కరోనా వైరస్ పై సామాజిక మధ్యమాలలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమీషనర్ వి.సత్యనారాయణ హెచ్చరించారు.
గోదావరిఖని లో ఇద్దరికి కరోనా పాజిటివ్ అని అసత్యపు వార్త సృష్టించిన వ్యక్తి పైనా, ఆ వార్త సోషల్ మీడియా లో వైరల్ చేసిన ఐదుగురు పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. ఆంధ్రజ్యోతి లోగో వాడి కరోనా వైరస్ పై తప్పుడు బ్రేకింగ్ న్యూస్ సృష్టించి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వీరంతా వైరల్ చేశారు.
ఈ వార్త సోషల్ మీడియా లో ప్రచారం కావడంతో గోదావరిఖని ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి భయాందోళనకు గురి అయ్యారు. ఈ సంఘటన పై రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ సీరియస్ అయ్యారు. బాధ్యులను పట్టుకోవాలని గోదావరిఖని వన్ టౌన్ సీఐ పి. రమేష్ టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ విభాగం, సైబర్ క్రైమ్, ఐటి కోర్ టెక్నికల్ వారికి వారిని పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి చేరాల్ రతన్ కుమార్ అనే వ్యక్తిని ముందుగా పట్టుకున్నారు. ఆ సంబంధిత గ్రూప్ అడ్మిన్ల వివరములు సేకరించారు. తర్వాత శీలం ప్రేం కుమార్ , మారం మహేష్, సుదమల్ల రమేష్, ఎస్ కే అంకుస్ మియా, అడ్డాల యువ సేన గ్రూప్ అడ్మిన్ దుర్గం శ్రీనివాస్ లపై Sec 188,271,504,505(2)(b) IPC, Sec. 54 of Disaster management act 2005,Sec.2 of Epidemic disease act 1897 ల ప్రకారం కేసు నమోదు చేశారు.