అవినీతి అంశం చర్చనీయాంశమైన ఈ సందర్భంలో దాన్ని కేవలం బోధనలతో నిర్మూలించలేమని పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ కు సూచిస్తూ గుంటూరు మాజీ మేయర్ రాయపాటి మోహన్ సాయి కృష్ణ బహిరంగ లేఖ రాశారు. లేఖలోని ముఖ్యాంశాలు
వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గార్కి, మీరు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే అవినీతి నిర్మూలన ప్రధాన లక్ష్యంగా పని చేస్తానని ప్రకటించడం హర్షణీయం. అవినీతి నిర్మూలన అనేది నా హృదయానికి హత్తుకునే అంశం. పాశ్చాత్య దేశాలలో మాదిరి మనం అభివృద్ధి చెందకపోవడానికి, మన వెనుకబాటుతనానికి కారణం మన సమాజం అవినీతిలో మునగడమే. అవినీతి నిర్మూలన జరిగితే మన దేశంలోని 90 శాతం సమస్యలు వాటంతటవే తీరిపోతాయి. ఆదిశగా విజయం సాధించడానికి నేను గమనించిన ఎనిమిది అంశాలను మీ ముందు ఉంచుతున్నాను.
1. అన్ని చట్టాలను, నిబంధనలను ప్రక్షాళన చేయాలి… పన్నులు, జరిమానాలు హేతు బద్ధంగా విధించాలి. ఆచరణీయ విధానాలు రూపొందించాలి. – ప్రభుత్వచట్టాలు, నియమ నిబంధనలు, విధానాలు, పన్నులు, జరిమానాలు, టెండర్లు, ప్రభుత్వ సేవలు, పారిశ్రామిక/ వ్యాపారాల లైసెన్సులు/ అనుమతులు, ప్రభుత్వ భూముల అమ్మకం/ లీజులు, గనుల లీజులు, ఇసుక, సంక్షేమ పథకాలకు అర్హతలు, లబ్ధిదారుల ఎంపిక మొదలైనవన్నీ ప్రక్షాళన చేయాలి. రాజకీయ నాయకులు, అధికారులు నిజాయితీగా, హేతుబద్ధంగా నిర్ణయాలు తీసుకునే విధంగా ఉండాలి. ఏకపక్షంగా, విచక్షణా పూరితంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండకూడదు.
2. జనాభా ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలు చేపట్టాలి…ఉద్యోగులపై పనిభారం తగ్గించాలి -పెరుగుతున్న జనాభాకనుగుణంగా ప్రభుత్వ ఆదాయ వసూళ్ళకి, వ్యయ పర్య వేక్షణకు, సేవలు అందించటానికి సరిపడా సిబ్బంది లేకపోవడం కూడా అవినీతి పెరగడానికి కారణమవుతోంది. పోలీస్,రెవెన్యూ, పట్టణ ప్రణాళిక, పంచాయతీరాజ్, మున్సిపాలిటీలు తదితర వ్యవస్థల్లో దశాబ్దాల క్రితం ఎంతమంది సిబ్బంది ఉన్నారో, నేటికీ అంతేమంది పనిచేస్తుండటం ఆయావ్యవస్ధల లక్ష్యాలను నిర్వీర్యంచేస్తోంది. జనాభాకి తగ్గట్టుగా సిబ్బంది నియామకాలు జరిగినట్లయితే ప్రజలకు నాణ్యమైన, వేగవంతమైన సేవలు నిజాయితీగా అందడానికి అవకాశముంటుంది.
3. ఉద్యోగుల బదిలీలలో పారదర్శకత ఉండాలి…పైరవీలకు చెక్ పెట్టాలి -ఉద్యోగుల బదిలీలలో ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మక్కవ్వడం వల్ల అవినీతికి బీజం ఇక్కడే పడుతోంది. లంచం ఇచ్చి తనకు నచ్చిన స్థానానికి బదిలీ చేయించుకొనే అధికారి ఆ మొత్తాన్ని రాబట్టందే ఉండలేడు. ఇంజనీరింగ్ విద్యాలయాలలో ఎంసెట్ కౌన్సిలింగ్ ఏ విధంగా వుందో, ఆ తరహా కౌన్సిలింగ్ విధానాన్ని అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగుల బదిలీలలో కూడా అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. సచివాలయ కార్యదర్శులు, డిపార్ట్మెంట్ హెడ్ స్థాయి ఉద్యోగాలలో మీకు నచ్చిన వారిని నియమించుకున్నా ఫర్వాలేదు కానీ, మిగతా అందరి ఉద్యోగుల బదిలీలలో మాత్రం తప్పనిసరిగా సిఫార్సులకు అవకాశం లేకుండా చూడాలి.
4. ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్యోగులకు సదుపాయాలు కల్పించాలి. ప్రోటోకాల్, చిల్లర ఖర్చులకు బడ్జెట్ కేటాయింపులు చేయాలి -నేటికీ ప్రభుత్వ కార్యాలయాల్లో సరైన సదుపాయాలు ఉద్యోగులకు ఉండటం లేదు. చిల్లర ఖర్చులకు కూడా వ్యయాన్ని కేటాయించకపోవడం లంచగొండితనానికి దారితీస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో స్టేషనరీ ఖర్చులకు, రవాణా, భోజన వసతి సదుపాయాలకు, ఇతర చిల్లర ఖర్చులకు బడ్జెట్లో సరిపడినంత కేటాయింపులు ఉండకపోవడంతో పనుల కోసం ప్రజలపై ఇండెంట్లు వేస్తున్నారు. పోలీస్, రెవెన్యూ తదితర శాఖల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. వి.ఐ.పి.ల సందర్శనకు అవుతున్న మొత్తం వ్యయాన్ని లెక్కల్లో చూపాలి. సదరు బిల్లులను కూడా తాత్సారం చేయకుండా వేగంగా చెల్లించాలి.
5. పౌర సేవలను వేగవంతంగా అందించాలి…ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి -ప్రభుత్వ సేవలు పొందాలంటే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగి తిరిగి విసిగివేసారి,కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలు చేసుకున్నసందర్భాలున్నాయి. ప్రజలకు వేగవంతమైన సేవలు అందాలంటే సిటిజెన్ చార్టర్ , ఫిర్యాదువిభాగం, ఫైల్ ట్రాకింగ్ వ్యవస్థలను సమర్ధవంతంగా అమలుచేయాల్సిన అవసరం ఉంది. నిర్ణీత సమయానికి సేవలు అందకపోయినా, సమస్య పరిష్కారం కాకపోయినా, సంబంధిత అధికారిని బాధ్యుణ్ణి చేసి జరిమానా విధించాలి.
6. కాంట్రాక్ట్ పనుల్లో నామినేషన్ పద్ధతిని నిషేధించాలి. టెండర్ అనంతర ప్రక్రియ మొత్తం ఆన్లైన్లో జరగాలి – టెండర్లలో ఎక్కువ మంది కాంట్రాక్టర్లు పాల్గొనేలా పోటీ వాతావరణాన్ని కల్పించాలి. అలాగే చేసిన పనులను ఎం.బుక్లలో నమోదుని, బిల్లుల చెల్లింపులను ఇప్పటి వరకు కాగిత రూపంలోనే నిర్వహిస్తూ వస్తున్నారు. దీంతో కాంట్రాక్టర్లు నిజాయితీగా పనులు పూర్తి చేసినప్పటికీ పనుల నమోదుకు, బిల్లులచెల్లింపుకు అధికారులు, రాజకీయనాయకుల చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సిన పరిస్థితి. ఈ అవినీతికి అడ్డుకట్టవేయాలంటే టెండర్ అనంతరం పనులను ఎం.బుక్ లలో నమోదు నుంచి బిల్లుల చెల్లింపు వరకు మొత్తం ప్రక్రియ ఆన్లైన్ ద్వారా మాత్రమే జరగాలి. ఫైల్ ట్రాకింగ్ విధానాన్నిఅమలు జరిపి పూర్తయిన పనిని నిర్ధిష్ట కాలవ్యవధిలో నమోదు చేయాలి. సకాలంలో బిల్లులు చెల్లించాలి. థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ను ప్రఖ్యాత స్వతంత్ర సంస్ధలకు అప్పగించాలి.
7. చట్టబద్ధ సంస్ధలు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, నిజాయితీగా, స్వతంత్రంగా వ్యవహరించే వారిని నియమించాలి -ఆర్.టి.ఐ, లోకాయుక్త, అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్, ఎన్నికల సంఘం వంటి చట్టబద్ధ సంస్ధలు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఏ ప్రభుత్వాన్నైనా నిలదీసి, ప్రజల పక్షాన నిలబడాలే తప్ప, ప్రభుత్వాలకు కొమ్ము కాసే విధంగా ఉండకూడదు. అవినీతి రహిత సమాజం రావాలని కోరుకుంటున్న మీరు, మీ లక్ష్యాన్ని ఆచరణలో పెట్టగలిగే వారిని, తగిన పరిజ్ఞానం ఉండి, నిజాయితీగా, స్వతంత్రంగా వ్యవహరించే వారిని మాత్రమే ఆయా సంస్థల్లో నియమించాలి.
8. ఒక నిర్ధిష్ట తేదీ నుంచి అవినీతి అంతానికి నాంది పలకాలి…ఒక కొత్త సంస్కృతికి బీజం పడాలి -దశాబ్దాలుగా అవినీతి అనేది సమాజంలోని అన్ని వ్యవస్ధలలో నరనరాన జీర్ణించుకుపోయింది. సమాజంలో 5- 10 శాతం మంది ప్రజలు మాత్రమే నీతిమంతులుగా ఉన్నారు. అందరూ అవినీతికి పాల్పడుతున్నారు కదా మనం కూడా పాల్పడితే తప్పేంటి అనుకొనే వారు 50 నుంచి 60 శాతం మంది ఉన్నారు. ఎట్టి పరిస్థితులలోనైనా అవినీతికి పాల్పడే వారు 30 నుంచి 40 శాతం మంది ఉన్నారు. లంచం ఇవ్వనిదే ఏ పనీ చెయ్యం అనే భావనలో ఉద్యోగులు, లంచం ఇవ్వనిదే ఏ పనీ అవ్వదనే అభిప్రాయంలో ప్రజలు కూరుకుపోయారు.
9. అవినీతికి మూల బిందువులు – ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు – ఉద్యోగులు: ప్రభుత్వ ఉద్యోగం కోరుకునేవారు సేవాగుణమైనా కలిగి ఉండాలి లేదా కష్టనష్టాలకు ఓర్చి వ్యాపారం చేయలేని మనస్తత్వం కలవారైనా అయి ఉండాలి. ఆస్తులు, నగలు, సంపద, విలాసాలపై ఆశ ఉన్న వారు ప్రభుత్వ ఉద్యోగాలలో చేరకూడదు. ప్రభుత్వ ఉద్యోగాన్ని మధ్య తరగతి జీవితంతో తృప్తిపడేవారు, ఉద్యోగ భద్రత కోరుకునే వారు మాత్రమే ఎంచుకోవాలి. ప్రజా ప్రతినిధులు : పంచాయతి వార్డు సభ్యుల నుంచి ఎమ్మెల్యే, ఎంపీల దాకా అందరూ రాజ్యాంగం ప్రకారం విధులు నిర్వహించడానికి 5 నుంచి 10 శాతం సమయాన్ని మాత్రమే కేటాయిస్తున్నారు. మిగతా 90 శాతం సమయాన్ని రాజకీయ కార్యకలాపాల్లో, ప్రజల వ్యక్తిగత పనులు, ఉద్యోగుల బదిలీలు, పైరవీలు, కాంట్రాక్టులు, ప్రైవేట్ పంచాయతీలు మొదలైనవి చేయడంలో నిమగ్నమవుతున్నారు. ప్రతి పనికి ప్రజలు తమ వద్దకు రావాలనే ఆలోచనను వదులుకోవాలి. ప్రజా ప్రతినిధులు అన్ని వ్యవస్థలను వారి ప్రమేయం లేకుండా వాటికవే స్వతంత్రంగా వ్యవహరించే విధంగా, ప్రజలకు సేవలందించే విధంగా చూడాలి. ప్రజా ప్రతినిధులు అనధికారికంగా చెలాయిస్తున్న అధికారాన్ని తగ్గించుకోవాలి. రాజకీయనాయకులలో నిజాయితీగా ఉన్నవారు గాని, కొత్తగా నీతివంతులు రాజకీయాలలో రావాలుకున్నా ఎన్నికల్లో ఖర్చుకు, ఇంకా అందరికి తెలియని ఎన్నికల లేని సమయంలోని నిర్వహణ వ్యయం చూసి భయపడే పరిస్ధితి నెలకొని ఉంది. ఒక దఫా ఎన్నికయ్యాక ప్రజాప్రతినిధులు అవినీతికి పాల్పడి సంపాదించుకోకపోతే, తదుపరి ఎన్నికలప్పుడు కోట్లు వ్యయం చేయడానికి ఆసక్తి చూపరు. ప్రజలు: అవినీతిలో ప్రజల ప్రమేయాన్ని తీసివేయలేం. నియమ నిబంధనలను ,చట్టాలను అతిక్రమించి మన పని మనం చేసుకుపోదాం అనే తత్వం ప్రజల్లో బాగా నాటుకుపోయింది. పనులకోసం తామంతటతామే రాజకీయనాయకులను ఆశ్రయిస్తున్నారు. ఎదుటివాడు ఏమైతే ఏంటి మన పనులు తొందరగా, లాభసాటిగా చేసుకుపోదాం అనే మనస్తత్వం ప్రజల్లో ప్రబలింది. పన్నుల చెల్లింపు, చట్టాలను, నియమ నిబంధనలను పాటించడం వంటి విషయాలలో నీతిగా వ్యవహరించడం అలవరుచుకోవాలి. రోజూ మీరు ఒక ముఖ్యమంత్రిగా అవినీతి నిర్మూలన జరగాలని ప్రభోదిస్తున్నంత మాత్రాన అవినీతి తగ్గదు. ఏ అధికారి, ప్రజాప్రతినిధి, ప్రజలు మారరు. ఎక్కువమంది అవినీతికి పాల్పడుతుండటం వల్ల అవినీతికి పాల్పడకపోతే తాము వెనకబడే పరిస్థితి ఉందని మిగతావాళ్ళు నమ్ముతున్నారు. ఒక నిర్దిష్ట తేదీ నుంచి ప్రారంభించినట్లయితే ఈ కార్యక్రమంలో ఎక్కువమంది పాల్గొనే అవకాశం ఉంటుంది. 5-10 శాతం ఉన్ననిజాయితీపరులు ఎటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పక్కవాడు అవినీతి చేస్తున్నాడు మనం చేస్తే ఏంటి అనే భావం ఉన్న50-60 శాతం అవినీతి పరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గనే అవకాశం ఏర్పడుతుంది. ఈ విధంగా 60-70 శాతం ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వోద్యోగులు నీతిగా ఉండాలని నిశ్చయించుకుని, ప్రవర్తనను మార్చుకుంటేనే అవినీతి తగ్గి నీతివంతమైన సమాజ స్థాపన జరుగుతుంది. మీ సారధ్యంలో అవినీతి అంతమవుతుందని ఆశిస్తున్నాను.
ఇట్లు,
భవదీయుడు,
రాయపాటి మోహన్‌సాయిక్రిష్ణ,
మాజీ మేయర్,
గుంటూరు నగర పాలక సంస్థ.