February 28, 2024 09: 05 AM
Slider సినిమా

నేరాల నేపథ్యంలో రక్తికట్టిన ఫ్యామిలీ సెంటిమెంట్ ‘రాఘవరెడ్డి’

#raghavareddy

శివ కంఠమనేని హీరోగా రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘రాఘవ రెడ్డి’. స్పేస్ విజన్ నరసింహా రెడ్డి సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యూజిక్ బ్యానర్‌పై సంజీవ్ మేగోటి దర్శకత్వంలో కె ఎస్ శంకర్ రావ్, జీ. రాంబాబు యాదవ్, ఆర్ వెంకటేశ్వర్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. రక్తం మరకల ఆధారంగా హత్య ఎలా జరిగిదో, ఏ ఆయుధంతో హత్య చేశారో చెప్పగల ఒక క్రిమినాలజీ ప్రొఫెసర్ కథ ఇది.

నేర పరిశోధనలో ఎంతో చాకచక్యంగా వ్యవహరించే రాఘవరెడ్డి తన జీవితంలో ఎదురైన విచిత్ర పరిస్థితులను ఎలా ఎదుర్కొంటాడు అనేది ఈ సినిమా కథ. ఆద్యంతం ఆకట్టుకునే మలుపులతో కథ సాగుతుంది. కొన్ని అపోహల కారణంగా రాఘవరెడ్డి నుంచి ఆయన భార్య (రాశి) విడిపోతుంది. అందులో భాగంగానే రాఘవరెడ్డి తన కుమార్తె (నందితా శ్వేత) కు కూడా దూరంగా ఉండాల్సి వస్తుంది. రాఘవరెడ్డి అనుకోని విధంగా ఒక రోజు భార్యను కలుస్తాడు.

కుమార్తె గురించి అడుగుతాడు. కుమార్తె ఆ సిటీలోనే ఉందని, రాఘవరెడ్డి పని చేసే కాలేజీలోనే చదువుతుంటుందని చెబుతుంది తప్ప మిగిలిన వివరాలు ఇవ్వదు. క్రిమినాలజీలో ప్రొఫెసర్ అయిన రాఘవరెడ్డి తన కుమార్తె ఎవరో కనిపెట్టాలని కూడా భార్య సవాల్ విసురుతుంది. ఈలోపు రాఘవరెడ్డి కుమార్తెను ఎవరో కిడ్నాప్ చేస్తారు. రాఘవరెడ్డే ఈ పని చేశాడని భార్య అనుమానిస్తుంది.

రాఘవరెడ్డి తన భార్య అనుమానాన్ని ఎలా నివృత్తి చేస్తాడు?  తన కుమార్తె జాడ ఎలా కనిపెడతాడు? అనేది ఈ చిత్ర కథాంశం. వెరైటీ సబ్జెక్ట్ అయినా కూడా ఎక్కడా ప్రేక్షకుడికి కన్ఫ్యూజన్ లేకుండా దర్శకుడు కథ నడిపిన విధానం ఆకట్టుకుంటుంది.

హీరో శివ కంఠమనేని తన వయసుకు తగిన పాత్రలో చక్కగా నటించాడు. హావభావాలను చక్కగా పలికించిన శివ కంఠమనేని ఫైట్స్ కూడా ఎంతో సాహసంతో చేశాడు. క్రిమినాలజీ అనే కొత్త సబ్జెక్ట్ ను ప్రేక్షకులకు పరిచయం చేయడానికి దర్శకుడు ఎక్కడా శ్రమ తీసుకోలేదు. కేసులను పరిశోధించేందుకు పోలీసులకు సహకరిస్తున్నట్లు చూపించడం ద్వారా క్రిమినాలజీ సబ్జెక్ట్ ను దర్శకుడు ప్రేక్షకులకు పరిచయం చేస్తాడు. హీరో శివ కంఠమనేని ఈ సినిమాతో నటుడిగా మరొక మెట్టు పైకి ఎదుగుతాడు.

హీరోయిన్ రాశికి ఈ చిత్రం కంబ్యాక్ ఫిలిమ్ అవుతుంది. తెలుగు సినిమాలకు ఇప్పుడు తల్లి క్యారెక్టర్లు చేసే సమర్ధత కలిగిన వారు కావాలి. అలాంటి క్యారెక్టర్ లకు నేను సిద్ధం అంటూ రాశి ఈ సినిమాతో చెప్పినట్లయింది. హీరోయిన్ నందితా శ్వేత ఇప్పటికే చాలా సినిమాల్లో నటించినా ఈ చిత్రంలో ఆమె తనను తాను నిరూపించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. నందితా శ్వేత నటన ఆకట్టుకుంటుంది. మిగిలిన క్యారెక్టర్లలో అన్నపూర్ణమ్మ, పోసాని కృష్ణమురళి, అజయ్, అజయ్ ఘోష్, ప్రవీణ్, శ్రీనివాస రెడ్డి,  బిత్తిరి సత్తి చక్కగా నటించారు.

చిత్రంలో పాటలు ప్రత్యేకంగా పెట్టినట్లుగా కాకుండా స్టోరీలో భాగంగా ఉంటాయి. చిత్రంలో ఎక్కడా అశ్లీలతకు తావులేకుండా ప్రతి ఫ్రేమ్ ఆకర్షణీయంగా ఉండేలా దర్శకుడు జాగ్రత్తలు తీసుకున్నాడు. కథలోని మలుపులు ముందుగా ఊహించేవే అయినా చూడటానికి ఆసక్తి కలిగిస్తాయి. పలురకాల క్రైమ్ కేసులను రాఘవరెడ్డి ఛేదించిన విధానం ప్రేక్షకులకు ఆసక్తి కలిగిస్తుంది.

నేరాలకు సంబంధించిన నేపథ్యంలోనే కథ రాసుకున్నా కూడా ఎక్కడా ఫ్యామిలీ సెంటిమెంటు తగ్గకుండా చూసుకోవడం దర్శకుడి ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తుంది. కథలో భాగంగానే కామెడీ ట్రాక్ నడిపించడం కొద్ది మంది దర్శకులకే సాధ్యం అవుతుంది. దాన్ని సంజయ్ మెగోటీ సమర్ధవంతంగా నిర్వహించారు. మొత్తం మీద రాఘవరెడ్డి సినిమా ప్రేక్షకులను అలరించేదిగానే ఉంది.

నటీనటులు :

శివ కంఠంనేని, రాశి, నందిత శ్వేత, అన్నపూర్ణ, రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి , అజయ్ , పోసాని కృష్ణమురళి, ప్రవీణ్ , అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి, BHEL ప్రసాద్, మీనా వాసు, విజయ్ భాస్కర్, తేలు రాధాకృష్ణ, రాఘవరెడ్డి  తదితరులు.

సాంకేతిక వర్గం:

బ్యానర్ : లైట్ హౌస్ సినీ మ్యాజిక్, సమర్పణ : స్పేస్ విజన్ నరసింహ రెడ్డి, డైలాగ్స్ : అంజన్, లిరిక్స్ : సాగర్ నారాయణ, రచనా సహకారం : సత్యమూర్తి పులిపాక,  పి.ఆర్.ఒ: సురేంద్ర నాయుడు – ఫణి (బియాండ్ మీడియా), మ్యూజిక్ : సంజీవ్ మేగోటి – సుధాకర్ మారియో, ఫైట్స్ : సింధూరం సతీష్, డాన్స్ : భాను, సన్ రే మాస్టర్ (సూర్య కిరణ్), ఎడిటింగ్ : ఆవుల వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్ : కేవీ రమణ, DOP : S. N. హరీష్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : రమణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఘంటా శ్రీనివాస్ రావు, నిర్మాతలు : K. S.  శంకర్ రావ్, G. రాంబాబు యాదవ్, R. వెంకటేశ్వర్ రావు, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సంజీవ్ మేగోటి.

Related posts

డిమాండ్: ఎన్నికలు వాయిదా కాదు వెంటనే రద్దు చేయాలి

Satyam NEWS

‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ సాంగ్ విడుదల

Satyam NEWS

సైబర్ మోసం.. ఇద్దరి వద్ద 73 వేలు మాయం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!