంగా ప్రస్తావిస్తూ పత్రికల్లోనూ, మీడియాలోనూ కథనాలు రావడం జరిగిందన్నారు.

సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం చెరువు చుట్టూ   అక్రమణాలను ఎప్పటినుంచో ఖాళీ చేయించాలని  ప్రయత్నించినా చేయడం లేదని చెప్పారు. చెరువు చుట్టూ ఆక్రమణలు చేపట్టిన వారికి ప్రత్యామ్నాయంగా ఇతర ప్రాంతాలలో ఇంటి స్థలాలను ఇచ్చి ఖాళీ చేయించాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని  అమలు చేస్తూ ఉంటే, కొందరు వ్యక్తులు బుధవారం నాడు పోలీసు  స్టిక్కర్ ఉన్న వాహనాన్ని  ( AP 09 BE 8001) వేసుకొని వచ్చి, మునిసిపల్ ఆఫీసు వద్ద  గొడవకు దిగారని తెలిపారు.

పోలీసులు వచ్చి మునిసిపల్ ఆఫీసు వద్ద గొడవ చేయటం ఏమిటని, వీళ్లు ఏమి పోలీసులని చెప్పి ఆరా తీయగా, వారంతా పీవీ సునీల్ కుమార్ స్థాపించిన అంబేద్కర్ మిషన్ సంస్థ కు చెందిన వ్యక్తులుగా  గుర్తించడం జరిగిందన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సర్వీస్ రూల్స్ కు భిన్నంగా పివి సునీల్ కుమార్, అంబేద్కర్  ఇండియా మిషన్ సంస్థ స్థాపించిన విషయాన్ని, గతంలో ఎన్నోసార్లు  కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశానని  రఘురామ కృష్ణంరాజు తెలిపారు. సర్వీస్ నిబంధనలను విచ్చలవిడిగా ఉల్లంఘిస్తూ, తోటి ఐపీఎస్ అధికారులు నివ్వెర పోయే  విధంగా వ్యవహరిస్తున్నప్పటికీ, అతడి పై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు.

తనకు తాను ఒక సంఘసంస్కర్త లాగా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పక్కన పివి సునీల్ కుమార్ తన ఫోటో వేసుకొని సభలు, సమావేశాలను నిర్వహిస్తూ ప్రసంగాలను చేస్తున్నాడు. మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా వ్యవహరిస్తున్నాడు. పీవీ సునీల్ కుమార్ కార్యకలాపాల గురించి గతంలోనే కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో  కేంద్రానికి ఎటువంటి నివేదిక అందజేయలేదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన ఇప్పటివరకు నివేదిక అందినట్లు తనకైతే తెలియదని రఘురామ కృష్ణంరాజు చెప్పారు.

ఇప్పటికీ పీవీ సునీల్ కుమార్  సర్వీసు నిబంధనలను ఉల్లంఘించి స్థాపించిన అంబేద్కర్ ఇండియా మిషన్ కార్యకలాపాల గురించి కేంద్రానికి నివేదిక వెళ్లలేదని నేను అనుకుంటున్నాను… కేంద్రానికి నివేదిక అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించాను. ఇప్పుడు పీవీ సునీల్ కుమార్ మరింత బరితెగించి వ్యవహరిస్తున్నాడు.

పీవీ సునీల్ కుమార్ కు జోగారావు అత్యంత సన్నిహితుడు

సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ కు వెంకట జోగారావు అనే వ్యక్తి  అత్యంత సన్నిహితుడని, అతడి పేరిట ఉన్న వాహనంలోనే వచ్చి ఆకివీడు మునిసిపాలిటీ కార్యాలయం వద్ద  కొంతమంది వ్యక్తులు గొడవకు దిగారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. పీవీ సునీల్ కుమార్ తరపున ఆర్థిక లావాదేవీలను జోగారావు నిర్వహిస్తాడని, ఆర్థిక దందాలను  తులసి బాబు చేస్తాడని ఆయన తెలిపారు. అక్రమంగా వచ్చిన డబ్బులను ఎలా వినియోగించాలో జోగారావు నిర్ణయిస్తాడని పేర్కొన్న రఘురామకృష్ణంరాజు, గతంలోనూ  ఈ వ్యవహారానికి సంబంధించిన  నివేదికలు ఉన్నాయని తెలిపారు. 

జోగారావు, పీవీ సునీల్ కుమార్ తనయులు హర్ష పాతాళ, రోహిత్ పాతాళ భాగస్వాములుగా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీని  నాలుగైదు ఏళ్ల క్రితం  స్థాపించారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. జోగారావు, తులసి బాబు గతంలో సిఐడి చీఫ్ గా సునీల్ కుమార్ కొనసాగిన సమయంలో, సిఐడి కార్యాలయంలోనే  ఉండేవారన్నాడు. వీరి ప్రమేయం లేకుండా ఈ సంఘటన జరిగే అవకాశం లేదన్నారు. ఆకివీడు మున్సిపల్ కార్యాలయానికి వచ్చి గొడవకు దిగిన వారిలో  అంబేద్కర్ ఇండియా మిషన్ ఈస్ట్ గోదావరి జిల్లా అధ్యక్షుడు ఒకరైతే, వెస్ట్ గోదావరి జిల్లా ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న వ్యక్తి మరొకరిని తెలిపారు. ప్రస్తుతం సునీల్ కుమార్ వీఆర్లో కొనసాగుతున్నాడు.

అతడికి పర్సనల్ స్టాఫ్  ఉండే అవకాశం లేదు. కానీ గతంలో అతడి వద్ద  సీసీ గా పని చేసిన వ్యక్తి చెబితే, మున్సిపల్ కార్యాలయం వద్ద గొడవ చేయడానికి వీరు జోగారావు పేరిట ఉన్న వాహనానికి వేసుకొని వచ్చారని  తెలిపారు. ఇది కచ్చితంగా పీవీ సునీల్ కుమార్  పనేనని  రఘురామకృష్ణం రాజు అన్నారు. ఇంత విచ్చలవిడిగా తమ వాహనానికి పోలీస్  స్టిక్కర్ తగిలించుకొని బాహాటంగానే రౌడీయిజం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు వాహనానికి పోలీస్ అనే స్టిక్కర్  తగిలించుకొని రౌడీయిజం చేయడానికి వచ్చిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలన్నారు.

తక్షణమే పీవీ సునీల్ కుమార్ ను సస్పెండ్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నానని పేర్కొన్నారు. ఇదొక్కటే కాదు… ఇంకా అనేక కారణాలు ఉన్నాయి. ఈ సంఘటన ఎంతో దారుణం. ఈ సంఘటన నాకు తెలియదని పీవీ సునీల్ కుమార్ పేర్కొనడానికి ఏమాత్రం అవకాశం లేదన్నారు. చాలా స్పష్టంగా అతని వద్ద పనిచేసిన సీసీ  నేరుగా ఫోన్ చేసి చెబితేనే, తాము వచ్చి గొడవకు దిగినట్లుగా  వారు చెప్పినట్లుగా ఆధారాలు ఉన్నాయని  రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు.

విచ్చలవిడిగా మాట్లాడే అధికారిపై చర్యలేవి?

విచ్చలవిడిగా నోటికొచ్చింది మాట్లాడుతున్న అధికారిపై చర్యలు తీసుకోలేని అచేతన స్థితిలో  రాష్ట్ర ప్రభుత్వం ఉందని తాను అనుకోవడం లేదని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఇది ఇలాగే కొనసాగితే, పీవీ సునీల్ కుమార్ ను ఇలాగే బజారులో వదిలేస్తే ఇతర అధికారులు కూడా ఇదే అలుసుగా భావించే ప్రమాదం లేకపోలేదు అన్నారు. జోగారావు కారును వేసుకుని పీవీ సునీల్ కుమార్ అనుచరులు  ప్రైవేటు వాహనానికి పోలీస్ అని స్టిక్కర్  పెట్టుకొని తిరుగుతూ, మునిసిపల్ కార్యాలయం పై దాడి చేయడం  అమానుషం.

ఇది కచ్చితంగా చట్ట ఉల్లంఘనే అవుతుంది. వారంతా సునీల్ కుమార్ మనుషులే… అంబేద్కర్ మిషన్ ఇండియా సంస్థ తో తనకు సంబంధం లేదని పీవీ సునీల్ కుమార్ చెప్పగలడా? అంటూ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. అంబేద్కర్  ఇండియా మిషన్ వ్యవస్థాపకుడినని ప్రచారం చేసుకుంటూ, సభలు సమావేశాలను నిర్వహిస్తాడని  రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. బ్రిటిష్ వారిని మెచ్చుకుంటూ  వారు పూజించుకోవడానికి చర్చి ఇచ్చారని… చదువుకోవడానికి స్కూళ్లు ఇచ్చారంటూ, మనుధర్మాన్ని, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని తిడుతూ, ఓ ప్రభుత్వ అధికారి బజారులో ఇష్టా రీతిలో మాట్లాడుతుంటే చర్యలు తీసుకోకుండా అచేతనంగా ఎందుకు ఉన్నారని ఆయన ప్రశ్నించారు.

ఇంకా అతడి పై చర్యలు తీసుకోకుండా ఎన్నాళ్ళని ఉంటారని నిలదీశారు. శిశుపాలుడు వంద తప్పులు పూర్తయినట్లుగానే, పీవీ సునీల్ కుమార్  అతడి వ్యక్తులు బరితెగించి, ఆయన కొడుకుల కంపెనీలో వ్యాపార  భాగస్వామిఉన్న వ్యక్తి కారుపై పీవీ సునీల్ కుమార్ బొమ్మ వేసుకొని, అతడు స్థాపించిన సంస్థ కు చెందిన ప్రతినిధులు ప్రభుత్వ కార్యాలయం పై దాడి చేస్తే కూడా ఇంకా కళ్ళప్పగించుకొని  చూస్తే  ప్రజలు క్షమిస్తారని తాను అనుకోవడం లేదని అన్నారు.

ఈ దాడి పై  మీడియా ప్రతినిధులు కూడా   వారి అభిప్రాయాలను వ్యక్తం చేయాలని కోరారు. నిన్నటి సంఘటనకు పీవీ సునీల్ కుమార్ అతని కుమారుల కంపెనీ లో భాగస్వామిగా వ్యవహరిస్తున్న వ్యక్తి కారులో వచ్చి ప్రభుత్వ కార్యాలయం పై దాడి చేశారు. ప్రైవేటు వాహనానికి పోలీసు స్టిక్కర్ తగిలించి, చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారు. ఇది క్షమించరాని నేరం. వెంటనే పీవీ సునీల్ కుమార్ ను సస్పెండ్ చేయాలి. ఈ సంఘటనపై విచారణ జరిపించాలని రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు.

న్యాయస్థానం దృష్టిలో అందరూ సమానులే

సాధారణ వ్యక్తులకు లేని హక్కులు దళితులకు ఏమైనా ప్రత్యేకంగా ఉంటాయా? అని ప్రశ్నించిన రఘురామకృష్ణం రాజు, న్యాయస్థానం దృష్టిలో దళితులు, వైశ్యులు, క్షత్రియులు అనే భేదం ఉండదని  పేర్కొన్నారు.. చట్టం దృష్టిలో అందరూ సమానులే కాబట్టి, ఎవరైనా తనది కాని స్థలాన్ని ఆక్రమించుకుంటే, ఎవరికైనా చట్టం ఒకటేనని… చట్ట ప్రకారం నడుచుకోవాల్సిందేనని తెలిపారు . ఒకవేళ ఇంటి స్థలం లేని నిరుపేదలు అయితే, అతడు ఆక్రమించుకున్న స్థలానికి ప్రత్యామ్నాయ ఇంటి స్థలాన్ని ఇచ్చి, ఆక్రమించిన దానిని ఖాళీ చేయించాలని చెబుతుందన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం  కులాల వారీగా  తీర్పు ఉండదని, అందులో ఎస్సీ, బీసీ వర్గాలతో పాటు అగ్రవర్ణాల వారు కూడా ఉంటారన్నారు.

అందులో ఎస్సీలు ఉన్నంత మాత్రాన  ఇది దళితులపై దాడి అని పేర్కొనడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. దళితులపై దాడులు జరిగాయంటే, ఏమి దాడులు జరిగాయో  నాకు తెలియదు అన్నారు. ఎక్కడైనా ఆక్రమణలు ఉంటే, ప్రత్యామ్నాయ ఇంటి స్థలాన్ని  ఇచ్చి వారిని అక్కడి నుంచి తరలించడం సర్వసాధారణం. అంతమాత్రాన అందులో బ్రాహ్మణులు ఉన్నారని బ్రాహ్మణులు తమపై దాడిగా, కాపులు ఉంటే కాపులు తమపై దాడిగా పేర్కొంటూ పత్రికల్లో స్టేట్మెంట్లు ఇస్తే ఇచ్చుకోవచ్చు.

ప్రజా సంక్షేమం కోసం  మంచిపని చేస్తున్నప్పుడు కొందరి జోలికి వెళితే కొంపలు మునుగుతాయని భయపడే వ్యక్తిని  నేను కాదు… ఎందుకంటే మనుషులంతా నాకు ఒక్కటే… నేను సమాజంలో ఒకరిని. సమాజానికి మంచి జరగాలి. అందులో  సునీల్ కుమార్ కు చెందిన మనిషి ఉంటే, అమ్మ బాబోయ్ ఆయన జోలికి వెళితే తాటతీస్తారని అనుకునే వ్యక్తిని నేను కాదు. ఐ డోంట్ కేర్ ఎవరైనా నాకు ఒక్కటే. నేను అందరినీ గౌరవిస్తాను… కులాలతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తిని గౌరవిస్తానని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

 ప్రజా సంక్షేమంలో భాగంగా ఒకరిపై  దాడి జరిగితే దాన్ని ఒక వర్గంపై జరిగిన దాడిగా రాజకీయ నిరాదరణకు గురైన వారు, కొత్తగా రాజకీయాలలో అడుగు పెట్టాలనుకునే పీవీ సునీల్ కుమార్ వంటి వారు  ఈ తరహా  వ్యాఖ్యలు చేస్తారని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. తెలంగాణ లోని ఒక ఐపీఎస్ అధికారి  రాజకీయాలలోకి వచ్చి రెండేళ్లలో మూడు ఎన్నికలలో  ఓటమిపాలైన వ్యక్తి, పీవీ సునీల్ కుమార్ కు తరచూ మద్దతు ఇస్తుంటాడని అన్నారు.

ఇటీవల పీవీ సునీల్ కుమార్ కూడా  ముసి ముసి నవ్వులు నవ్వుతూ , కొత్త పార్టీ పెడతానని ఏదో పెద్ద రాజకీయ నాయకుడి లాగా  బిల్డప్ ఇచ్చాడని అన్నారు. ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చునని తెలిపారు. రాజకీయ పార్టీ పెట్టినంత మాత్రాన కేసులను ఎదుర్కోక  తప్పదని హెచ్చరించారు. నేను వ్యక్తిగతంగా వేసిన అన్ని కేసులను ఎప్పటికప్పుడు నేను  పర్యవేక్షిస్తూనే ఉంటాను. వాటిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఒక వేళ ప్రభుత్వం ఉపేక్షించినా… నేనైతే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.. కస్టోడియల్ టార్చర్ కేసులో పీవీ సునీల్ కుమార్ అంతా దగ్గర ఉండి అతడే చేశాడు.

నాకు తెలిసి ఏ తప్పు చేయడం లేదు… కులం కార్డుతో బెదిరించాలనుకుంటే బెదరను

ఏదైనా ఒక కులం కార్డును అడ్డం పెట్టుకొని మమ్మల్ని ముట్టుకుంటే భూకంపం సృష్టిస్తామని గతంలోనూ ఎంతోమంది చాలెంజ్ లు చేశారని, వారి ఛాలెంజ్ లను స్వాగతించాలని గుర్తు చేశారు. నా హృదయానికి తెలిసి నేను ఏ తప్పు చేయడం లేదు. ప్రజలందరూ నా దృష్టిలో సమానులే… ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. ఉండి, భీమవరం పరిధిలో క్యాన్సర్ పేషెంట్లు అధికంగా ఉన్నారు. కలుషిత జలాలను సేవించడం వల్ల ఎక్కువమంది క్యాన్సర్ బారిన పడుతున్నారు.

మంచినీటి కెనాల్స్  లలో, డ్రైనేజీ నీరు కలుస్తోంది. బోరు వేసిన  ఆక్వా జలాలకు వల్ల భూగర్భ నీరు కలుషితమై మంచి నీరు దొరకని పరిస్థితి. కాలువ గట్లు, చెరువుగట్లు  ఆక్రమణలకు గురయ్యాయి.. చెరువులో మల,మూత్రాలు కలుస్తున్నప్పటికీ, తాగునీటి కోసం,చెరువు నీటి పైనే ఆధార పడాల్సిన  పరిస్థితి నెలకొందన్నారు. ఈ పరిస్థితి మారాలని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ప్రజల ఆరోగ్యం కాపాడడానికి ఒక ప్రజా ప్రతినిధిగా  నేను నిలబడతాను. చెరువుగట్టును ఆక్రమించిన వారు  నా కుటుంబానికి చెందిన వారైనా, మీడియా ప్రతినిధుల కుటుంబాలకు చెందిన వారైనా, ఏ కుటుంబానికి చెందిన వారైనా ప్రత్యామ్నాయ  స్థలాన్ని ఇచ్చి, కోర్టు తీర్పును అమలు చేసే దిశగా కృషి చేస్తానని తెలిపారు. నన్ను ఎన్నుకున్న ప్రజలకు కావాల్సింది చేయడం నా బాధ్యత అని తెలిపారు.

హర్ష కుమార్ నాకు  మంచి స్నేహితుడే

మాజీ ఎంపీ హర్ష కుమార్ తనకు మంచి మిత్రుడేనని, యూనివర్సిటీలో కలిసి చదువుకున్నామని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఇప్పటికీ హర్ష కుమార్ నాకు మంచి స్నేహితుడేనని, అతను నాతో డిఫర్ అయితే ఏమి చేయలేనని తెలిపారు . ఎమ్మెల్సీ ఎన్నికలలో  హర్ష కుమార్ తనయుడిని  బరిలో నిలబెట్టినట్లుగా పత్రికా ప్రతినిధులు రఘురామ కృష్ణంరాజు దృష్టికి తీసుకురాగా, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు ఎమ్మెల్సీ ఎన్నికలలో బహుశా పీవీ సునీల్ కుమార్ నిలబడతాడేమోనని తెలియదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. కులాల మధ్య చిచ్చు రాజేసి బహుశా ఎన్నికలలో లబ్ది పొందాలని భావిస్తున్నారేమోనంటూ విమర్శించారు.

కులాల మధ్య చిచ్చు పెట్టడం ఇక్కడ కుదరదు

కులాల కుంపటిని రాజేయాలన్న పీవీ సునీల్ కుమార్ ఎత్తుగడ ఇక్కడ కుదరదని, అందుకే ఈస్ట్ గోదావరి నుంచి మనుషులను తెచ్చుకుంటున్నారని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఇక్కడి వాళ్లు కూడా ఒకరు, అర మంది ఉన్నట్లు తెలిసిందని, అన్ని కులాలలోనూ మంచివారు, చెడ్డవారు ఉంటారన్నారు. అంబేద్కర్ మిషన్ ఇండియాకు చెందినవారు అరెస్టు అయినట్లు తెలిసిందని, ఎఫ్ఐఆర్ పబ్లిక్ డొమైన్ లోనే ఉంటుంది కాబట్టి వారెవరో అందరూ తెలుసుకోవచ్చునని తెలిపారు. మున్సిపల్ కార్యాలయం పై దాడికి వినియోగించిన వాహనం  పీవీ సునీల్ కుమార్ కొడుకుల కంపెనీలో వ్యాపార భాగస్వామిగా కొనసాగుతున్న జోగారావు దేనని తేలిందన్నారు.

ప్రభుత్వ పాలన భేష్… ప్రజలు హ్యాపీ… నేను కూడా హ్యాపీ

రాష్ట్ర ప్రభుత్వ పాలన బేషుగ్గా ఉందని రఘు రామ కృష్ణంరాజు ప్రశంసించారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలతోపాటు నేను కూడా హ్యాపీగా ఉన్నానని పేర్కొన్న ఆయన, ఒక్క పీవీ సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోకపోవడమే తనను అసంతృప్తికి గురి చేస్తోందని అన్నారు . అందుకే పీవీ సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని సమయం చిక్కినప్పుడల్లా కోరుతున్నానని తెలిపారు. ఎప్పుడు చర్యలు తీసుకుంటారో వేచి చూడాలన్న ఆయన, బహుశా ఇవాళ, రేపటి లోగా చర్యలు ఉండే అవకాశం ఉందన్నారు. లేకపోతే మిగిలిన ఐపీఎస్ అధికారులు  పీవీ సునీల్ కుమార్ కు ఒక రూల్?, మాకు ఒక రూలా? అని ప్రశ్నించే ప్రమాదం లేకపోలేదన్నారు. ఈ విషయాలన్నీ నేను ఉండి శాసనసభ్యుడిగా, రాష్ట్ర అసెంబ్లీ ఉప శాసనసభాపతిగా చెప్పడం లేదని, పీవీ సునీల్ కుమార్ చేత రాజద్రోహం కేసులో A1 గా ఉన్న బాధితుడిగా మాత్రమే చెబుతున్నానని స్పష్టం చేశారు.

Related posts

జర్నలిస్టులకు నిత్యావసరాలు ఇచ్చిన మర్రి రాజశేఖర్ రెడ్డి

Satyam NEWS

పోలీసు సంస్మరణ వారోత్సవాలు ప్రారంభం

Satyam NEWS

పేదల కోసం కృషి చేసిన పాపన్న

mamatha

Leave a Comment