28.7 C
Hyderabad
April 20, 2024 04: 52 AM
Slider తెలంగాణ

ఫస్ట్ పెరేడ్: పల్లె ప్రగతి స్ఫూర్తితో మరింత ముందుకు

ts republic

భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్ జాతీయ పతాకావిష్కరణ చేసి పెరేడ్ వందనాన్ని స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలకు సందేహం అందించారు. గవర్నర్ సందేశం సంక్షిప్తంగా: రాష్ట్ర గవర్నర్ గా తొలిసారి గణతంత్ర దినోత్సవంలో పాల్గొనడం నాకు జీవితాంతం గుర్తుండే గొప్ప అనుభూతి.

ప్రేమాభిమానాలకు మారుపేరైన తెలంగాణ ప్రజలతో, ప్రగతికాముక తెలంగాణ రాష్ట్రంలో ఈ అపూర్వ సందర్భాన్ని గడపడం నా ఆనందాన్ని రెట్టింపు చేసింది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ, దార్శనిక ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అసంఖ్యాక సవాళ్లను అధిగమించింది. సమైక్య రాష్ట్రంలో జరిగిన జీవన విధ్వంసం సృష్టించిన అగాధం నుంచి తెలంగాణ వేగంగా కోలుకుంటున్నది.

అతి స్వల్ప వ్యవధిలోనే అనేక రంగాల్లో అద్భుత విజయాలు సాధించి, నేడు దేశానికే తెలంగాణ రాష్ట్రం ఒక ఆదర్శంగా నిలిచింది. అనుకున్న లక్ష్యాలను సాధించే క్రమంలో గడిచిన ఆరేళ్లలో బలమైన పునాదులు నిర్మించుకున్నది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎంతో సానుకూల దృక్పథంతో, రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్నది.

తెలంగాణ రాష్ట్రం తనకు తానుగా పరివర్తన(transition) చెందుతూనే, ప్రజాస్వామ్య-గణతంత్ర భారతదేశంలో గుణాత్మక మార్పులకు మార్గదర్శకంగా(pioneer/trail blazer) నిలుస్తున్నది. సరికొత్త సంస్కరణలతో పాలనా రంగంలో కొత్త పుంతలు తొక్కుతున్నది. ‘స్వరాష్ట్రంలో సుపరిపాలన’ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక పాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వం మొదట కొత్త పరిపాలనా విభాగాలను ఏర్పాటు చేసింది.

కొత్తగా 23 జిల్లాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా 33 జిల్లాల తెలంగాణ చేసుకున్నాం. రెవెన్యూ డివిజన్ల సంఖ్యను 43 నుంచి 69కి పెంచుకున్నాం. 459 మండలాలను 584 మండలాలుగా చేసుకున్నాం. గతంలో 68 మున్సిపాలిటీలుంటే, నేడు రాష్ట్రంలో 142 మున్సిపాలిటీలున్నాయి. కొత్తగా ఏడు మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా కార్పొరేషన్ల సంఖ్య 13కు పెంచుకున్నాం.

గిరిజన తండాలు, ఆదివాసీ గూడాలు, మారుమూల పల్లెలను పత్యేక గ్రామ పంచాయతీలుగా గుర్తించడం జరిగింది. దీంతో తెలంగాణలో గ్రామ పంచాయతీల సంఖ్య 8,690 నుంచి 12,751కి చేరింది. పరిపాలనా విభాగాలు చిన్నవి కావడం వల్ల ప్రజలకు పాలన మరింత చేరువైంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడం సాధ్యమవుతున్నది. పాలనా సంస్కరణల ప్రక్రియ రెండో దశలో ప్రభుత్వం కొత్త చట్టాలను అమలు చేస్తున్నది.

ప్రగతికి ప్రధాన అడ్డంకులైన అవినీతిని, జాప్యాన్ని తరమికొట్టాలి.  పల్లెలు, పట్టణాల రూపురేఖలు మారాలి. ప్రజల విస్తృత భాగస్వామ్యంతోనే అన్ని నిర్ణయాలు జరగాలి. ప్రతీ పైసా సద్వినియోగం కావాలి. పల్లెలు, పట్టణాలు పచ్చని చెట్లతో కళకళలాడాలి. ప్రతీ చోటా పరిశుభ్రత వెల్లివిరియాలి.

అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు ఇలా ప్రతీ ఒక్కరూ ఎవరి బాధ్యతలు వారు గుర్తెరగాలి. విధుల పట్ల ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించే పరిస్థితి ఉండొద్దు. ఈ సంస్కరణలు అమలు కావాలంటే గతంలో ఉన్న చట్టాలు ఏమాత్రం సరిపోయేవి కావు. అందుకే ప్రభుత్వం కొత్త చట్టాలను తెచ్చింది. తెలంగాణ పల్లెలను దేశంలోకెల్లా ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు పోతున్నది.

ప్రజల భాగస్వామ్యంతో పల్లెలను బాగు చేసుకునే ఒరవడి అలవాటు కావడం కోసం ఇప్పటికే రెండు విడతలుగా ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం అమలయింది. ఏ ఊరి ప్రజలే ఆ ఊరికి కథా నాయకులు కావాలని ప్రభుత్వం ఇచ్చిన పిలుపును ప్రజలు అందుకున్నారు. చేయి చేయి కలిపి శ్రమదానం చేసి, సమిష్టి కృషితో ఎవరి గ్రామాన్ని వారు అద్దంలా తీర్చిదిద్దుకున్నారు. రోడ్లు, డ్రైనేజీలు శుభ్రం చేసుకున్నారు. ముళ్ల కంచెలను, మురికి గుంటలను, పాత ఇండ్ల శిథిలాలను తొలగించుకున్నారు.

స్మశాన వాటికల నిర్మాణానికి, డంపు యార్డుల ఏర్పాటుకు స్థలాలను ఎంపిక చేసుకున్నారు. గ్రామాల్లో పవర్ వీక్ నిర్వహించుకుని, వంగిన కరెంటు పోళ్లను, వేలాడే కరెంటు వైర్లను సరిచేసుకున్నారు. అవసరాలు-వనరుల ప్రాతిపదికగా వార్షిక, పంచవర్ష ప్రణాళికలు తయారు చేసుకున్నారు. దాని ప్రకారమే నిధులు ఖర్చు పెట్టే సంప్రదాయం ప్రారంభమయింది. ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం అమలుకు ముందు, తర్వాత గ్రామాల్లో ఎంతో మార్పు కనిపిస్తున్నది.

మన ఊరిని మనమే బాగు చేసుకోవాలనే చైతన్యం పొందింనందుకు తెలంగాణ ప్రజలను మనసారా అభినందిస్తున్నాను. మున్సిపల్ ఎన్నికలు కూడా ముగిశాయి. కొత్తగా ఎన్నికయిన ప్రజాప్రతినిధులు తమ పట్టణాలను గొప్పగా తీర్చిదిద్దుకునే బాధ్యతను నెరవేర్చాలి. ప్రభుత్వం అందించే సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటికే పల్లెల ప్రగతికి ప్రతీ నెలా 339 కోట్ల రూపాయలను క్రమం తప్పకుండా అందచేస్తున్నది.

ఇప్పటి నుంచి పట్టణాలకు కూడా ప్రతీ నెలా నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ప్రభుత్వం అందించే నిధులను సద్వినియోగం చేసుకుని పల్లెలను, పట్టణాలను ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దుకునే బాధ్యతను ప్రజాప్రతినిధులు, ప్రజలు తమ భుజానికెత్తుకోవాలి. భూ సంబంధ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే సమగ్ర భూరికార్డుల ప్రక్షాళన చేపట్టింది. దాదాపు 96 శాతం వరకు భూ యామజాన్య హక్కులపై స్పష్టత వచ్చింది.

కోర్టు కేసులు, ఇతర వివాదాల్లో ఉన్న భూముల అంశాలను కూడా త్వరలోనే పరిష్కరించడానికి ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించబోతున్నది. సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచింది. ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, ఆరు కిలోల బియ్యం, కేసీఆర్ కిట్స్ లాంటి ప్రజాసంక్షేమ కార్యక్రమాలు పేదలకు కనీస జీవన భద్రతను కల్పిస్తున్నాయి, వారి ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నాయి. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేని విధంగా అనేక పథకాలు అమలు చేస్తున్నది.

ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న వ్యవసాయ విధానం, రైతుహిత పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. వ్యవసాయరంగంలో ప్రగతి సాధించడం కోసం ప్రపంచ వ్యాప్తంగా అమలవుతున్న గొప్ప కార్యక్రమాలతో ఐక్యరాజ్యసమితి రూపొందించిన జాబితాలో మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా పథకాలకు చోటు దక్కింది. ఇది మన రాష్ట్రానికి, రైతాంగానికి గర్వకారణం.

రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్న రైతుబంధు ద్వారా అందించే సహాయాన్ని ఎకారానికి ఏడాదికి 8 వేల నుంచి 10 వేల రూపాయలకు పెంచి ప్రభుత్వం అందిస్తున్నది. తెలంగాణను కోటి ఎకరాల మాగాణగా మార్చే బృహత్తర లక్ష్యంతో, ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతాంశంగా చేపట్టిన భారీ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా సాగుతున్నది.

యావత్ ప్రపంచమే అబ్బురపడే ఇంజనీరింగ్ అద్భుతంతో, అతి తక్కువ సమయంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గత ఏడాది నుంచే నీటిని ఎత్తిపోయడం ప్రారంభమయింది. ఈ ఏడాది నుంచి ప్రతీ రోజు రెండు టిఎంసిల చొప్పున, వచ్చే ఏడాది నుంచి ప్రతీ రోజు మూడు టిఎంసిల చొప్పున నీటిని ఎత్తి పోసి, తెలంగాణ భూములను సస్యశ్యామలం చేసే ప్రణాళిక అత్యంత వేగంగా అమలవుతున్నదనే సంతోషకరమైన విషయాన్ని మీతో పంచుకుంటున్నాను.

కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, దేవాదుల, సీతారామ ఎత్తిపోతల పథకాల పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. రాబోయే కొద్దికాలంలోనే ఈ పథకాల ప్రయోజనాలు రైతులకు వందకు వందశాతం అందుతాయి. తెలంగాణ రాష్ట్రం, గోదావరి జలాల తరలింపు విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కలిసి ముందుకు పోవడానికి సిద్ధపడింది. గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు తరలించడం ద్వారా వలస బాధిత పాలమూరు జిల్లాకు, ఫ్లోరైడ్ పీడిత నల్గొండ జిల్లాకు, కరువు తాండవించే రంగారెడ్డి జిల్లాల ప్రజల తాగునీరు, సాగునీరు సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది.

ప్రతి ఇంటికీ ప్రతిరోజూ సురక్షిత మంచినీరు అందించాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతున్నది. ఇప్పటికే సింహభాగం పనులు పూర్తయ్యాయి. కొద్దిరోజుల్లోనే మిషన్ భగీరథ వందకు వందశాతం పూర్తవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ఎదురైన తీవ్రమైన విద్యుత్ సంక్షోభాన్ని ప్రభుత్వం అత్యంత చాకచక్యంగా, వ్యూహాత్మకంగా పరిష్కరించింది. అన్నిరంగాలకు 24 గంటల పాటు నిరంతరాయ నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతున్నది.

దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేసుకోవడం మనం సాధించిన ఘనత. సమాజంలో అట్టడుగు వర్గాల పిల్లలకు అత్యుత్తమ విద్యను అందించడం ద్వారానే వారికి బంగారు భవిష్యత్ అందించవచ్చని ప్రభుత్వం బలంగా విశ్వసించింది. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, మహత్మా జ్యోతిరావు పూలే లాంటి మహనీయుల స్పూర్తితో, రాష్ట్రంలో 959 గురుకుల విద్యాలయాలను ప్రభుత్వం అత్యున్నత ప్రమాణాలతో నడుపుతున్నది.

పేదల ఆరోగ్య పరిరక్షణ కోసం సర్కారు దవాఖానాల్లో ప్రభుత్వం సౌకర్యాలను పెంచింది. ప్రజలకు సర్కారు దవాఖాన్లపై నమ్మకం పెరిగింది. కేసీఆర్ కిట్స్ తో పాటు అందిస్తున్న నగదు ప్రోత్సాహం వల్ల పేదలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సుఖ ప్రసవాలు పొందుతున్నారు. కేసీఆర్ కిట్స్ పథకం వల్ల రాష్ట్రంలో మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గడం ఎంతో సంతోషకరమైన విషయం.

దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ‘కంటి వెలుగు’ కార్యక్రమం నిర్వహించుకున్నాం. రాష్ట్రంలో పచ్చదనాన్ని33 శాతానికి పెంచి, పర్యావరణాన్ని కాపాడాలనే సామాజిక బాధ్యతతో ప్రభుత్వం చేపట్టిన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమం విజయవంతంగా ముందుకుపోతున్నది.

టీఎస్ ఐపాస్ చట్టం ద్వారా వచ్చిన సంస్కరణల వల్ల తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు వెల్లువలా ప్రారంభమవుతున్నాయి. పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఐటీ రంగంలో ఎగుమతులు గడిచిన ఆరేళ్లలో రెట్టింపయ్యాయి. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో సాధిస్తున్న ప్రగతి తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకు దోహదపడుతున్నది.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా తెలంగాణ పోలీసులు నేరాలను  అదుపు చేయడంలోనూ, నేర విచారణలోనూ మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రణాళికలతో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ప్రపంచంలోని 130 అతిపెద్ద నగరాల్లో అధ్యయనం చేసిన ప్రపంచ ప్రఖ్యాత జెఎల్ఎల్ సంస్థ, 20 అగ్రశ్రేణి (top 20) నగరాల జాబితాను ఇటీవల ప్రకటించింది.  అందులో మన హైదరాబాద్ నగరం ప్రథమ స్థానంలో నిలవడం మనందరికీ గర్వకారణం. నీతివంతమైన, నిఖార్సైన పాలనను ప్రజలకు అందించడం కోసం ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధిని, అవసరమైన చోట కఠిన వైఖరిని ప్రదర్శిస్తున్నది. ప్రభుత్వ వైఖరిని, పనితీరును ప్రజలు ఎప్పటికప్పుడు సమర్థిస్తూ, తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. ప్రజల అచంచల విశ్వాసం, ఆత్మీయ ఆశీర్వాదమే ఊపిరిగా ప్రభుత్వం మరింత తెగువతో ముందుకుపోతుంది.

Related posts

చంద్రబాబు ఆరోగ్యంపై భువనేశ్వరి ఆందోళన

Satyam NEWS

మైనారిటీలను అణగతొక్కుతున్న ముఖ్యమంత్రి జగన్

Satyam NEWS

విశ్లేషణ: ప్రధాని చెప్పేది విందాం అదే పాటిద్దాం

Satyam NEWS

Leave a Comment