32.7 C
Hyderabad
March 29, 2024 11: 25 AM
Slider ప్రత్యేకం

‘‘కేంద్ర ఎన్నికల సంఘ సూచనకు విరుద్ధంగా పని చేస్తున్నారు’’

#MP Raghurakakrishnamraju

‘‘వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ’’ అని వాడవద్దని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పినా వినకుండా అదే పేరును మన పార్టీకి వాడుతున్నారని, ఇది మంచిది కాదని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, నర్సాపూర్ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

తనకు షోకాజ్ నోటీసు ఇచ్చిన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి కూడా ఆయన ఇదే విషయాన్ని ఇప్పటికే చెప్పారు. తాను ఎన్నికైన పార్టీ కాకుండా వేరే పార్టీ పేరుతో తనకు లేఖ పంపారని ఆయన వెల్లడించారు. సెక్యులర్ భారత దేశంలో తాను అన్ని మతాలకు వర్గాలకు కులాలకు ప్రాతినిధ్యం వహిస్తానని అయితే ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కోటరీలోని వారు తనను క్రిస్టియన్ వ్యతిరేకిగా తనపై ముద్ర వేశారని ఆయన తెలిపారు.

తాను వేంకటేశ్వరస్వామి భక్తుడినని ఆయన తెలుపుతూ మెజారిటీ హిందువులు కూడా వై ఎస్ జగన్ కు ఓటు వేశారని ఆయన గుర్తు చేశారు. తాను పార్లమెంటు సభ్యుడిగా రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటున్నానని ఇంగ్లీష్ మీడియం విషయంలో కూడా తాను రాజ్యాంగంలోని 350, 350ఏ అధికరణలకు లోబడి మాత్రమే మాట్లాడానని రఘురామకృష్ణంరాజు వివరణ ఇచ్చారు.

ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 29 ఏ(5) లోబడి పని చేస్తున్న రాజకీయ పార్టీ అయి ఉండి తనను రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిందిగా ఎందుకు కోరుతున్నారో అర్ధం కావడం లేదని ఆయన తెలిపారు. తనను రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడాలని వత్తిడి తీసుకురావడం బాధాకరమని రఘురామకృష్ణంరాజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వివరించారు.

ఈ మొత్తం వ్యవహారాలను తాను స్వయంగా కలిసి వెల్లడిస్తానని అందుకు తనకు సమయం కేటాయించాలని రఘురామకృష్ణంరాజు కోరారు. న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ఏ రాజకీయ పార్టీ కూడా రాజ్యంగానికి, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా పని చేయడానికి అవకాశమేలేదని ఆయన అన్నారు. ఒక వేళ ఆ విధంగా ప్రవర్తిస్తే రాజ్యాంగం ప్రకారం పార్టీనే రద్దు చేయాల్సి ఉంటుందని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

నాకన్నా ముందుగా మంత్రి అదే చెప్పాడు

తాను మాత్రం పార్లమెంటులో చేసిన ప్రమాణం ప్రకారం రాజ్యాంగ సూత్రాలకు కట్టుబడి మాత్రమే పని చేస్తానని ఆయన స్పష్టం చేశారు. మిగిలిన విషయాలకు వస్తే తాను ఇసుక మాఫియా గురించి మాట్లాడినట్లు చెబుతున్నారని, తనకన్నా ముందే సంబంధిత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అదే విషయాన్ని మరింత లోతుగా బహిరంగంగా చెప్పారని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

రెండు లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక మాయమైపోయిందని మంత్రి చెప్పిన విషయాన్ని రఘురామకృష్ణంరాజు గుర్తు చేశారు. నేను బహిరంగంగా మాట్లాడినందుకు షోకాజ్ ఇచ్చినట్లు చెబుతున్నారని, తాను వేరే ఉద్దేశ్యంతో అలా మాట్లాడలేదని రఘురామకృష్ణంరాజు అన్నారు. తాను ఎన్ని మార్లు అడిగినా ముఖ్యమంత్రి తనకు అప్పాయింట్ మెంట్ ఇవ్వలేని రఘురామకృష్ణంరాజు తన లేఖలో పేర్కొన్నారు.

తన దిష్టి బొమ్మలు తగులబెట్టాల్సిందిగా తన పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కార్యకర్తలకు చెప్పడం బాధ కలిగిస్తున్నదని ఆయన అన్నారు. తన విజయంలో 90 శాతం నాయకుడి పాత్ర ఉందని, 10 శాతమే తన కృషి అనేదాంట్లో తనకు ఎలాంటి సందేహం లేదని ఆయన అన్నారు. తనకు రాయలసీమ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని, సాక్ష్యాత్తూ డీజీపీని కలిసి చెబుదామంటే ఆయన సమయం ఇవ్వలేదని రఘురామకృష్ణంరాజు తెలిపారు. అందుకే తాను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసి తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరినట్లు రఘురామకృష్ణంరాజు తెలిపారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు ఇళ్ల నిర్మాణంలో జరుగుతున్న అవకతవకల గురించి మాట్లాడిన అనంతరమే తాను ఆ విషయం ప్రస్తావించినట్లు రఘురామకృష్ణంరాజు తెలిపారు. తాను క్రమశిక్షణగల సైనికుడిలాగా తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని వివరించారు.

Related posts

అమలులోకే రాలేదు అప్పుడే ఈ గోలేంటి?

Satyam NEWS

మంజూరైన గృహాలు త్వరితగతిన పూర్తి చేయాలి

Satyam NEWS

రోడ్డు ప్ర‌మాదాల్లో నా వాళ్లంద‌రినీ కోల్పోయాను…!

Satyam NEWS

Leave a Comment