రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరుతో పత్రికల్లో వచ్చిన లేఖ ఆయనే రాసినట్లు భావిస్తున్నామని ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ సిపి కేంద్ర కార్యాలయంలో నేటి సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు.
వివాదాస్పద అంశాలతో కూడిన ఆ లేఖను రమేష్ కుమార్ రాయకపోతే దానిని ఖండించాల్సి వుంది. కానీ ఇప్పటి వరకు దానిని ఖండించకపోవడం వల్ల ఆయనే రాసి వుంటాడని అనుకుంటున్నాం. ఈ పరిస్థితుల్లో ఆయనను ఆ పదవి నుంచి ఎలా తొలగించాలో ఆలోచిస్తాం.
ఈ లేఖ ఎక్కడ తయారైంది, ఎవరు ఇచ్చారో తేలాల్సి వుంది అని సజ్జల అన్నారు. దీనిపై పై స్థాయిలో ఏం చేయాలనేది ఆలోచిస్తున్నామని ఆయన వెల్లడించారు. సదరు లేఖ ప్రతులతో టిడిపి ఆఫీస్ వద్ద కొందరు వ్యక్తులు, నాలుగైదు చానెల్స్ హడావుడి చేశాయని, వారి చేతుల్లోనే ఈ లేఖ ప్రతులు వున్నట్లు తేలిందని ఆయన అన్నారు.
ఈ కుట్రలో వారు కూడా భాగస్వాములేని అందువల్ల ఎవరినీ వదలమని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో ఏమీ లేకపోయినా ఏదో జరుగుతోందనే భ్రమలను కల్పించారని, తనపైన ఏదో జరిగిపోతోందని రమేష్ కుమార్ క్రియేట్ చేస్తున్నారని సజ్జల అన్నారు. పార్లమెంట్ లో ప్రస్తావించాలా, కోర్ట్ తలుపులు తట్టాలా అనే అన్ని ఆప్షన్లను పరిశీలిస్తామని ఆయన తెలిపారు. ఇటువంటి వ్యక్తి రాజ్యాంగ వ్యవస్థలో వుండటానికి అనర్హుడని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మానసిక సమతూల్యత లేని వ్యక్తి రమేష్ కుమార్ అని ఆయన వ్యాఖ్యానించారు. సంధిప్రేలాపనలతో, మతిస్థిమితం లేని వారు చేసినట్లుగా ఆ ఆరోపణలు వున్నాయని ఆయన అన్నారు.