శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఊపందుకుంటున్నది. రాయలసీమ హక్కుల కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వాలు స్పందించకపోవడం శోచనీయమని రాయలసీమ నాయకులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ లో మాజీ మంత్రి మైసూరా రెడ్డి ఇంట్లో గ్రేటర్ రాయలసీమ నేతలు సమావేశం అయ్యారు.
ఈ సమావేశానికి మాజీ కేంద్రమంత్రి కోట్ల, మాజీ ఎంపీ గంగుల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శివరామ కృష్ణారావు, ఏపీ మాజీ డిజిపి దినేష్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. శాసన మండలిలో బిల్లు పాస్ కాకపోతే గ్రేటర్ రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాజధాని ఏర్పాటు చేయలేకపోతే రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గ్రేటర్ ( నెల్లూరు,ప్రకాశం జిల్లాలతో కలిపి) రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చేస్తేగానీ మా ప్రాంతానికి న్యాయం జరగదని వారు అంటున్నారు. రాజధాని ఏర్పాటు చేయాల్సిన రాయలసీమకు కేవలం హై కోర్టు ఇచ్చి సరిపెట్టుకుంటే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఎన్నో దశాబ్దాలుగా రాయలసీమ వెనుకబాటుతనానికి గురి అవుతూనే ఉందని తమ డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో చూసి త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని వారు అంటున్నారు.