రాజధాని అంశంతో సహా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై అధ్యయనం చేసిన జీఎన్‌రావు కమిటీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి నేడు నివేదిక అందచేసింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి జీఎన్ రావు నేతృత్వంలోని కమిటీ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంతో సమావేశమై నివేదికను అందించింది.
ఈ కమిటీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించింది. రాజధానిపై జరిపిన అధ్యయనంపై ఇప్పటికే ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక అందజేయగా తాజాగా తుది నివేదికను సమర్పించింది. విశాఖ, కర్నూలు, అమరావతితో పాటు ఇతర ప్రాంతాల్లో పరిస్థితిని పరిశీలించిన కమిటీ ఏ ప్రాంతంలో ఏది అనువుగా ఉంటుందనే కోణంలో అధ్యయనం చేసింది. వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన సుమారు 40వేల వినతులను పరిశీలించింది.