హైదరాబాద్ లోని హైదర్ నగర్ లో ఇస్కాన్ ఆధ్వర్యంలో రాధా కృష్ణ శోభాయాత్ర ను రాష్ట్ర ఆర్ధిక మంత్రి టి హరీష్ రావు నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి నాడు రాధాకృష్ణ శోభా యాత్ర జరగడం హర్షనీయమని అన్నారు.
అందరూ భగవన్నామ స్మరణ లోఉండటం వల్ల మనశ్శాంతి లభిస్తుందని ఆయన అన్నారు. మనం ఆనందంగా,ఆరోగ్యంగా ఉండాలంటే ఆధ్యాత్మికత అవసరమని హరీష్ రావు అన్నారు. ఎంత ఎదిగినా, ఎంత సంపాదించినా ఆధ్యాత్మిక భావన లేకపోతే మానసిక ప్రశాంతత ఉండదని ఆయన అన్నారు. రూపం ఏదైనా భగవంతుడితో మానవుడికి సంబంధం కలిగి ఉండాలని అప్పుడే ప్రశాంతత ఉంటుందని హరీష్ రావు అన్నారు.
నగర జీవనంలో వేగం పెరిగింది, పని ఒత్తిడి పెరిగింది, వీటినుండి కొంత రిలీఫ్ కావాలంటే అది ఆధ్యాత్మికత వల్లే సాధ్యమౌతుందని ఆయన అన్నారు. ఇస్కాన్ సంస్థ ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ కూడా పాల్గొన్నారు.