ఒడిశాలోని నయాగడ్ జిల్లా అటవీ ప్రాంతంలో ఓ అరుదైన నల్ల చిరుతను గుర్తించినట్లు అటవీ అధికారులు చెప్పారు. ఒక నల్లని చిరుతపులి తనకు పుట్టిన చిరుత కూనను నోట కరుచుకుని అటవీ ప్రాంతంలో సంచరిస్తూ అటవీ శాఖ అధికారుల ట్రాప్ కెమెరాలకు చిక్కింది. అడవిలో సంచరిస్తున్న జంతువుల జాతుల వివరాలు, వాటి సంతతి, ఆరోగ్య పరిస్థితులు, జంతువుల బాగోగులను చూసేందుకు అధికారులు అడవిలో పలు చోట్ల సీక్రెట్ గా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. అలా ఏర్పాటు చేసిన కెమెరాలను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటారు.
అలా ఎప్పటిలాగే కెమెరాలు పరిశీలిస్తుండగా ఒక నల్ల చిరుత కెమెరాలో కనిపించింది. దీంతో ఆ నల్ల చిరుత పై ప్రత్యేక దృష్టి సారించి ఆరా తీయడం మొదలుపెట్టారు అధికారులు. దీంతో నల్ల చిరుత గురించి పలు విషయాలు వెలుగు లోకి వచ్చాయి. సాధారణ చిరుతపులి మెలనిజం అనే జన్యు లోపం కారణంగా నల్లగా మారిందని, ఇది ప్రత్యేకమైన జాతి కాదని అటవీ శాఖ అధికారులు తేల్చారు. ఈ జన్యులోపంతో ఉన్న జంతువులు ఒడిశాలోని మూడు అటవీ డివిజన్లలో ఉన్నాయని నిర్ధారించారు.
ఇవి జన్యులోపంతో ఉన్నప్పటికీ వీటికి పుట్టే పులికూనలు మాత్రం సాధారణంగానే ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం ఈ చిరుత పులి.. తనకు పుట్టిన ఈ కూనను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి మార్చే సమయంలో ట్రాప్ కెమెరాలకు చిక్కిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు.