అయోధ్య లోని రామ జన్మభూమి కేసుకు సంబంధించి మధ్యవర్తిత్వం విఫలమైనందున ఈ నెల 6 నుంచి కేసు విచారణను చేపట్టాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. మధ్యవర్తిత్వం నెరపిన ప్యానెల్ సభ్యుల రిపోర్టులు పరిశీలించిన అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. రాజకీయంగా ఎంతో సున్నితమైన ఈ అంశంపై ఈ నెల 6వ తేదీ నుంచి రోజూ వారీ విచారణ జరపాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఖలీఫుల్లా, ఆధ్యాత్మిక వేత్త పండిట్ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచు లతో గతంలో సుప్రీంకోర్టు మధ్యవర్తుల ప్యానెల్ ను నియమించిన విషయం తెలిసిందే. రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం కేవలం భూమికి సంబంధించింది కాదని, వివిధ వర్గాల ప్రజల మనోభావాలు, మత విశ్వాసాలతో కూడుకున్నదని సర్వోన్నత న్యాయస్థానం అప్పటిలో వ్యాఖ్యానించింది. అయోధ్యలోని 2.7 ఎకరాలకు సంబంధించిన భూవివాదం చాలా ఏళ్లుగా కొనసాగుతున్నది. ఆ మేరకు ఏళ్లకొద్దీ సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. నిర్మోహి అఖారా, రామ్ లల్లా, సున్నీ వక్ఫ్ బోర్డు మధ్య ఈ వివాదం కొనసాగుతోంది. అయితే ఈ వివాదాన్ని మధ్యవర్తిత్వ ప్యానెల్‌కు సుప్రీంకోర్టుకు అప్పజెప్పింది. ఈ 2.7 ఎకరాలు ఎవరికి చెందుతుందో ఈ ప్యానెల్ తేల్చాలని నిర్దేశించింది. ఇక అయోధ్యలో 67.7 ఎకరాలకు సంబంధించిన భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా 1993లో స్టే విధించారు. 2010 లో 2.77 ఎకరాల భూమిని అలహాబాద్ కోర్టు ముగ్గురికి పంచింది. ఆ తీర్పుపైనే ప్రస్తుతం సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది. అలహాబాద్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ 14 విజ్ఞప్తులు సర్వోన్నత న్యాయస్థానానికి చేరాయి.