గోదావరి నదిలో దేవీపట్నం వద్ద మునిగిపోయిన బోటు ఉన్న ప్రదేశాన్ని ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది గుర్తించింది. అత్యాధునిక స్కానర్లతో గాలింపు చేపట్టగా స్కానింగ్‌లో బోటు ఆనవాళ్లు కనిపించాయి. అయితే బోటుని ఎలా వెలికితీయాలనే దానిపై స్పష్టత లేదు. బోటు 300 అడుగుల లోతులో ఉండటం సమస్యగా మారింది. ప్రమాదానికి గురైన రాయల్ వశిష్ట టూరిస్ట్ బోటు 25 టన్నుల బరువు ఉంది. బోటు ప్రమాదానికి గురైన ప్రాంతం ప్రమాదకర ప్రాంతం. వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. సుడి గుండాలు అధికంగా ఉన్నాయి. దీంతో వాటన్నింటిని అధిగమించి బోటుని బయటికి తీసుకురావడం ఎలా అని చర్చలు జరుపుతున్నారు. రాయల్ వశిష్ట టూరిస్టు బోటు ప్రమాదంలో మరణించిన వారి డెడ్‌బాడీలు ఒక్కొక్కటికగా బయటపడుతున్నాయి. 3 రోజులపాటు సాగిన గాలింపు చర్యల్లో 28 మృతదేహాలు లభ్యం కాగా బుధవారం మరో 6 మృతదేహాలు దొరికాయి. దీంతో ఇప్పటివరకు లభ్యమైన మృతదేహాల సంఖ్య 34కు చేరింది. బోటు ప్రమాదానికి గురైన కచ్చులూరు దగ్గర ఇవాళ మృతదేహాలను గుర్తించారు. ఇందులో రెండు మృతదేహాలను దేవీపట్నం తరలించగా.. మరో నాలుగు మృతదేహాలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత దేవీపట్నం నుంచి రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి మృతదేహాలను తరలించనున్నారు. మృతదేహాలన్నీ నాలుగు రోజులపాటు నీటిలోనే ఉండిపోవడంతో ఉబ్బిపోయాయి. చర్మం కూడా ఊడిపోతోంది. దీంతో గుర్తించడం కష్టతరమవుతోంది.